సినిమా రివ్యూ: హలో

రివ్యూ: హలో రేటింగ్‌: 3/5 బ్యానర్‌: మనం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అండ్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌ తారాగణం: అఖిల్‌ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్‌, రమ్యకృష్ణన్‌, జగపతిబాబు, అనీష్‌, కృష్ణుడు, ప్రవీణ్‌, అజయ్‌ తదితరులు కూర్పు: ప్రవీణ్‌ పూడి…

రివ్యూ: హలో
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: మనం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అండ్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌
తారాగణం: అఖిల్‌ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్‌, రమ్యకృష్ణన్‌, జగపతిబాబు, అనీష్‌, కృష్ణుడు, ప్రవీణ్‌, అజయ్‌ తదితరులు
కూర్పు: ప్రవీణ్‌ పూడి
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
ఛాయాగ్రహణం: పి.ఎస్‌. వినోద్‌
నిర్మాత: నాగార్జున అక్కినేని
రచన, దర్శకత్వం: విక్రమ్‌ కె. కుమార్‌
విడుదల తేదీ: డిసెంబర్‌ 22, 2017

గుడ్‌ డైరెక్టర్‌కి, బ్యాడ్‌ డైరెక్టర్‌కి డిఫరెన్స్‌ 'బలమైన కథ' చేతిలో లేనప్పుడే ఎక్కువ తెలుస్తుంది. సింపుల్‌ ప్లాట్‌ చేతిలో వుంటే చాలామంది దర్శకులు దానిని ఎలా నడిపించాలో తెలియక ఏవేవో అంశాలని నింపేసి మొత్తానికి ముంచేస్తుంటారు. కానీ విక్రమ్‌ కుమార్‌ లాంటి దర్శకుల దగ్గర పెద్ద విషయం వున్న కథ లేకపోయినా కానీ దాంతోనే కదలకుండా కూర్చోబెట్టగలుగుతారు. 'అనగనగా రాజు' కథతోనే కనికట్టు చేసే కెపాసిటీ వున్న అతి కొద్దిమంది ప్రతిభావంతులైన స్టోరీ టెల్లర్స్‌లో ఒకడైన విక్రమ్‌ కుమార్‌ ఈసారి మనకి తెలిసిన చాలా రొటీన్‌ కథనే ఎంచుకున్నాడు. కానీ ఆ కథనే ఆసారతం విసుగు లేకుండా వీక్షించేట్టు చేసాడు.

చిన్నతనంలో విడిపోయిన ఓ జంట పెరిగి పెద్దయిన తర్వాత ఎలా కలుసుకున్నారనేది ఈ చిత్రం ఇతివృత్తం. 'మనసంతా నువ్వే' నుంచి చాలా సినిమాల్లో చూసిన పాయింటే ఇది. దానికి 'డెస్టినీ' అంటూ 'సెరిండిపిటీ'లోని ఎలిమెంట్‌ని జోడించి తనదైన శైలిలో ఈ కథని విక్రమ్‌ నెరేట్‌ చేసాడు. ఈ మామూలు ప్రేమకథలోకి మొబైల్‌ మాఫియా అనే యాంగిల్‌ని తీసుకొచ్చి యాక్షన్‌కి స్పేస్‌ ఇచ్చాడు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ పేరిట రెగ్యులర్‌ ఫైట్స్‌ జోడించకుండా పార్కౌర్‌ స్టయిల్‌ యాక్షన్‌ని మన సినిమాల్లోకి ఇంట్రడ్యూస్‌ చేసి వాటితో థ్రిల్‌ చేసాడు. అసలు కథ ఒక్క రోజులో కొన్ని గంటల్లో జరిగే సంఘటనల నేపథ్యంలో వుంటుంది. దానికి రెండు ఫ్లాష్‌బ్యాక్స్‌ జోడించి తన మార్కు ఎమోషనల్‌ మూమెంట్స్‌కి చోటు కల్పించాడు.

ఒక ఫ్లాష్‌బ్యాక్‌ పూర్తిగా ప్రధాన జంట బాల్యాన్ని చూపిస్తుంది. ఈ ఎపిసోడ్‌ దాదాపు అరగంట స్పేస్‌ తీసుకోవడం అఖిల్‌ ఫాన్స్‌కి, ఇలాంటి ఛైల్డ్‌ లవ్‌స్టోరీస్‌ చూడడం ఇష్టపడని వారికి నచ్చకపోవచ్చు. అయితే అంతగా ఈ జంట మళ్లీ కలవడం కోసం తపించడానికి ఆమాత్రం స్పేస్‌ ఇవ్వాలని దర్శకుడు భావించి వుండొచ్చు. కేవలం పిల్లల మధ్య బంధం బలపడడం మాత్రమే కాకుండా, హీరో క్యారెక్టర్‌ని జగపతిబాబు, రమ్యకృష్ణ దత్తత చేసుకునే ఎపిసోడ్‌ కూడా యాడ్‌ అవడంతో ఆ పోర్షన్‌ నిడివి పెరిగింది. 

