సినిమా రివ్యూ: మెహబూబా

రివ్యూ: మెహబూబా రేటింగ్‌: 2/5 బ్యానర్‌: పూరి జగన్నాధ్‌ టూరింగ్‌ టాకీస్‌ తారాగణం: ఆకాష్‌ పూరి, నేహా శెట్టి, మురళి శర్మ, సయాజి షిండే తదితరులు కూర్పు: జునైద్‌ సిద్ధికీ సంగీతం: సందీప్‌ చౌతా…

రివ్యూ: మెహబూబా
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: పూరి జగన్నాధ్‌ టూరింగ్‌ టాకీస్‌
తారాగణం: ఆకాష్‌ పూరి, నేహా శెట్టి, మురళి శర్మ, సయాజి షిండే తదితరులు
కూర్పు: జునైద్‌ సిద్ధికీ
సంగీతం: సందీప్‌ చౌతా
ఛాయాగ్రహణం: విష్ణు శర్మ
నిర్మాణం: పూరి కనక్ట్స్‌
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్‌
విడుదల తేదీ: మే 11, 2018

పూరి జగన్నాధ్‌ సినిమాల్లో చెప్పుకోతగ్గ కథ వుండదు. అయినా కానీ ప్రేక్షకులని కదలకుండా కూర్చోపెట్టే స్కిల్స్‌ అతని సొంతం. పరుగులు పెట్టే కథనం, కాలక్షేపానికి లోటుండని వినోదం.. సగటు సినీ ప్రేక్షకుడికి ఏది కావాలో అదివ్వడం అతని లక్షణం. అయితే ఇవన్నీ ఒకప్పటి పూరి సినిమాల్లోని క్వాలిటీస్‌. ఇటీవల అతను తీస్తోన్న సినిమాల్లో ప్రేక్షకులకి కాలక్షేపాన్నిచ్చే అంశాల కంటే ఏదో ఒకలా ఈ రెండున్నర గంటల సమయాన్ని కవర్‌ చేసే సీన్లు రాసేసుకుంటే పోయే అనే ధోరణి కనిపిస్తోంది.

మొదట్లో సన్నివేశాల్లో బలం లేకపోయినా సంభాషణలతో నెట్టుకొచ్చేసేవాడు. రాన్రానూ పూరి రాసే మాటల్లోను స్టఫ్‌ లేకుండా పోయింది. దర్శకుడిగా ప్రతి సినిమాతో అభిమానుల్ని, మార్కెట్‌ వర్గాల నమ్మకాన్ని కోల్పోతూ వస్తోన్న పూరి జగన్నాధ్‌ అసలు ఫామ్‌లో లేని టైమ్‌లో తనయుడు ఆకాష్‌ని హీరోగా పరిచయం చేసేందుకు ఉపక్రమించాడు. స్టార్‌ హీరోలుంటే కంటెంట్‌ లేకుండా వాళ్లని ప్రెజెంట్‌ చేసే తీరుతో పాస్‌ అయిపోవచ్చనే ధోరణి కనిపించేది. కానీ హీరోగా ఎలాంటి ఇమేజ్‌ లేని ఆకాష్‌ని పరిచయం చేసేప్పుడు బలమైన కథ వుండడం కంపల్సరీ అని పూరి గుర్తించాడు.

