cloudfront

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: కేరాఫ్‌ సూర్య

సినిమా రివ్యూ: కేరాఫ్‌ సూర్య

రివ్యూ: కేరాఫ్‌ సూర్య
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: సందీప్‌ కిషన్‌, విక్రాంత్‌, హరీష్‌ ఉత్తమన్‌, మెహ్రీన్‌, సత్య, ప్రవీణ్‌, తులసి తదితరులు
కూర్పు: కాశీ విశ్వనాధన్‌
సంగీతం: ఇమ్మాన్‌
ఛాయాగ్రహణం: లక్ష్మణ్‌ కుమార్‌
నిర్మాత: చక్రి చిగురుపాటి
రచన, దర్శకత్వం: సుశీంద్రన్‌
విడుదల తేదీ: నవంబర్‌ 10, 2017

'నా పేరు శివ' డైరెక్టర్‌ సుశీంద్రన్‌ తీసిన 'కేరాఫ్‌ సూర్య' కూడా అదే ఫార్మాట్‌ ఫాలో అవుతుంది. హ్యాపీగా సాగిపోతున్న ఒక యువకుడి (సందీప్‌ కిషన్‌) కుటుంబం కొందరు నేరస్థుల (హరీష్‌ ఉత్తమన్‌) వల్ల ఇబ్బందుల్లో పడుతుంది. ఆ సమస్యని అతడెలా పరిష్కరించాడనేది కథ.ఇటు హీరో లైఫ్‌ని, అటు విలన్‌ యాక్టివిటీస్‌ని ఎస్టాబ్లిష్‌ చేసుకుంటూ రాగా, ఇంటర్వెల్‌ టైమ్‌కి అవి రెండూ క్లాష్‌ అవుతాయి.

అంతవరకు సాఫీగా సాగిపోతున్న తన లైఫ్‌లోకి వచ్చిన ఆ కుదుపు ఏమిటో, ఎవరి వలనో, ఎందుచేతో అర్ధం కాని సూర్య (సందీప్‌) ఆ మిస్టరీని ఎలా చేధిస్తాడనేది 'కేరాఫ్‌ సూర్య' కంప్లీట్‌ సెటప్‌. ప్రథమార్ధం పూర్తిగా సూర్య స్నేహితులు (విక్రాంత్‌, సత్య), జననితో (మెహ్రీన్‌) చిన్న లవ్‌స్టోరీతో సాగుతుంది. హీరో తాలూకు సీన్ల కంటే విలన్‌ సాంబ (హరీష్‌) కార్యకలాపాలే ఆసక్తి కలిగిస్తాయి. కిరాయి హత్యలు చేసే సాంబ తన ఆపరేషన్లని ఎంత క్లీన్‌గా, ఆర్గనైజ్డ్‌గా చేస్తుంటాడనేది బాగా ఎస్టాబ్లిష్‌ అవుతుంది.

ఈ సాంబ సడన్‌గా సూర్య ప్రాణ స్నేహితుడు, అతడిని ప్రేమిస్తోన్న సూర్య చెల్లెలిని చంపడానికి స్కెచ్‌ వేస్తాడు. వారిద్దరికీ కేరాఫ్‌ అయిన సూర్య అతడి బారినుంచి వారినెలా రక్షిస్తాడు? అసలు వారిని టార్గెట్‌ చేసింది సాంబేనని ఎలా తెలుసుకుంటాడు? సాంబ వీరిని ఎందుకు టార్గెట్‌ చేస్తాడు? తదితర మిస్టరీతో కూడిన థ్రిల్లింగ్‌ అంశాలతో ద్వితీయార్ధం సాగుతుంది. ఫస్ట్‌ హాఫ్‌లో హీరోకి సంబంధించిన సెటప్‌ అంతా చాలా సాధారణంగా వుంది. స్నేహితులతో అతని ఇంటరాక్షన్‌ కానీ, అతని లవ్‌ ట్రాక్‌ కానీ ఏమాత్రం ఆకట్టుకోవు. విలన్స్‌ తెర మీదకి వచ్చినపుడే కాస్త ఆసక్తి కలుగుతుంది తప్ప మిగతాదంతా నత్త నడక నడుస్తుంది.

