cloudfront

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: మనసుకు నచ్చింది

సినిమా రివ్యూ: మనసుకు నచ్చింది

రివ్యూ: మనసుకు నచ్చింది
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: ఆనంది ఆర్ట్స్‌, ఇందిరా ప్రొడక్షన్స్‌
తారాగణం: సందీప్‌ కిషన్‌, అమైరా దస్తూర్‌, త్రిధ చౌదరి, నాజర్‌, అరుణ్‌ ఆదిత్‌, ప్రియదర్శి, పునర్నవి తదితరులు
మాటలు: సాయి మాధవ్‌ బుర్రా
పాటలు: అనంత శ్రీరామ్‌
కూర్పు: సతీష్‌ సూర్య
సంగీతం: రధన్‌
ఛాయాగ్రహణం: రవి యాదవ్‌
నిర్మాతలు: కిరణ్‌, సంజయ్‌ స్వరూప్‌
రచన, దర్శకత్వం: మంజుల ఘట్టమనేని
విడుదల తేదీ: ఫిబ్రవరి 16, 2018

ట్రెయిలర్‌తో రొటీన్‌ లవ్‌స్టోరీ అనిపించిన సినిమాకి సరిగ్గా రిలీజ్‌ ఒక రోజు ముందు 'ప్రకృతిగా మహేష్‌' అంటూ వాయిస్‌ ఓవర్‌తో ఒక టీజర్‌ రిలీజ్‌ చేసారు. అంతవరకు రెగ్యులర్‌ లవ్‌స్టోరీ అనిపించిన చిత్రానికి మహేష్‌ కొత్త కళ తెచ్చాడు. అయితే ఆ 'నేచర్‌గా మహేష్‌' అనేది రిలీజ్‌కి ముందు వాడిన బ్లఫ్‌ కార్డ్‌ అని బోధ పడడానికి 'మనసుకు నచ్చింది' ఎక్కువ సమయం తీసుకోదు. కేవలం సినిమా మొదట్లో ఒక నాలుగు లైన్ల డైలాగులని మాత్రం మహేష్‌ తన వాయిస్‌లో వినిపించాడు. 'సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు యాజ్‌ నేచర్‌' అనేది పబ్లిసిటీ గిమ్మిక్క్‌ తప్ప అంతకు మించి మరేమీ కాదు.

ఒక్కసారి సూపర్‌స్టార్‌ స్వరం అలా ప్రకృతిలో కలిసిపోయాక మొదలయ్యే లవ్‌స్టోరీ 'నువ్వే కావాలి' టైమ్‌లోనే తెలుగు సినిమా ఉతికి పిండేసి పిప్పి చేసినదే. కలిసి పెరిగిన జంట తమ మధ్య వున్నది స్నేహమా, ప్రేమా అని తెలుసుకోలేని అయోమయంలో వుండడం, అది చివరకు తెలుసుకుని ఒక్కటవడం అనే ఇతివృత్తంతో లెక్కకి మించి సినిమాలొచ్చాయి. తెలుగు చిత్ర సీమ ఎప్పుడో పక్కన పడేసిన ఆ కథనే 'మనసుకు నచ్చింది' అంటూ మరోసారి తెరకెక్కించింది మహేష్‌ సోదరి మంజుల ఘట్టమనేని.

మొదలైన దగ్గర్నుంచి ముగింపు వరకు ప్రతి సన్నివేశం ఎక్కడో చూసినట్టే వుంటుంది. ముగింపు ఏమిటనేది మొదటి సీన్లోనే అర్థమైపోయే ఈ చిత్రంలో ప్రేక్షకుల ఊహాశక్తిని కించపరచకూడదన్నట్టు అంతా ఊహించినట్టుగానే నడుస్తుంది. ఒకరంటే ఒకరికి ఇష్టం తప్ప ప్రేమ లేదని అనుకున్న అమ్మాయి, అబ్బాయి వేర్వేరు అబ్బాయి, అమ్మాయిని ఇష్టపడతారు.

కానీ ఇంతలో అమ్మాయికి తనలో అబ్బాయి పట్ల వున్న రియల్‌ ఫీలింగ్‌ తెలుస్తుంది. ఇక అబ్బాయి తెలుసుకోవడం కోసం ఎదురు చూడాలి. క్లయిమాక్స్‌లో కానీ రియలైజ్‌ అవ్వని అబ్బాయి కోసం ఈమె పండించే మెలోడ్రామా, అతను తెలుసుకునే సరికి మొదలైపోయే ఆమె పెళ్లి హంగామా... మూస అనే పదం కూడా దీన్ని చూసి 'మూస' అని నసిగేట్టు చేస్తుంది.