ఇండో పాక్‌ యుద్ధ నేపథ్యంలో ప్రేమించుకున్న ఓ జంట అప్పుడు విడిపోయి పునర్జన్మ ఎత్తి మళ్లీ వేర్వేరు మతాల్లో, వేర్వేరు దేశాల్లో పుట్టి, తిరిగి ఎలా కలిసారు అన్నది కథాంశం. పునర్జన్మ అనేది చాలా ఓల్డ్‌ కాన్సెప్టే కావచ్చు. కానీ సరిగ్గా డీల్‌ చేస్తే బ్లాక్‌బస్టర్‌ మెటీరియల్‌ అని మూగమనసులు నుంచి మగధీర.. మనం వరకు చాలాసార్లు రుజువైంది. ఈ అంశానికి ఇండో పాక్‌ వార్‌ అనే బ్యాక్‌డ్రాప్‌ పెట్టుకోవడం పేపర్‌పై చాలా ఎక్సయిట్‌ చేసి వుంటుంది. అయితే మరోసారి కేవలం ఐడియా రావడంతోనే సీన్‌ ఆర్డర్‌ వేసేసుకుని, దానికి డైలాగ్‌ వెర్షన్‌ రాసేసుకుని సెట్స్‌ మీదకి వెళ్లిపోయారనే సంగతి ప్రతి సీన్లో తెలుస్తూనే వుంటుంది.

బేసిక్‌ స్ట్రక్చర్‌ లేకుండా గాలివాటానికి సాగిపోయే స్క్రీన్‌ప్లేతో ఇలాంటి కాన్సెప్ట్‌ని సక్సెస్‌ చేయడం జరిగే పని కాదు. మగధీరకి అయినా, మనంకి అయినా పునర్జన్మ అనే ఫిక్షన్‌ని ఈ తరం ప్రేక్షకులు యాక్సెప్ట్‌ చేసేలా చేయడానికి బలమైన కథనం, అబ్బురపరిచే రచనా పటిమ కావాల్సి వచ్చింది. మెహబూబాలో ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా ఎక్సయిట్‌ చేయదు. ఒక ప్రేమజంట మళ్లీ పుట్టి తమ ప్రేమ గెలుచుకోవాలంటే చాలా డ్రామా వుండాలి. అయ్యో వీళ్లు విడిపోకూడదనే ఫీలింగ్‌ కలిగించాలి. మళ్లీ పుట్టాలని, ఈసారి ఎలాగైనా కలవాలని బలంగా కోరుకోవాలి.

హీరో హీరోయిన్లు కనుక లవ్‌లో పడ్డారు, పునర్జన్మ కాన్సెప్ట్‌ కనుక ఇప్పుడు విడిపోయి మళ్లీ పుడతారు… అన్నంత ఫ్లాట్‌గా స్క్రీన్‌ప్లే వుంటే ఇక ఆ లవ్‌స్టోరీ పట్ల కనీస ఆసక్తి ఏర్పడదు. పూరి జగన్నాధ్‌ ఈ కథని ఎంత సిన్సియర్‌గా నమ్మేసాడంటే, తన సినిమాల్లో వుండే టైమ్‌పాస్‌ ఎలిమెంట్స్‌ని కూడా వదిలేసాడు. కామెడీ, మాస్‌ సాంగ్స్‌, పంచ్‌ డైలాగ్స్‌లాంటివన్నీ వదిలేసి తన కథతో కనక్ట్‌ అయిపోతారని, 'మెహబూబా జిందాబాద్‌' అనేస్తారని బలంగా ఫీలయినట్టున్నాడు. అతను అనుకున్న విధంగా ఈ లవ్‌స్టోరీతో ఎలాంటి కనక్షన్‌ ఏర్పడకపోగా, కనీసం పూరి మార్కు వినోదానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. దాంతో 'ఎంత సేపయింది' అనే దానికంటే 'ఇంకా ఎంత సేపుంది' అనేదే ఎక్కువ కలవరపెడుతుంది.