హీరోకి తన కుటుంబంతో వున్న అనుబంధాన్ని, చెల్లెలితో వున్న అటాచ్‌మెంట్‌ని ఎస్టాబ్లిష్‌ చేయడానికి స్కోప్‌ వుండడమే కాదు, అలాంటి సన్నివేశాల అవసరం వున్న కథ ఇది. అలాగే స్నేహితులు ఇద్దరి మధ్య వున్న అనుబంధాన్ని కూడా సరిగ్గా చూపించలేదు. కలిసి మందు కొట్టడమే ఫ్రెండ్‌షిప్‌ అన్నట్టు, కలిసి బైక్‌లో తిరగడమే లవ్‌ అన్నట్టు దర్శకుడు ఆ సన్నివేశాలని చాలా సాదాసీదాగా కానిచ్చేసాడు. ద్వితీయార్థంలో స్నేహితుడు, చెల్లెలి కోసం హీరో తపన పడుతున్నప్పుడు వారి మధ్య వున్న అనుబంధం బలంగా వుంటే ఆ సన్నివేశాలు ఎమోషనల్‌గా కదిలించేవి.

ఈ బలహీనతలని మినహాయిస్తే, ఇంటర్వెల్‌ పాయింట్‌ నుంచి కథనం జోరందుకుంటుంది. హీరోయిన్‌ ట్రాక్‌ వున్నా కానీ అది అసలు కథని డిస్టర్బ్‌ చేయకుండా టోటల్‌గా దానిని ఇగ్నోర్‌ చేయడం మంచి విషయమే. అసలయితే హీరోయినే లేకుండా కూడా ఈ కథ రాసుకుని వుండొచ్చు. కానీ కమర్షియల్‌ హంగుల కోసమని ఆ ట్రాక్‌ని ఫస్ట్‌ హాఫ్‌ వరకు వాడుకున్నారు. ద్వితియార్ధంలో విలన్ల ఆచూకీ తెలుసుకునే సన్నివేశాలన్నీ ఉత్కంఠభరితంగా రూపొందాయి.

సాంబ వేసిన స్కెచ్‌ని అతని అనుచరుడు రివీల్‌ చేసే సీన్‌ మెప్పిస్తుంది. అయితే సూర్య చెల్లెలిని, ఆమె లవర్‌ని టార్గెట్‌ చేయడానికి గల కారణం తేలిపోయింది. అలాగే అంతవరకు ఎక్కడా తమ ఆచూకీ దొరకకుండా పద్ధతిగా మర్డర్లు చేసే విలన్‌ గ్యాంగ్‌ ఒక పాయింట్‌ తర్వాత తమ పద్ధతులు పక్కనపెట్టేసి రెగ్యులర్‌ విలన్ల మాదిరిగా రోడ్డెక్కేయడం బాలేదు. విలన్లని చివరి వరకు అంతే ఆర్గనైజ్డ్‌గా వుంచినట్టయితే పతాక సన్నివేశాలు రక్తి కట్టేవి.

సందీప్‌ కిషన్‌ ఖచ్చితంగా రైట్‌ డైరెక్షన్‌లోనే వెళుతున్నాడు. ఇటీవల అతను ఎంచుకుంటోన్న కథలు అతని మైండ్‌సెట్‌ని తెలియజేస్తున్నాయి. అయితే పూర్తి శాతం మెప్పించే ఒక నిఖార్సయిన కథ అతడిని వెతుక్కుంటూ రాలేదింకా. కేరాఫ్‌ సూర్యలో కూడా కొన్ని మెరుపులున్నాయి కానీ అతను ఆశిస్తున్నట్టుగా కెరీర్‌ని మలుపు తిప్పే మేటర్‌ లేదంతే. నటుడిగా సందీప్‌ చాలా మెరుగయ్యాడు. ప్రీ ఇంటర్వెల్‌, పోస్ట్‌ ఇంటర్వెల్‌ సీన్స్‌లో నటుడిగా రాణించాడు.

అతని స్నేహితుడి పాత్రలో విక్రాంత్‌ నటన ఫర్వాలేదు. మెహ్రీన్‌ క్యారెక్టర్‌కి స్క్రీన్‌ టైమ్‌ ఎక్కువ లేదు. మరోసారి లిప్‌ సింక్‌ కూడా సరిగా ఇవ్వలేని తన బలహీనత మాత్రం ఆ కొద్ది సీన్లలోనే బయటపెట్టుకుంది. హీరో తల్లి పాత్రలో తులసి మరొక్కమారు అవసరానికి మించిన పర్‌ఫార్మెన్స్‌తో విసిగిస్తుంది. కూతురి ప్రేమ విషయం బయట పడినపుడు ఆమె ఇచ్చే రియాక్షన్‌ మరీ ఓవర్‌ ది టాప్‌ వుంది. విలన్‌గా హరీష్‌ ఉత్తమన్‌ నటన ఉత్తమమనిపిస్తుంది.

