రివ్యూ: భాగమతి
రేటింగ్: 3/5
బ్యానర్: యువి క్రియేషన్స్
తారాగణం: అనుష్క, ఉన్ని ముకుందన్, జయరామ్, మురళి శర్మ, ఆశా శరత్, ప్రభాస్ శ్రీను, ధన్‌రాజ్, విద్యుల్లేఖ రామన్ తదితరులు
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: తమన్
కళ: రవీందర్
ఛాయాగ్రహణం: ఆర్. మధి
నిర్మాతలు: వంశీ, ప్రమోద్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: జి. అశోక్
విడుదల తేదీ: జనవరి 26, 2018
''ఎవడు పడితే వాడు వచ్చి పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా… భాగమతి అడ్డా'' అంటూ 'భాగమతి'పై అంచనాలు పెంచేసిన అనుష్క ఇన్ని కోట్ల ఖరీదైన చిత్రాన్ని సాంతం తన భుజాలపై మోసేసింది. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో ఇంతకంటే పెద్ద సవాళ్లని స్వీకరించిన స్వీటీకి ఈ భాగమతి పెద్ద పనేం పెట్టలేదు. దర్శకుడు అశోక్ ఒక మల్టీజోనర్ సినిమాని హారర్ సినిమాగా ప్రమోట్ చేసి ప్రేక్షకులని 'తెలివిగా' మోసం చేసాడు. కంటికి కనిపించేదంతా నిజం కాదు, వింటున్నదంతా వాస్తవం కాదు… 'రీడ్ బిట్వీన్ ది లైన్స్' అనేది 'భాగమతి' థియరీ. పొలిటికల్ నేపథ్యమున్న హారర్ చిత్రంగా మొదలయ్యే ఈ చిత్రం అనూహ్యమైన మలుపులతో మరో రకంగా ముగుస్తుంది.
ఇది హారర్ చిత్రమా, పొలిటికల్ డ్రామానా, రివెంజ్ థ్రిల్లరా… భాగమతి కథని అనుష్క చెప్పిందా లేక తనకి తెలీకుండానే భాగమతి కథలో భాగమయ్యిందా అనే ప్రశ్నని అలాగే వదిలేస్తూ 'ఓపెన్ ఎండింగ్'తో దర్శకుడు రోలింగ్ టైటిల్స్ వేసేస్తాడు. భాగమతి చిత్రంలోని గొప్పతనమంతా ఈ చిత్రాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన సాంకేతిక నిపుణుల ప్రతిభలోనే దాగి వుంది. భాగమతి కోటని అంత అద్భుతంగా తీర్చిదిద్దిన కళా దర్శకుడు రవీందర్, తన కెమెరా కంటితో అభూత కల్పనకి వాస్తవికతని చేకూర్చిన సినిమాటోగ్రాఫర్ మధి, వీటిని మించి తన అద్భుతమైన నేపథ్య సంగీతంతో ఈ చిత్రానికి ప్రాణం పోసిన తమన్… ఈ చిత్రానికి అసలు సిసలైన కథానాయకులు.
సాంకేతికంగా అత్యున్నత శ్రేణిలో తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మాతల రాజీ పడని ధోరణి కలిసి వచ్చి ఒక రిచ్ ప్రోడక్ట్‌గా భాగమతి రూపం తీసుకుంది. ఇక తెరపై అనుష్కకి సహకారంగా జయరామ్, మురళి శర్మ, ఉన్ని ముకుందన్, ఆశా శరత్ తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోవడంతో భాగమతికి జీవం వచ్చింది. దర్శకుడు అశోక్ రాసుకున్న కథ ఏంటనేది తెలిసిన తర్వాత రొటీనే అనిపించినా కానీ దానికి అతను రాసుకున్న కథనం మెప్పిస్తుంది.
ముఖ్యంగా పతాక సన్నివేశాలకి ముందు వచ్చే మలుపులు ఆశ్చర్య పరుస్తాయి. అంతవరకు ఒక రెగ్యులర్ హారర్ సినిమా ధోరణిలో సాగుతోన్న చిత్రం స్వరూపమే మారిపోతుంది. ఈ తరహా మలుపులు పూర్తిగా తెలియనివి, చూడవిని కాకపోయినా కానీ వాటిని మరోసారి ఎఫెక్టివ్‌గా పండించడంలో భాగమతి బృందం సక్సెస్ అయింది.
అయితే ఇక్కడో చిక్కుంది. ఈ సినిమాని మార్కెట్ చేసిన దానిని బట్టి, ఫస్ట్ హాఫ్‌లో ఇచ్చిన బిల్డప్‌ని బట్టి 'భాగమతి'ని మరో 'అరుంధతి'గా ఊహించుకునే అవకాశం పుష్కలంగా వుంది. ఎప్పుడయితే ఇది ఊహించని మలుపు తిరిగి మరో రకంగా ఎండ్ అయిందో అది కొందరిని నిరాశ పరిచే అవకాశముంది.
