Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: కర్తవ్యం

సినిమా రివ్యూ: కర్తవ్యం

రివ్యూ: కర్తవ్యం
రేటింగ్‌: నాట్‌ అప్లికబుల్‌ 
బ్యానర్‌: ట్రైడెంట్‌ ఆర్ట్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: నయనతార, సును లక్ష్మి, రామచంద్రన్‌ దురైరాజ్‌, రామ్‌దాస్‌, వేల రామమూర్తి తదితరులు
కూర్పు: రూబెన్‌
సంగీతం: జిబ్రాన్‌
ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్‌
నిర్మాతలు: ఆర్‌. రవీందర్‌, శరత్‌ మరార్‌
కథ, కథనం, దర్శకత్వం: గోపి నైనార్‌
విడుదల తేదీ: మార్చి 16, 2018

అదో మారుమూల గ్రామం. తాగడానికి మంచినీళ్లు లేక మైళ్ల దూరం వెళ్లి నీళ్లు మోసుకొచ్చే జనం. ఇస్రో రాకెట్‌ లాంఛింగ్‌ సైట్‌ అక్కడికి దగ్గర్లోనే వుంటుంది. రాకెట్‌ పైకెగిసిన ప్రతిసారీ అక్కడి జనం పండగ చేసుకుంటారు. 'ఎందుకు?' అని అడిగితే 'మన దేశం గొప్పతనాన్ని సంబరంగా జరుపుకోవద్దా?' అని అడుగుతుంది ఆ ఊరికి చెందిన స్త్రీ. తృప్తిగా మంచినీళ్లు తాగే సౌకర్యం కల్పించలేని దేశాన్ని వాళ్లు తిట్టుకోరు సరికదా... అది సాధించే విజయాలని పండగలా జరుపుకుంటారు.

ఒకవైపు ఇస్రో రాకెట్‌ లాంఛింగ్‌ సైట్‌... మరోవైపు అధికారుల నిర్లక్ష్యంగా తవ్వి వదిలేసిన బోరు బావిలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారి! దర్శకుడు గోపి నైనార్‌ మన దేశపు బొమ్మ-బొరుసుని నిక్కచ్చిగా, పచ్చిగా, నిర్మొహమాటంగా వెండితెరపై ఆవిష్కరించాడు. పదులకొద్దీ రాకెట్లని అంతరిక్షంలోకి పంపించేంత వనరులున్న మహా భారతావనిలో, బోరు బావిలో పడిపోయిన చిన్నారిని సురక్షితంగా బయటకి తీసే కనీస సదుపాయాలు లేవని చాలా తెలివిగా చెప్తాడు.

నిత్యం వార్తల్లో చూసే 'బోరుబావిలో పడిపోయిన చిన్నారి' వార్తల నుంచి అల్లిన కథే ఇది. ఆ బోరుబావులు అలా నిర్లక్ష్యంగా ఎందుకు వదిలేస్తుంటారు, ఆ బావిలో పడిన చిన్నారి కన్నవాళ్లు, సొంతవాళ్ల పరిస్థితేంటి, ఆ చిన్నారులని కాపాడడానికి వచ్చే అధికారుల మైండ్‌సెట్‌ ఎలా వుంటుంది లాంటివన్నీ కళ్లకి కట్టినట్టు చూపించాడు దర్శకుడు.

కాస్తయినా షుగర్‌ కోట్‌ లేకుండా వాస్తవాన్ని అత్యంత రియలిస్టిక్‌గా తెరకెక్కించాడు గోపి నైనార్‌. ఏ పాప అయితే బోరు బావిలో పడిపోతుందో, వారి కుటుంబాన్ని ముందుగా ఎస్టాబ్లిష్‌ చేస్తాడు. ఆశకీ, ఆకలికీ మధ్య కొట్టుకుంటోన్న వారి జీవితాలపై అవగాహన కల్పించిన తర్వాత ఆ కుటుంబానికి అతి పెద్ద కష్టం ఎదురైతే ఎవరెవరు ఎలా స్పందిస్తారనేది చూపిస్తాడు.

ప్రజా సేవ చేయడానికే ఐఏఎస్‌ చదివిన మధువర్షిణి (నయనతార) బోరుబావిలో పాప పడిపోయిందని తెలిస్తే అక్కడికి హుటాహుటిన వెళ్లి కాపాడాలని చూస్తుంది. అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం, అవినీతి ఆమెని సవాల్‌ చేస్తుంటాయి. యంత్రాలతో, మందీమార్బలంతో కాని దానిని ఆమె ఎలా సాధిస్తుంది? ఒక పసి ప్రాణం కాపాడుకోవడం కోసం ఓ పేద కుటుంబం ఎంత రిస్క్‌ చేస్తుంది, అక్కడ కూడా రాజకీయ పలుకుబడితో నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చడానికి నాయకులు చేసేదేంటి?