ఇక మరో ఫ్లాష్‌బ్యాక్‌లో ఒకరికి ఒకరు తెలియకుండానే హీరో హీరోయిన్లు పరిచయం కావడం, ఇద్దరి మధ్య ఆకర్షణ ఏర్పడడం, అయితే తమ చిన్ననాటి సోల్‌మేట్స్‌ కోసం ఇద్దరూ అన్వేషణ కొనసాగిస్తూ కలవకపోవడం అనేది ఆ కవర్‌ అవుతుంది. ఈ ఎపిసోడ్‌ని విక్రమ్‌ డీల్‌ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశం ఊహించగలిగేదే అయినా డ్రామా పండించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు.

ఈ రెండు ఫ్లాష్‌బ్యాక్‌లు కాకుండా వీటిని కలిపే మరో త్రెడ్‌ మొబైల్‌ మాఫియా. హీరోయిన్‌ ఆచూకీ సరిగ్గా తెలిసే సమయంలో హీరో ఫోన్‌ పోవడం, దాని కోసం అతను దేనినీ లెక్క చేయకుండా ప్రాణాన్ని రిస్క్‌ చేయడం చూడ్డానికి థ్రిల్లింగ్‌గా వున్నా లాజిక్‌కి దూరంగా వుంది. కాల్‌ లాగ్‌ తెలుసుకోవడం కోసం ప్రాణాలని పణంగా పెట్టకుండా ఈజీ మార్గాలే వున్నాయి. అది మినహాయిస్తే ఈ చిత్రం ఎక్కడా విపరీతాలకి పోదు. ఎమోషన్స్‌ కూడా ఎక్కడా ఓవర్‌ డ్రమెటిక్‌గా అనిపించకుండా సటిల్‌గా వుంటాయి.

నాగార్జున దీనిని రీలాంఛ్‌గా పేర్కొనడం కాదు గానీ… ఇది నిజంగానే అఖిల్‌కి నిజమైన లాంఛ్‌ అనిపించేలా వుంది. మొదటి సినిమాకి జరిగిన పొరపాట్లని పూర్తిగా అధ్యయనం చేసి, మళ్లీ డ్రాయింగ్‌ బోర్డ్‌ దగ్గరకి వెళ్లిపోయి ఎలాంటి లాంఛ్‌ ప్యాడ్‌ కావాలనే దానిపై వర్క్‌ చేసిన విధానం మెప్పిస్తుంది. ముఖ్యంగా కథానుసారం అరగంట సమయం అఖిల్‌ తెరపై కనిపించకపోయినా అక్కినేని కుటుంబం దానికి అడ్డు చెప్పకపోవడం, అఖిల్‌ ఎక్కడా 'హీరోలా' కాకుండా కథకి నాయకుడిలా మాత్రమే కనిపించడం మరో ప్రశంసించదగ్గ అంశం.

మొదటి సినిమాలో చాలా 'ఇబ్బందిగా' కనిపించిన అఖిల్‌ ఈ చిత్రంలో అనుభవమున్న నటుడిలా అనిపించాడు. అతని పాత్ర తాలూకు ఎమోషన్స్‌తో కనక్ట్‌ చేయగలిగాడు. కమర్షియల్‌గా స్టార్‌ ఇమేజ్‌ వచ్చినా, రాకున్నా నటుడిగా అఖిల్‌ ఈ చిత్రంతో ఖచ్చితంగా ఒక ఇంప్రెషన్‌ అయితే వేయగలడు. అతడికి వంకలు పెట్టడానికి ఏమీ లేదన్నట్టు పరిపూర్ణ నటుడిలా అనిపిస్తాడు.

