cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: జవాన్‌

సినిమా రివ్యూ: జవాన్‌

రివ్యూ: జవాన్‌
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: అరుణాచల్‌ క్రియేషన్స్‌
తారాగణం: సాయి ధరమ్‌ తేజ్‌, ప్రసన్న, మెహ్రీన్‌, సుబ్బరాజు, జయప్రకాష్‌, కోట శ్రీనివాసరావు, సత్యం రాజేష్‌ తదితరులు
కూర్పు: మధు
సంగీతం: తమన్‌
ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌
సమర్పణ: దిల్‌ రాజు
నిర్మాత: కృష్ణ
రచన, దర్శకత్వం: బి.వి.ఎస్‌. రవి
విడుదల తేదీ: డిసెంబర్‌ 1, 2017

ఆదినుంచీ మాస్‌ మసాలా సినిమాలకి కట్టుబడ్డ సాయిధరమ్‌ తేజ్‌ ఈసారి పంథా మార్చాడు. తన రెగ్యులర్‌ బాణీలోంచి బయటకి వచ్చి కొత్త అటెంప్ట్‌ చేసాడు. అలా అని 'జవాన్‌'లో తేజ్‌ కంప్లీట్‌గా పాసివ్‌గా వుండడమో లేదా టూ క్లాస్‌గా కనిపించడమో చేయలేదు. యాక్షన్‌కి లోటు లేని చిత్రమే అయినప్పటికీ రొటీన్‌ పోకడలకి పోకుండా 'ధృవ' మాదిరిగా డిఫరెంట్‌ సినిమా చూసిన అనుభూతినిస్తుంది 'జవాన్‌'.

ఎంతటి ముప్పు వచ్చినా తప్పు చేయని హీరో, డబ్బు కోసం ఏమి చేయడానికైనా వెనుకాడని విలన్‌, డిఆర్‌డిఓ (డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) బ్యాక్‌డ్రాప్‌... 'జవాన్‌'కి ప్లాట్‌ అయితే భేషుగ్గా కుదిరింది. డైరెక్టర్‌ బి.వి.ఎస్‌. రవి ఎంచుకున్న ఇతివృత్తం అటెన్షన్‌ రాబట్టుకునేలానే వుంది. ఈ కథని ఆసక్తికరంగా నడిపించడంలోను అతని కృషి తెలుస్తుంది. అయితే కీలకమైన సన్నివేశాల దగ్గర చూపిన అలసత్వం కారణంగా బలంగా స్టాంప్‌ వేయాల్సిన సినిమా కాస్తా సగటు స్థాయిని దాటలేకపోయింది.

డిఆర్‌డిఓ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఒక అత్యాధునిక క్షిపణి (ఆక్టోపస్‌) చేజిక్కుంచుకోవడానికి కేశవకి (ప్రసన్న) అయిదు వందల కోట్ల ఆఫర్‌ వస్తుంది. దానిని సాధించే క్రమంలో జై (తేజ్‌) దృష్టిని ఆకర్షిస్తాడు. తనకి బాగా కావాల్సినవాడయిన బాబాయ్‌ (కోట) మరణంతో జై మొత్తం డొంక అంతా కదిలేలా తీగ లాగేస్తాడు. కేశవ ప్లాన్‌ ఫెయిలవడంతో ప్లాన్‌ బి అమలు చేస్తాడు. ఈసారి ఆక్టోపస్‌ తెచ్చి జై స్వయంగా తనకిచ్చేలా అతని పక్కనే వుండి ప్రళయం సృష్టించాలని వెళతాడు. కుటుంబం రిస్కులో పడ్డప్పుడు జై ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కొంటాడు. నీడలా వెంటాడుతోన్న శత్రువు ఆచూకి ఎలా కనుగొంటాడు?

ఈ సెట్‌అప్‌ మొత్తం థ్రిల్లింగ్‌గానే వుంది కానీ కీలకమైన చోట్ల హీరోకి తగిన ఛాలెంజ్‌ విసరడంలో విలన్‌ విఫలమవుతూ వుండడం వల్ల ఉత్కంఠ కొరవడింది. డిఆర్‌డిఓ సెక్యూరిటీ సిస్టమ్‌ని అపహాస్యం చేస్తున్నట్టుగా ఆ ఆక్టోపస్‌ తరలింపు కార్యక్రమం చాలా కన్వీనియంట్‌గా అనిపిస్తుంది.