తెరపై పాత్రలు కనిపించవు... పాత్రధారులు తప్ప. నయనతార మినహా స్టార్‌ ఎవరూ లేరు. కానీ నయనతార కూడా అశక్తురాలిగా మిగిలిన అధికారిణిగానే కనిపిస్తుంది తప్ప ఎక్కడా ఒక స్టార్‌ని చూస్తున్న భావన కలగదు. అసలు మేకప్‌ లేకుండా, కాటన్‌ శారీలో మధువర్షిణి క్యారెక్టర్‌కి వన్నె తెచ్చింది. పాప తల్లిదండ్రులుగా చేసిన యాక్టర్లు, మిగతా తారాగణం అంతా కూడా వాస్తవికతకి అద్దం పట్టారు. ఎవరూ నటిస్తున్నట్టు కాకుండా ఆ పరిస్థితి స్వయంగా అనుభవిస్తున్నంత సహజంగా నటించారు.

తెరపై జరిగేది కేవలం కల్పితమే అనే భావన మనలో వున్నట్టయితే ఈ కథ రక్తి కట్టే అవకాశమే లేదు. దానిని ఎంత సహజంగా చిత్రీకరించారంటే మనం ఆ స్పాట్‌లోనే వున్నట్టు, మిగిలిన వారితో పాటే మనం కూడా ఆ పరిస్థితిలో ఏమీ చేయలేక చేష్టలుడిగి చూస్తున్నట్టు అనిపిస్తారు. ప్రొడక్షన్‌ డిజైన్‌, మేకప్‌ టీమ్స్‌ని ప్రత్యేకించి అభినందించాలి. ఆ దృశ్యాన్ని కళ్లకి కట్టిన కెమెరామెన్‌ ప్రతిభని ఎంత పొగిడినా తక్కువే. జిబ్రాన్‌ నేపథ్య సంగీతం టెన్షన్‌ని మరింత బిల్డ్‌ చేస్తుంది.

వాస్తవికతకి అద్దం పట్టే ఈ తరహా చిత్రాలు తమిళ చిత్ర పరిశ్రమనుంచి తరచుగా వస్తూనే వుంటాయి కానీ అందులోను ఒక బెంచ్‌మార్క్‌ని సెట్‌ చేసాడు దర్శకుడు గోపి నైనార్‌. న్యూస్‌ ఛానల్స్‌లో తరచుగా చూసే ఒక వార్తని సినిమాగా మలచడం అనేది ఆషామాషీ విషయం కాదు. ఏమాత్రం బ్యాలెన్స్‌ తప్పినా డాక్యుమెంటరీ చూస్తున్న భావన కలిగే ప్రమాదముంది.

అలాగే దర్శకుడిగా ఎవరి పక్షం వహించకుండా కేవలం సంఘటన తాలూకు డెప్త్‌ని, దాని వల్ల ఎఫెక్ట్‌ అయిన వారి పెయిన్‌ని, బావిలో పడిన పాప ప్రాణం పోవడం అనే లాంఛనం కోసం ఎదురు చూసే కొందరు అధికారుల అమానవీయ బుద్ధులని, మన దేశంలోని రెండు పార్శ్వాలని ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా చూపించిన వైనం దర్శకుడిపై గౌరవాన్ని పెంచుతుంది.

కథ అసలు పాయింట్‌ చేరుకోవడానికి కాస్త సమయం తీసుకుంటుంది కానీ ఒక్కసారి పాప బోరుబావిలో పడిన తర్వాత అనుక్షణంతో ఉత్కంఠతో చివరి వరకు కదలకుండా కూర్చోబెడుతుంది. అయితే మరీ ఇంతటి వాస్తవికతని, తెరపై ఇంతటి విషాదాన్ని వీక్షించడం అందరి వల్ల కాకపోవచ్చు. సినిమాని వినోదంగా చూసే ప్రేక్షకులు ఇలాంటి వాటిని జీర్ణించుకోలేరు. దీంతో ఈ చిత్రం చాలా తక్కువ మంది ప్రేక్షకులకి మాత్రమే అప్పీల్‌ అవుతుంది. సగటు కమర్షియల్‌ మీటర్‌లో వేసి కొలిచే సినిమా కాదిది.

మనం వృధా చేసే ప్రతి నీటి బొట్టు కోసం మరో పక్క జనం ఎంత అల్లాడిపోతున్నారో, చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతగా ప్రాణాల మీదకి వస్తోందో ప్రత్యేకమైన సందేశంలా కాకుండా వాస్తవాలకి దృశ్యరూపంలా వుంది కర్తవ్యం. ఈమధ్య కాలంలో వచ్చిన అతి తక్కువ పవర్‌ఫుల్‌ చిత్రాల్లో ఇదొకటి. తమిళంలో విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఎక్కడైనా కానీ ఎక్కువ మందిని చేరుకోగలిగితే బాగుంటుంది.

బాటమ్‌ లైన్‌: కదిలిస్తుంది, ఆలోచింపజేస్తుందీ కర్తవ్యం!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?