ఇక ఈ నువ్వే కావాలి లవ్‌స్టోరీకి మంజుల ఇచ్చిన కొత్త యాంగిల్‌ ఏమిటంటే... ప్రకృతి ప్రేమ. ఇందులో కథానాయిక నేచర్‌ లవర్‌. అందుకని ఆమె సుదీర్ఘంగా ప్రకృతి గురించిన లెక్చర్లు దంచుతుంటుంది. కథానాయకుడూ నేచర్‌ లవరే. కాకపోతే జల్సాలో సునీల్‌లా ఏదైనా కాస్త ఆలస్యంగా రియలైజ్‌ అవుతాడు.

అతను ఆ సంగతి తెలుసుకుని నేచర్‌ ఫోటోగ్రఫీని వృత్తిగా ఎంచుకోవడం కోసం సుదీర్ఘమైన డ్రామానే నడుస్తుంది. ఈ ప్రకృతి యాంగిల్‌ వల్ల కథకి ఒరిగిందంటూ ఏమీ లేదు కానీ సినిమాటోగ్రాఫర్‌కి మాత్రం ప్రకృతిని అందంగా తన ఫ్రేముల్లో బంధించే అవకాశం చిక్కింది. రవి యాదవ్‌ తన నైపుణ్యంతో విజువల్‌ పొయెట్రీలాంటి అందమైన షాట్స్‌తో ఈ చిత్రాన్ని రంగులమయం చేసేసాడు.

సందీప్‌ కిషన్‌ నటుడిగా చాలా ఇంప్రూవ్‌ అయ్యాడు. ఎమోషన్స్‌ని అతను పలికిస్తోన్న తీరు మెప్పిస్తుంది. హీరోయిన్‌ అమైరాకి సినిమా అంతటా ఎమోషనల్‌ సీన్స్‌ ఇచ్చినా ఆమెకి నటన రాక తేలిపోయింది. కానీ సందీప్‌ తనకి వున్న ఒకే సీన్‌ని చాలా బాగా పండించాడు. క్యారెక్టర్‌కి కావాల్సిన క్యాజువల్‌ అప్రోచ్‌తో రిలేటబుల్‌గా కనిపించాడు.

నటన చేతకాని అమైరాకి ఈ క్యారెక్టర్‌ ఆఫర్‌ చేయడం సాహసమే. ఇలాంటి పాత్రలకి నటన తెలిసిన హీరోయిన్లయితే ఎంతో కొంతయినా లిఫ్ట్‌ చేయగలరు. త్రిధ బికినీల్లో కనిపిస్తూ గ్లామర్‌ డిపార్ట్‌మెంట్‌ని హ్యాండిల్‌ చేసింది. నాజర్‌ గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ప్రియదర్శి, పునర్నవి సహాయ పాత్రల్లో బాగానే సపోర్ట్‌ ఇచ్చారు.

రధన్‌ పాటల్లో 'పరిచయమే లేదా' ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం బాగుంది. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ తప్ప చెప్పుకోతగ్గ విశేషాలేం లేవు. దర్శకురాలిగా మంజుల షాట్‌ డివిజన్‌, ఫ్రేమింగ్‌ వగైరా బేసిక్స్‌ పాటించినప్పటికీ మొదటి ప్రయత్నానికి తగిన కథ రాసుకోవడంలో విఫలమైంది. బోర్‌ కొట్టించే ఐడియాలజీ, అవుట్‌డేటెడ్‌ డ్రామా సీన్లతో ఆద్యంతం విసిగించింది.

ప్రేమకథలని కొత్త కోణంలో చెబుతూ మెప్పిస్తోన్న నవతరం దర్శకుల చిత్రాల మధ్య మంజుల తీసిన ఈ పాత చింతకాయ లవ్‌స్టోరీ ఏ తరం ప్రేక్షకులనీ మెప్పించలేదు. బ్రేక్‌ కోసం చూస్తోన్న సందీప్‌ కిషన్‌ మరోసారి స్టోరీ సెలక్షన్‌లో మిస్టేక్‌ చేసాడు. ఎప్పుడో అవుట్‌డేటెడ్‌ అయిపోయిన స్టోరీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి ఇంకో డిజప్పాయింటింగ్‌ సినిమాతో ముందుకొచ్చాడు.

ఈ సినిమా మొదలైన కాసేపటికే ఇంటికెళ్లిపొమ్మని మనసు చెప్తుంది. వినకుండా చివరి వరకు ఉన్నట్టయితే 'మనసుకి నచ్చింది' చేయాల్సిందని అప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. రొటీన్‌ లవ్‌స్టోరీ అని సందీప్‌ కిషన్‌దో సినిమా వుంది. అదే టైటిల్‌ దీనికి పెట్టినట్టయితే కనీసం టైటిల్‌ జస్టిఫికేషన్‌ అయినా జరిగి వుండేది.

బాటమ్‌ లైన్‌: మససుని నొప్పించేది!

- గణేష్‌ రావూరి