ఆ ట్విస్టు పండడం కోసం మార్కెటింగ్‌లో కూడా అరుంధతి షాడో పడుతున్నా కానీ లెక్క చేసినట్టు లేరు కానీ ఆ ఛాయని అంత తేలిగ్గా మర్చిపోయి కొత్త వెలుగుని ఆస్వాదించడం అందరి వల్ల అయ్యే పని కాదు. దర్శకుడు చీట్ చేసాడనే భావన కలిగి నిరుత్సాహ పడినా ఆశ్చర్యం లేదు. అయితే 'థింకింగ్' ఆడియన్స్ నుంచి మాత్రం ఈ ట్విస్టులకి మార్కులు పడతాయి. ముఖ్యంగా ప్రథమార్ధం అంత నిస్సారంగా, ఫ్లాట్‌గా సాగినపుడు ఇలాంటి షాకింగ్ రివలేషన్స్ లేకపోతే కథ రక్తి కట్టదు.
ఆరంభంలో కథ ముందుకి కదలడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అంత బిల్డప్ ఇచ్చిన భాగమతి అడ్డాలోకి చంచల (అనుష్క) ఎంటర్ అయిన తర్వాత కూడా అన్నీ చాలా కామన్‌గానే అనిపిస్తాయి. ఏదో జరగబోతుందనేది తెలుస్తున్నా కానీ అది జరగడానికి చాలా సమయం తీసుకోవడంతో మొదటి గంట విసుగొస్తుంది. ఒక్కసారి చంచల 'భాగమతి'గా మారిన తర్వాత కథ రసకందాయంలో పడుతుంది. ఇంటర్వెల్ పాయింట్‌లో ఇకపై ఇలా వుంటుందనే ఊహలు వుంటే దానికి ఏమాత్రం సంబంధం లేని భిన్నమైన రీతిలో అసలు కథ రివీల్ అవుతుంది.
ఈ ట్విస్టు భేషుగ్గా వున్నప్పటికీ అసలు అంతవరకు వేసిన స్కెచ్‌ని నీట్‌గా, క్లియర్‌గా, కన్‌ఫ్యూజన్ లేకుండా ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. చాలా విషయాన్ని చాలా తక్కువ సమయంలో ఇరికించే ప్రయత్నం చేయడం వల్ల పతాక సన్నివేశాల్లో వుండాల్సిన ఇంపాక్ట్ తగ్గిపోయింది. ప్రథమార్ధంలో అంత సమయం వృధా అయినపుడు వాటిని కాస్త త్వరగా కానిచ్చుకుని చాలా కీలకమైన ఈ అంశాలకి కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సింది. విలన్ ఇంట్రడక్షన్ సీన్‌తో పాటు రివీల్ అయ్యే సీన్‌ని కూడా అవసరానికి మించి సాగదీసిన ఫీలింగొస్తుంది.
స్క్రిప్టుని కాస్త ఫైన్ ట్యూన్ చేసుకుని ఇలాంటివి సరిదిద్దుకుని వుంటే భాగమతి ఇంకా ఎక్కువ ఇంప్రెస్ చేసి వుండేది. అనుష్క హీరోయిన్ అవడం వల్ల అరుంధతిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది థియేటర్లకి వచ్చే అవకాశముంది. ఇది పూర్తిగా మరో తరహా చిత్రమని, దాంతో సంబంధం లేదనే సంగతిని బాగా రిజిష్టర్ చేసి వుండాల్సింది. అరుంధతి లాంటి అద్భుతాన్ని బెంచ్ మార్క్‌గా పెట్టుకుంటే ఏ సినిమాకి అయినా దానిని అందుకోవడం చాలా కష్టమవుతుంది.
దాంతో ఏ సంబంధం లేని ఒక ఇండివిడ్యువల్ సినిమాగా దీనిని పరిగణిస్తే మాత్రం భాగమతి డీసెంట్ అనిపిస్తుంది. ఒక చక్కని కథ, ఆసక్తికరమైన కథనం, ఆకట్టుకునే అభినయం, అన్నిటికీ మించి అబ్బురపరిచే సాంకేతిక నైపుణ్యం 'భాగమతి'ని మిగిలిన సినిమాల మధ్య ప్రత్యేకంగా నిలుపుతుంది. మాస్‌కి కావాల్సిన కమర్షియల్ అంశాలు, టెన్షన్ పెట్టే థ్రిల్లింగ్ అంశాలు కూడా జత కలవడం వల్ల తెలివైన కథనంతో, కాంప్లెక్స్‌గా నెరేట్ చేసిన స్టోరీ అయినప్పటికీ దీనికి అప్పీల్ కూడా ఎక్కువే వుంటుంది. అన్నిటికీ మించి జనాకర్షణకి, ఆదరణకీ అనుష్క వుండనే వుంది.
బాటమ్ లైన్: అనుష్క అడ్డా!
– గణేష్ రావూరి