సూట్‌కేస్‌లో పట్టే తేలికపాటి క్షిపణిని కంటెయినర్‌లో రోడ్డు మార్గంలో రెండు జీపుల సెక్యూరిటీతో తరలించడం దేనికి? అయిదు వందల కోట్ల డీల్‌ కుదుర్చుకున్న విలన్‌ ఒక లారీతో గుద్దించేసి క్షిపణి చేజిక్కించుకోవాలని ప్లాన్‌ చేయడమేంటి? ఎక్కడైతే ఆలోచనలతో మంత్ర ముగ్ధుల్ని చేయాలో, ఏ సన్నివేశాలయితే సినిమాని మరో స్థాయికి చేరుస్తాయో అలాంటి కీలకమైన సందర్భాల దగ్గర దర్శకుడు పలుమార్లు పట్టు సడలించడంతో జవాన్‌ బలహీనపడింది.

ఈ మిషన్‌ ఫెయిల్‌ సీన్‌ తర్వాత మరో పేలవమైన సీన్‌ ఇంటర్వెల్‌ ముందొస్తుంది. ఫ్యామిలీ అంతా డేంజర్‌లో పడ్డప్పుడు ఎవరిని ఎలా కాపాడాలో తెలియని స్థితిలో పడిపోయిన హీరో ఏం చేస్తాడా అని కళ్లు రిక్కించి చూస్తుండగా మరో ఎస్కేపిస్ట్‌ సీన్‌తో గాలి పోతుంది.

'ఏం జరగబోతోంది?' అనే టెన్షన్‌ మొదలైన ప్రతిసారీ సమస్యని సింపుల్‌గా సాల్వ్‌ చేసి పారేయడం వల్ల అటు విలన్‌ పవర్‌ కానీ, ఇటు హీరో ఇంటిల్లిజెన్స్‌ కానీ హైలైట్‌ అవ్వవు. ద్వితియార్ధంలో విలన్‌ సరాసరి హీరో ఇంటికి వచ్చేసరికి ఆసక్తి కలిగించే క్యాట్‌ అండ్‌ మౌస్‌ గేమ్‌కి రంగం సిద్ధమనిపిస్తుంది.

కానీ ఇంటర్నేషనల్‌ క్రైమ్‌ చేసే విలన్‌ చేసేదేంటి? నిజాయితీ పరుడైన హీరో తండ్రిపై (జయప్రకాష్‌) లంచం తీసుకున్నాడనే ఆరోపణ తీసుకురావడం... హీరోకి తన అనుచరుడు దొరికేస్తాడనే భయం కలిగిన ప్రతిసారీ తన వాళ్లని తనే చంపేయడం! హీరో ఏమి చేస్తున్నాడనేది పక్కనే వుండి తెలుసుకుంటోన్న విలన్‌ అతడితో ఎంతగా ఆడుకోవాలి? అతడి కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ ఎంత టెన్షన్‌ పెట్టాలి? ఎప్పుడూ ఫోన్లో హీరోతో ముచ్చటించడం మినహా అతను ఎక్కడా త్రెట్‌లా అనిపించడు. తనకి కావాల్సిన ఆక్టోపస్‌ని సాధించడానికి అర్జెన్సీ చూపించడు.

కథాపరంగా చిన్న లైన్‌ అయినా కానీ దానిని నడిపించే కథనం రాసుకోవడంలో రవి సక్సెస్‌ అయ్యాడు కానీ సన్నివేశ బలం చేకూర్చడం, ఉత్కంఠ రేకెత్తించే అంశాలని జోడించడంలో విఫలమయ్యాడు. అన్నిటికీ మించి విలన్‌ ఎవరనేది హీరో కనిపెట్టే సీన్‌ పట్ల పెరిగిన ఆసక్తిపై నీళ్లు చల్లేస్తూ ఒక పేలవమైన రివీలింగ్‌ సీన్‌ సృష్టించాడు. పతాక సన్నివేశాలకి వచ్చే సరికి 'ఈమాత్రం చాలు' అనే ధోరణి చూపించాడు.