కళ్యాణి ప్రియదర్శన్‌ నటన బాగుంది. తారాగణంలో రమ్యకృష్ణ ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌. అఖిల్‌ తనని తొలిసారిగా 'అమ్మ' అని పిలిచే సన్నివేశంలో రమ్యకృష్ణ నటన అద్వితీయం. ఆ మూమెంట్‌ని విక్రమ్‌ కుమార్‌ ఇంకా అద్భుతంగా బంధించాడు. కెమెరా సరాసరి మహానటి రమ్యకృష్ణ ఫేస్‌పై పెట్టి ఆమె రియాక్షన్‌ క్యాప్చర్‌ చేసిన విధానం సింప్లీ సూపర్బ్‌. నిస్సందేహంగా ఈ చిత్రానికి ఇదే బెస్ట్‌ సీన్‌. జగపతిబాబు కూడా అఖిల్‌ దత్త తండ్రిగా మెప్పించాడు. మిగిలిన వారిలో ఎవరికీ గుర్తుండే పాత్రలు దక్కలేదు. అజయ్‌ విలన్‌లా అనిపిస్తాడు కానీ హీరో హీరోయిన్ల ప్రేమ ప్రయాణంలో అతనో ప్రతిబంధకమే తప్ప ప్రతినాయకుడు కాదు.

సాంకేతికంగా ఈ చిత్రాన్ని ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించారు. ఉత్కంఠ రేపే స్టంట్‌ డిజైన్‌కి తోడు కనువిందైన ఛాయాగ్రహణం, ప్రొడక్షన్‌ డిజైన్‌ ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌. ప్రధానంగా యాక్షన్‌ సన్నివేశాల్లో సినిమాటోగ్రాఫర్‌ ప్రతిభ అమోఘం. సంగీత దర్శకుడిగా అనూప్‌ మంచి మార్కులు వేయించుకుంటాడు. వినడానికి బాగున్న పాటల్ని ఇంకా అందంగా తెరకెక్కించారు.

నాగార్జున తనయుడి కోసం ఎంత ఖర్చు చేయగలరో తెరపై కనిపిస్తుంది. దర్శకుడిగా విక్రమ్‌ కుమార్‌ ఇప్పటికే ఉన్నత ప్రమాణాలు సెట్‌ చేసుకున్నాడు. వాటిని అందుకునేంత గొప్ప లక్షణాలు హలో చిత్రంలో లేకపోయినప్పటికీ అతడి ప్రతిభని ఏమాత్రం శంకించనివ్వని ప్రోడక్ట్‌గా ఇది రూపొందింది. ఎందుకో కాస్త హడావిడిగా ఈ చిత్రాన్ని లాగించేసిన భావన కొన్ని సందర్భాల్లో కలుగుతుంది. ఇంకాస్త సమయం ఇచ్చినట్టయితే మరింత పకడ్బందీగా ఈ చిత్రాన్ని రూపొందించి వుండేవాడేమో.

ప్రోమోస్‌తో యాక్షన్‌ సినిమా అనే భావన కలిగించే ప్రయత్నం రాంగ్‌ పబ్లిసిటీ అనిపిస్తుంది. ఇది ప్రధానంగా ఎమోషనల్‌ లవ్‌స్టోరీనే తప్ప యాక్షన్‌ లవ్‌స్టోరీ కానే కాదు. కథలో ఒక భాగమైన ఆ పార్ట్‌ని మరీ అంతగా హైలైట్‌ చేయకుండా వుండాల్సిందేమో. బలహీనతలు, మైనస్‌లు వున్నప్పటికీ ఆద్యంతం విసిగించని వినోదానికి అయితే లోటు లేదిందులో. అఖిల్‌, కళ్యాణి నటన, వీనుల విందైన సంగీతం, కను విందైన దృశ్యాలు, కదిలించే భావోద్వేగాలు వెరసి 'హలో'ని ఆహ్లాదభరిత చిత్రంగా మలిచాయి. 'ఐ హేట్‌ యు' అనేది ప్రేమని వ్యక్తం చేయడానికి 'ఆకాశం'లాంటి ఎక్స్‌ప్రెషన్‌ అయితే, 'ఐ లవ్యూ' అనేది పర్వతం స్థాయి ఎక్స్‌ప్రెషన్‌ అని ఇందులో ఒక థియరీ వుంది. దాని ప్రకారం చూస్తే విక్రమ్‌ కుమార్‌ తీర్చిదిద్దిన ఈ చిత్రానికి 'ఐ హేట్‌ యూ' చెప్పలేం కానీ 'ఐ లవ్యూ' చెప్పడానికి వెనుకాడబోం.

బాటమ్‌ లైన్‌: పర్‌ఫెక్ట్‌ రీలాంఛ్‌!

– గణేష్‌ రావూరి