Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: జైసింహా

సినిమా రివ్యూ: జైసింహా

రివ్యూ: జైసింహా
రేటింగ్‌: 2.25/5
బ్యానర్‌: సికె ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి, హరిప్రియ, బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్‌, అశుతోష్‌ రాణా, ప్రభాకర్‌, ప్రియ, మురళిమోహన్‌, జయప్రకాష్‌రెడ్డి తదితరులు
కథ, మాటలు: ఎం. రత్నం
కూర్పు: ప్రవీణ్‌ ఆంటోని
సంగీతం: చిరంతన్‌ భట్‌
ఛాయాగ్రహణం: సి. రాంప్రసాద్‌
నిర్మాత: సి. కళ్యాణ్‌
కథనం, దర్శకత్వం: కె.ఎస్‌. రవికుమార్‌
విడుదల తేదీ: జనవరి 12, 2018

సంక్రాంతి, సింహా... ఈ రెండూ అంటే బాలకృష్ణకి సెంటిమెంటు. టైటిల్‌లో సింహమున్నా, తన సినిమా సంక్రాంతికి రిలీజ్‌ అయినా రిజల్ట్‌ ఎక్కువసార్లు పాజిటివ్‌గా వుంటుందని చాలా సార్లు ప్రూవ్‌ అయింది. అయితే సంక్రాంతికి వచ్చి గర్జించని సీమసింహాలు, అలరించని పరమవీరచక్రలు, అంచనాలని పటాపంచలు చేసిన ఒక్కమగాళ్లు కూడా వున్నాయనుకోండి. అది వేరే సంగతి. ఈ సంక్రాంతికి గర్జించిన బాలయ్య లేటెస్ట్‌ సింహం... 'జై సింహా'. ట్రెండ్‌కి తగ్గ సినిమాలు అందించలేకపోతోన్న కె.ఎస్‌. రవికుమార్‌ తనదైన శైలిలో బాలకృష్ణని ఒక మాస్‌, ఫ్యామిలీ డ్రామాలో ప్రెజెంట్‌ చేసాడు.

ఈ కథ, కథనం, చిత్రీకరణ అన్నీ కూడా పాత సినిమాలని తలపిస్తాయే తప్ప కొత్త చిత్రం చూస్తోన్న అనుభూతిని అసలు కలిగించవు. బాలకృష్ణ సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించే బాణీ ఇందులోను ఫాలో అయ్యారు. ఆగ్రహాన్ని అణచివేసుకుంటూ, చంటి పిల్లాడిని చేతిలో ఎత్తుకుని ఊళ్లు తిరుగుతోన్న నరసింహ (బాలకృష్ణ) వెనకో 'నరసింహనాయుడు' ఫ్లాష్‌బ్యాక్‌ వుందనే బిల్డప్‌ ఇస్తారు. ఫస్ట్‌ హాఫ్‌ ఎంత నిస్సారంగా సాగుతున్నా కానీ తదుపరి ఆస్వాదించబోయే బాలయ్య మార్కు రౌద్ర రసానుభూతి వల్ల ఆసక్తి పూర్తిగా సన్నగిల్లదు.

చంద్రముఖిలో వడివేలు చేసిన కామెడీని మళ్లీ బ్రహ్మానందంతో రిపీట్‌ చేయించి, నవ్వుతారా లేదా అన్నట్టు అదే పనిగా నెత్తిన రుద్దుతోన్న హాస్యాన్ని భరిస్తూ, డ్రగ్స్‌ మత్తులో జోగుతోన్న ఒక హీరోయిన్‌ తాలూకు ట్రాక్‌ని తట్టుకుంటే అక్కడక్కడా ఒక బాలయ్య మార్కు పవర్‌ఫుల్‌ సన్నివేశమో, డైలాగో వచ్చి అంతో ఇంతో అలరిస్తుంది. ప్రతి సినిమాలోను ఎవరో ఒకరి తరఫున వకాల్తా తీసుకుని వారి గురించి ఒక సుదీర్ఘమైన డైలాగ్‌ చెప్పి శభాష్‌ అనిపించే బాలకృష్ణ ఈసారి బ్రాహ్మణులు, పూజారుల గొప్పతనం చాటిచెప్పే ఒక ఎపిసోడ్‌ వుంది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఆ సన్నివేశం, ఇంటర్వెల్‌లో వచ్చే చిన్నపాటి ట్విస్టు సెకండ్‌ హాఫ్‌పై అంచనాలు పెంచుతాయి.

తీరా ఆ మోస్ట్‌ అవైటెడ్‌, మచ్‌ నీడెడ్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఓపెన్‌ చేసి చూస్తే... బాలకృష్ణ ఒక లవర్‌బాయ్‌ తరహా పాత్రలో కనిపించి ట్విస్టిస్తారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి పవర్‌ఫుల్‌ నేపథ్యం వుందని అనుకుంటే, నయనతారని ప్రేమిస్తూ ఆ సంగతి ఆమె తండ్రికి (ప్రకాష్‌రాజ్‌) చెప్పడానికి భయపడే బాలయ్య కనిపిస్తాడు. ఈ కథలోను ఒక విలన్‌ వుంటాడు కానీ, ఆరంభంలో ఆవేశాన్ని అణచిపెట్టుకునేంత బిల్డప్‌కి తగ్గ బ్యాక్‌గ్రౌండ్‌ అయితే ఏదీ కనిపించదు. సన్నివేళ బలం లేకుండా సాగదీసిన ఈ ఫ్లాష్‌బ్యాక్‌ మనం ఎక్స్‌పెక్ట్‌ చేసే కథ కాకుండా మరేదో చూపిస్తుంది. అదే సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌ అనుకున్నారో ఏమో నడిపించే కథనంపై కాస్తయినా శ్రద్ధ వహించలేదు.