కామెడీ లాంటి అంశాలు జోడించి కథని పక్కదారి పట్టించకుండా చూసుకోవడం మెచ్చుకోతగ్గ విషయమే కానీ రొమాన్స్‌ త్రెడ్‌ మాత్రం అవసరానికి మించి అసలు కథకి అడ్డు తగలకుండా చూసుకోలేదు. హీరోయిన్‌ ఎంటర్‌ అయిన ప్రతిసారీ సాంగ్‌లోకి కట్‌ అవడం ఇలాంటి తరహా సినిమాలకి తెలివైన పని అనిపించుకోదు.

మొదట్లో విలన్‌ ఎవరనేది తనకి దొరికిన క్లూస్‌తో హీరో ట్రేస్‌ చేసుకుంటూ వెళ్లిపోవడం లాంటి విషయాలని చాలా వేగంగా, అరెస్టింగ్‌గా చూపించిన దర్శకుడు అదే స్కార్క్‌ని తర్వాత కొనసాగించలేకపోయాడు. హీరో పక్కనే విలన్‌ని తీసుకొచ్చి పెట్టడం లాంటి ఆసక్తి రేకెత్తించే అంశాలని కథలోకి ప్రవేశపెట్టినా కూడా వాటిని ఎఫెక్టివ్‌గా వాడుకోలేకపోయాడు. అయితే తన ఆలోచనలని ప్రెజెంట్‌ చేయడంలో మాత్రం బి.వి.ఎస్‌. రవి ప్రతిభ కనబరిచాడు. సాంకేతికంగా ఈ చిత్రాన్ని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాడు.

తమన్‌, గుహన్‌ ఇద్దరూ ఈ చిత్రానికి హార్ట్‌ అండ్‌ సోల్‌ అయ్యారు. తమన్‌ నేపథ్య సంగీతం సాధారణమైన సన్నివేశాలని కూడా అద్భుతంగా ఎలివేట్‌ చేయగా, గుహన్‌ ఛాయాగ్రహణం కట్టి పడేస్తుంది. తమన్‌ స్వరపరిచిన పాటలు సైతం బాగున్నాయి. 'బంగారు' పాట చిత్రీకరణ చాలా బాగుంది. తేజ్‌ కెరీర్‌లోనే విజువల్‌గా బెస్ట్‌ సాంగ్‌ అని చెప్పాలి. సంభాషణల రచయితగా దేశభక్తి గురించిన మాటల్లో రవి టాలెంట్‌ తెలుస్తుంది. క్వాలిటీ పరంగా రాజీ పడకుండా పెద్ద సినిమాలకి తీసిపోని నిర్మాణ విలువలు కనిపిస్తాయి.

సాయి ధరమ్‌ తేజ్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. నటుడిగా తన స్కిల్స్‌ పరీక్షించే సన్నివేశాలున్నాయి. ఎక్కడా ఎలాంటి లోపం లేని నటనతో తేజ్‌ ఈ చిత్రంతో నటుడిగా ఫుల్‌ మార్కులు వేయించుకుంటాడు. విలన్‌ పాత్రలో ప్రసన్న కూడా చక్కని నటనతో ఆకట్టుకున్నాడు. తెరవెనుక నుంచి తమన్‌, గుహన్‌లనుంచి వచ్చిన సపోర్ట్‌ని తెరపై వీరిద్దరూ సద్వినియోగం చేసుకున్నారు. వీళ్ల నలుగురి కృషికి తగ్గ సన్నివేశ బలం తోడయినట్టయితే జవాన్‌ ది బెస్ట్‌ అనిపించుకునేవాడు. ముఖ్యమైనవన్నీ చక్కగా కుదిరిన జవాన్‌కి ఆ ఒక్క లోటే పెద్ద బలహీనతగా మారి సగటు మార్కులతో మిగిలిపోయాడు.

బాటమ్‌ లైన్‌: బోర్డర్‌లోనే ఆగిపోయాడు!

- గణేష్‌ రావూరి