రివ్యూ: ఛల్ మోహన్ రంగ
రేటింగ్: 2.5/5
బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్, పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్
తారాగణం: నితిన్, మేఘా ఆకాష్, లిజి, రావు రమేష్, నరేష్, సత్య, మధునందన్, పమ్మి సాయి, ప్రభాస్ శ్రీను, నర్రా శ్రీను, ప్రగతి తదితరులు
కథ: త్రివిక్రమ్
కూర్పు: ఎస్.ఆర్. శేఖర్
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: ఎన్. నటరాజ సుబ్రమణియన్
నిర్మాత: ఎన్. సుధాకర్ రెడ్డి
రచన, దర్శకత్వం: కృష్ణ చైతన్య
విడుదల తేదీ: ఏప్రిల్ 5, 2018
త్రివిక్రమ్ కథా రచయిత అంటే ఎక్కువ ఎక్సయిట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన రాసే కథలు చాలా మామూలుగానే వుంటాయి. కొత్తరకం పోకడలు, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాలు త్రివిక్రమ్ నుంచి ఆశించలేం. ఒక మామూలు కథని జనరంజకంగా చెప్పడం ఆయన స్టయిల్. ఈమధ్యే పవన్ ఇరవై అయిదవ చిత్రాన్ని అభిమానులకి పీడకలగా మిగిల్చిన త్రివిక్రమ్, ఈసారి నితిన్ ఇరవై అయిదవ సినిమాకి అందించిన కథలోను ఎలాంటి 'ల్యాండ్‌మార్క్' ప్రత్యేకతలు లేవు. ప్రేమలో పడి, విడిపోయి, మళ్లీ కలిసే జంట కథ.
త్రివిక్రమ్ కథ రాయడం వల్ల దీనిపై అతని ముద్ర వుండాలని భావించాడో, లేక కాకతాళీయంగా జరిగిపోయిందో కానీ త్రివిక్రమ్ చిత్రాల్లోని చాలా లక్షణాలు 'ఛల్ మోహన్ రంగ'లోను కనిపిస్తూ వుంటాయి. కథకి ఎక్కువ వెయిట్ ఇవ్వకుండా కామెడీతో నెట్టుకొచ్చేయడం త్రివిక్రమ్ శైలి. కృష్ణ చైతన్య దానినే అనుసరించేసాడు అయితే ఎమోషనల్‌గా కనక్ట్ చేసే ఆ చిన్న త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్‌ని మాత్రం మిస్ అయ్యాడు.
దీంతో కామెడీ పార్ట్ మినహాయిస్తే 'ఛల్ మోహన్ రంగ' నీరసంగా, నిస్తేజంగా తయారైంది. సంభాషణల పరంగాను కృష్ణ చైతన్య అచ్చంగా త్రివిక్రమ్ మీటర్‌నే ఫాలో అయ్యాడు. ఆ అనుకరణ ఎంత పక్కాగా వుందంటే, చాలా సందర్భాల్లో త్రివిక్రమ్ దీనికి కథ మాత్రమే అందించాడా లేక డైలాగ్స్ కూడా రాసాడా అనే అనుమానం కలుగుతుంది.
ప్రాసలతో కూడా కామెడీ పంచ్‌లకి తోడు ఆకట్టుకునే మీనింగ్‌ఫుల్ డైలాగులు కూడా బాగా రాసి మాటల రచయితగా కృష్ణచైతన్య మెప్పిస్తాడు. అయితే దర్శకుడిగా ఈ కథని ఆసక్తికరంగా మలచడంలో విఫలమయ్యాడు. ఏ దశలోను కథనం ఆసక్తి కలిగించకపోగా ముందుకెళ్లే కొద్దీ మరీ ప్రిడిక్టబుల్ అయిపోయి ముగింపు కోసం ఎదురుచూసేట్టు చేస్తుంది.
డ్రామా చిక్కగా పండితే మూడు గంటల నిడివి వున్న సినిమా కూడా హ్యాపీగా చూసేయవచ్చు అని రంగస్థలం ప్రూవ్ చేస్తే, రెండున్నర గంటల కంటే తక్కువ సమయం వున్నా సుదీర్ఘంగా అనిపిస్తుందని ఈ చిత్రం చూపిస్తుంది. ఇంటర్వెల్‌కి కొద్ది సమయం ముందు కథనంలోకి చొరబడ్డ లేజీనెస్ ద్వితీయార్ధంలో జడలు విప్పేసింది. కనక్ట్ చేయాల్సిన లవ్‌స్టోరీకి సంబంధించిన ఒక్క సీన్ కూడా ఆకట్టుకోలేకపోవడంతో కాలం వెల్లదీయడానికి దర్శకుడు కామెడీ సన్నివేశాలపై ఆధారపడాల్సి వచ్చింది.