పతాక సన్నివేశాల్లోను బాలయ్యని 'త్యాగయ్య'గా చూపించడం మీదే ఎక్కువగా దృష్టి పెట్టడంతో ఆయన సినిమాల్లో కనిపించే పవర్‌ఫుల్‌ మాస్‌ సీన్లు కానీ, చప్పట్లు కొట్టించే పంచ్‌ డైలాగులు కానీ లేకుండా పోయి సెకండాఫ్‌ పూర్తిగా నిరాశ పరుస్తుంది. లవ్‌ ట్రాక్‌ అంత ఇంపార్టెంట్‌ అనుకున్నపుడు 'లక్ష్మీనరసింహా' తరహాలో ఆసక్తిదాయకమైన రొమాన్స్‌ ఎపిసోడ్స్‌ వుండాలే కానీ ఇలా ఎప్పుడవుతుందని ఎదురు చూసే ప్రేమ ప్రహసనాలు ఏమిటో మరి? మరో హీరోయిన్‌ (హరిప్రియ) ట్రాక్‌ కూడా వుంది కానీ దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కథాపరంగా మేటర్‌ అయితే వుంది కానీ దానికి రాసుకున్న కథనం, చిత్రీకరించిన విధానం మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తుంది.

బాలకృష్ణ ఈ ఏజ్‌లోను వేసిన గ్రేస్‌ఫుల్‌ డాన్సులు, ఫైట్స్‌లో చూపించిన ఎనర్జీ అభిమానులని అలరిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లోని మెకానిక్‌ క్యారెక్టర్‌ స్టయిలిష్‌గా వుంది కానీ అజ్ఞాతంలో వున్న పాత్రకి స్టయిలింగ్‌ పరంగా కేర్‌ తీసుకోవాల్సింది. నయనతార మెప్పించడానికి తగ్గ కంటెంట్‌ వున్న సీన్స్‌ ఏమీ లేవు. మిగిలిన ఇద్దరు హీరోయిన్లు యాక్షన్‌, కట్‌ మధ్య వచ్చింది చేసారంతే. బ్రహ్మానందం కామెడీ ఫైనల్‌ కట్‌లో స్థానం ఎలా సంపాదించిందా అనిపిస్తుంది. విలన్స్‌, క్యారెక్టర్‌ యాక్టర్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ కమెడియన్స్‌ అందరూ కూడా పాత కాలం సినిమానో, ఈ కాలం లో బడ్జెట్‌ టెలివిజన్‌ సీరియలో చూస్తోన్న ఫీలింగ్‌ ఇస్తారు.

సాంకేతికంగా చెప్పుకోతగ్గ పాయింట్‌ ఒక్కటీ లేదు. చిరంతన్‌ బాణీలు క్యాచీగా లేవు. నేపథ్య సంగీతం అవసరానికి మించిన వాయిద్యాలతో హోరెత్తిస్తుంది. దర్శకుడిగా కె.ఎస్‌. రవికుమార్‌ ఈ తరం టేస్ట్‌కి తగ్గట్టు అప్‌డేట్‌ అవలేదు. టెక్నికల్‌గాను ఇప్పటి సాంకేతిక విప్లవాన్ని వాడుకునేందుకు అస్సలు ట్రై చేయలేదు. చిత్రీకరణ సంగతి ఎలా వున్నా కనీసం డ్రామా అయినా బాగా పండించాల్సింది. హీరోది ప్రేమ కోసం పెద్ద త్యాగం చేసే పాత్ర అయినప్పటికీ అందుకు తగ్గట్టుగా ఎమోషన్లని పండించలేదు. మరోవైపు బాలకృష్ణ సినిమాల్లో మస్ట్‌గా వుండాల్సిన పవర్‌ఫుల్‌ సన్నివేశాలకీ చోటివ్వలేదు. వీక్‌ విలన్లని పెట్టి బాలకృష్ణ చేతులు కట్టేయడంతో ఒక లెవల్‌ దాటిన తర్వాత ఈ చిత్రాన్ని ఆయన సయితం నిలబెట్టలేకపోయారు.

బాలయ్య అభిమానులు, బి అండ్‌ సి సెంటర్లలో ఫిమేల్‌ ఆడియన్స్‌ ఆదరిస్తే ఈ చిత్రం ఈ పండగ సీజన్‌తో కొంతవరకు బెనిఫిట్‌ అవగలదు. పక్కన స్ట్రాంగ్‌ అపోజిషన్‌ లేకపోవడం కూడా కలిసివచ్చే మరో ఎలిమెంట్‌. కమర్షియల్‌ రిజల్ట్‌ సంగతి ఎలాగున్నా కంటెంట్‌ పరంగా మాత్రం ఈ సంక్రాంతికి ఇదో మరో దిగ్భ్రాంతికర చిత్రమే అనడంలో నో డౌట్‌. 

బాటమ్‌ లైన్‌: మృగరాజు కాదు... త్యాగరాజు!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?