ఇద్దరు పిల్లలున్న ఒక ఇంట్లో ఒకటే బొమ్మ ఉందనుకోండి. దానితో ఆడుకోడానికి ఇద్దరూ కొట్టుకుంటూ ఉండడం చాలా సహజం. నిజంగా వారు ఆ బొమ్మతో ఆడుకోడానికే కొట్టుకుంటున్నారో.. దాన్ని యిరగ్గొట్టడానికి కొట్టుకుంటున్నారో.. తటాలున చెప్పడం కష్టం. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే తమాషా కనిపిస్తోంది.
కేంద్రంలోని మోడీ సర్కారుపై అవిశ్వాసం పెట్టడం, పోరాడడం గురించి ఇప్పుడు వైకాపా, తెదేపాలు కీచులాడుకుంటున్నాయి. మేం ముందే నోటీసు ఇచ్చాం.. నెలపైగా ఇదే మాట చెబుతున్నాం.. మా తీర్మానంలోనే క్రెడిబిలిటీ ఉంది అంటుంది వైకాపా. మీరు తీర్మానం వెనక్కి తీసుకుంటారనే అనుమానం ఉంది.. అందుకే మేం మరో తీర్మానం పెట్టాం.. అంటుంది తెదేపా. ఆ రకంగా.. ఇద్దరూ కీచులాడుకుంటున్నారు. రెండు తీర్మానాలను అనుమతించినా.. ఓటింగ్ ఒకటేగా జరుగుతుంది గనుక.. ఇబ్బంది లేదు.
కానీ.. ఇరు పార్టీలు కలిసే పోరాడితే.. కేంద్రంలో కూడా మరికాస్త కదలిక వస్తుంది, వారి వెన్నులో భయం పుడుతుంది కదాని జనాభిప్రాయంగా ఉంది.