'ఖైదీ నంబర్ 150'లోని కాయిన్ ఫైట్‌కి పేరడీగా చేసిన సీన్‌తో పాటు జాకీ సీన్ బాగా పండాయి. క్లయిమాక్స్‌కి ముందు పార్టీలో పెట్టిన సుదీర్ఘమైన కామెడీ సీన్ అంతగా నవ్వించలేకపోయింది. హీరో హీరోయిన్లు ఒక్కసారి మాట్లాడుకుంటే శుభం కార్డు పడిపోయే కాన్‌ఫ్లిక్ట్ కావడంతో దానిని డిలే చేయడానికి దర్శకుడు మిగతా అంశాలపై ఆధారపడాల్సి వచ్చింది.
డ్రామా పండించడానికి స్కోప్ వున్న హీరోయిన్ పేరెంట్స్, హీరో పేరెంట్స్ క్యారెక్టర్స్‌ని మరీ క్యారికేచర్స్‌లా తీర్చిదిద్దడంతో 'నవ్వించడం' ఒక్కటే ఎస్కేప్ రూట్‌లా కనిపించినట్టుంది. ఈ ప్రాసెస్‌లో కొన్ని కామెడీ ఎపిసోడ్స్ గిలిగింతలు పెట్టినప్పటికీ కథలోకి వెళ్లాల్సిన ప్రతి సందర్భంలోను ఛల్ మోహన్ రంగ తడబడడమే కాకుండా, త్వరగా ముగించేస్తే బావుండనే భావన కలిగించింది.
ఇరవై అయిదు సినిమాల అనుభవంతో వచ్చిన ఈజ్ నితిన్ నటనలో కనిపించింది. స్టఫ్‌లేని సీన్స్‌లోను అతను చాలా కాన్ఫిడెంట్‌గా, ఎఫర్ట్‌లెస్‌గా కనిపించాడు. 'లై'లోనే ఆకట్టుకోలేకపోయిన మేఘా ఆకాష్ ఇందులోను కంటికి అలవాటు పడడానికి చాలా సమయం తీసుకుంది. లిజి క్యారెక్టర్‌కి ఒక స్కెచ్ అంటూ లేకపోవడంతో ఆమె ఆ పాత్రలో కన్‌ఫ్యూజ్డ్‌గా కనిపించింది. రావు రమేష్‌లో అయితే 'ఎన్నిసార్లు ఇవే చేయిస్తారు' అనే నిర్లిప్తత గోచరించింది. పమ్మి సాయి, మధు నందన్ హీరో స్నేహితులుగా హాస్యానికి దోహదపడ్డారు. సత్య, ప్రభాస్ శ్రీను కూడా నవ్వించడంలో తలా ఒక చెయ్యి వేసారు.
'పెద్దపులి' పాట తక్క తమన్ సంగీతంలో చెప్పుకోతగ్గ మెరుపులు లేవు. నటరాజ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ ఎస్సెట్‌గా నిలిచింది. విజువల్‌గా ఈ చిత్రాన్ని ఆకర్షణీయంగా మలిచాడతను. దర్శకుడు కృష్ణ చైతన్య 'రౌడీ ఫెలో' చిత్రంలో చూపించిన వైవిధ్యం ఇందులో ఇసుమంతైనా చూపించకపోవడం ఆశ్చర్య పరుస్తుంది. అది కమర్షియల్‌గా ఆడలేదు కనుక ఈసారి సేఫ్ గేమ్ ఆడినట్టున్నాడు. అయితే హ్యూమర్‌కి కాస్త కొత్తదనం జోడించినట్టయితే కమర్షియల్ సక్సెస్‌కి కావాల్సిన రైట్ మిక్స్ కుదిరి వుండేది. రౌడీ ఫెలోలో తన దర్శకత్వ శైలి చూసి మెచ్చిన త్రివిక్రమ్ రాసిచ్చిన కథని తన స్టయిల్లో కాకుండా త్రివిక్రమ్‌లానే మలచడానికి ప్రయత్నించడంలో ఆంతర్యమేమిటో అంతు చిక్కదు.
ఒక మంచి కథ చెప్పాలనో, ప్రేక్షకులకి ఆసక్తి కలిగించాలనో, చక్కని సినిమా చూసిన అనుభూతి కలిగించాలనో కాకుండా కాసేపు నవ్వించి పంపేస్తే వాళ్లకి కాలక్షేపమైపోతుంది, మన సినిమా పాస్ అయిపోతుందనే ఎస్కేపిస్ట్ ధోరణి అడుగడుగునా కనిపించిన ఈ చిత్రం కేవలం హాస్యం కోసమే సినిమాలు చూసే వారిని మెప్పించవచ్చునేమో. సినిమా చూసొచ్చిన అనుభూతి కోరుకునే వారికి మాత్రం ఫ్లాట్‌గా, డల్‌గా సాగే ఈ చిత్రం నిరాశే కలిగిస్తుంది. అడపాదడపా వచ్చిపోయే కామెడీ సీన్లతో సక్సెస్ తీరం దాటేసే రోజులు కావివి. హేమాహేమీలు అసోసియేట్ అయిన ఈ చిత్రానికి థియేటర్లకి జనాన్ని రాబట్టే ఆకర్షణలకి లోటు లేదు కానీ, వాళ్లని కదలకుండా కూర్చోబెట్టగలిగే హంగులే లేకుండా పోయాయి.
బాటమ్ లైన్: డల్ మోహన్ రంగ!
– గణేష్ రావూరి