టెక్నికల్‌గా స్లిక్‌గా వుంది. సినిమా నిడివి అదుపులో వుంచిన ఎడిటర్‌, లైటింగ్స్‌తో మూడ్‌ మెయింటైన్‌ చేసిన సినిమాటోగ్రాఫర్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో ఆకట్టుకున్న ఇమ్మాన్‌ ఈ చిత్రానికి ప్లస్‌ అయ్యారు. స్టంట్స్‌ కూడా మనుషుల్ని ఎత్తి పడేయడం కాకుండా సహజంగా వున్నాయి. ఇమ్మాన్‌ స్వరపరిచిన బాణీలు మాత్రం ఆకట్టుకోలేదు. పైగా రెండు పాటలకి సరైన సిట్యువేషన్‌ కూడా లేదు. దర్శకుడిగా సుశీంద్రన్‌ మళ్లీ 'నా పేరు శివ' శైలిని ఫాలో అయ్యాడు. విలన్‌ ట్రాక్‌ని డీల్‌ చేసిన విధానం బాగుంది. ఎంత బిల్డప్‌తో స్టార్ట్‌ చేసాడో, అదే విధమైన పే ఆఫ్‌ కూడా ఇచ్చినట్టయితే ఇంకా బాగుండేది.

మధ్యమధ్యలో టెన్షన్‌తో నిండిన థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌తో అలరించిన దర్శకుడు అదే టెంపో చివరంటా  మెయింటైన్‌ చేయలేకపోయాడు. ఆసక్తికరమైన సన్నివేశాలకి తోడు, ఎలాంటి ఇంట్రెస్ట్‌ కలిగించని ఎపిసోడ్స్‌ కూడా వస్తూ పోతూ వుండడం వల్ల గ్రాఫ్‌ సరిగా మెయింటైన్‌ అవలేదు. ఉదాహరణకి చెల్లెలు ప్రమాదంలో వుందని తెలుసుకున్న హీరో వెంటనే ఆమెని కాపాడేందుకు వెళ్లకపోగా, మెడికల్‌ ఫీల్డులో జరుగుతున్న అక్రమాలు (అదిరింది చిత్రాన్ని తలపిస్తుంది) గురించి ఒక లెక్చర్‌ ఇస్తాడు. 

అంతవరకు పక్కింటి అబ్బాయిలా కనిపించిన హీరో ఇంటరాగేషన్‌ పేరుతో సడన్‌గా స్లో మోషన్‌లో సూపర్‌స్టార్‌ మాదిరిగా బైక్‌పై ఎలివేషన్‌ సీన్‌ కోసం వెంపర్లాడతాడు. అలాగే కథలోని చిన్న పాయింట్‌కి బలం ఇవ్వడం కోసం మొదట్లో హీరో తండ్రిని చంపేసే సీన్‌ ఇరికించడం, హీరో పట్టుబడితే ఉడుంపట్టులా వుంటుందంటూ దానికోసం ఒక ఎపిసోడ్‌ పెట్టడం లాంటి ప్లాంటింగ్స్‌ ఏవీ పే ఆఫ్స్‌కి హెల్ప్‌ అవ్వలేదు.

రొటీన్‌కి భిన్నమైన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ వెరైటీ కోరుకునే ప్రేక్షకులని కొంతవరకు మెప్పిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌ని ఎంగేజింగ్‌గా మలచడంతో పాటు హై ఇచ్చే క్లయిమాక్స్‌ వున్నట్టయితే కేరాఫ్‌ సూర్య ఖచ్చితంగా బెటర్‌ ఫిలిం అయి వుండేది. ఉత్కంఠపూరిత ఘట్టాలున్నప్పటికీ కథనంలో బిగి లేకపోవడం వల్ల సగటు సూర్యగా మిగిలిపోయింది.

బాటమ్‌ లైన్‌: ఇంకాస్త 'కేర్‌' అవసరం!

- గణేష్‌ రావూరి