లవ్‌స్టోరీతో ఎమోషన్‌ కలిగించలేకపోతే కనీసం దేశభక్తి పేరుతో అయినా విజిల్స్‌ కొట్టించుకోవాలనే తాపత్రయం సినిమా అంతటా కనిపించింది. క్రికెట్‌లో ఇండియా ఓడిపోతుంటే పండగ చేసుకునే పాతబస్తీ ముస్లిమ్స్‌ దగ్గర్నుంచి, బోర్డర్‌లో సెన్స్‌లెస్‌ దేశభక్తి చూపించే లేడీ సోల్జర్స్‌ (జ్యోతి రాణా సౌజన్యంతో) వరకు ఒక్క విజిల్‌ వేయించుకోవడానికి పడ్డ ఆరాటం అంతా ఇంతా కాదు. వారానికి రెండుసార్లు బోర్డర్‌ దాటే సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ వచ్చేప్పుడు అక్కడ పహారా కాసే ఇరు దేశ సైనికుల మధ్య అంత 'ఫ్రిక్షన్‌' ఎందుకుంటుంది? ఇరువురూ ఇగోలతో ఎందుకలా సెన్స్‌లెస్‌గా ఊగిపోతుంటారు? 'బజరంగి భాయ్‌జాన్‌' చిత్రంలో ఎంతో సెన్సిబుల్‌గా చూపించిన ఆ దృశ్యాన్ని పూరి తెరకెక్కించిన తీరు చూసి ఏమనుకుంటారనేది మీ ఇష్టం.

ఫస్ట్‌ హాఫ్‌ పర్పస్‌ లేకుండా పాయింట్‌లెస్‌గా సాగిపోతున్నా కనీసం గత జన్మలో ప్రేమకథ అయినా అర్ధవంతంగా వుంటుందనే ఆశ మిణుకుమంటుంది. అది అత్యాశే అనిపించడానికి ఎంతో సమయం తీసుకోకుండా ఆ దృశ్యాలు కూడా ఫస్ట్‌ డ్రాఫ్ట్‌లో కూడా రిజెక్ట్‌ అయ్యే రీతిన అపరిపక్వంగా తెరకెక్కాయి. అమ్మాయిపై అఘాయిత్యాన్ని అడ్డుకునే అబ్బాయిపై పుట్టుకొచ్చే ప్రేమ… రెండు లవ్‌స్టోరీలకి ఇంతకుమించి స్టార్టింగ్‌ని ఇమాజిన్‌ చేయలేకపోయారు పూర్‌ పూరీ!

మసాలా అంశాలు వద్దనుకోవడం వల్ల కొత్త కుర్రాడికి కనీసం ఒక స్టెప్పెసే ఛాన్స్‌ కూడా దక్కలేదు. పాటలన్నీ నేపథ్యంలో వచ్చిపోయేవే కావడంతో హుషారొచ్చే అవకాశమే లేదు. ఈ తెలుగు-హిందీ-ఉర్దూ కాక్‌టెయిల్‌లో పూరి మార్కు సంభాషణలకీ తావులేదు. పాకిస్తాన్‌ నేపథ్యం కనుక తెలుగు సబ్‌టైటిల్స్‌తో కానిచ్చేయాలా, లేక తెలుగు మాట్లాడించేయాలా లేదా ఉర్దూలోనే కొనసాగించాలా అనే దానిపై కూడా పూరికి క్లారిటీ లేదు. తోచినపుడు తోచిన విధంగా కమ్యూనికేట్‌ చేసి కలగాపులగం చేసేసాడు.

ఆకాష్‌కి ఆల్రెడీ కెమెరాతో ఎక్స్‌పీరియన్స్‌ వుంది కనుక కొత్త అనే ఫీలింగ్‌ లేదు. బెరుకు లేకుండా నటించాడు కానీ ఇంకా అతనిలో పసితనం ఛాయలు పోలేదు. అందుకే చూడ్డానికి ఇంకా హీరో అనిపించడం లేదు. నేహాశెట్టి క్యారెక్టర్‌ రెండు జన్మల్లోను వన్‌ డైమెన్షనల్‌గానే సాగుతుంది. మురళి శర్మ ఒక్కడే ఇంత లౌడ్‌ సినిమాలోను సటిల్‌గా ఎలా చేయవచ్చో చూపించాడు. మిగతావారంతా అతికి బ్రాండ్‌ అంబాసిడర్ల మాదిరిగా యాక్షన్‌ అనడం పాపం కెమెరాలు బద్దలు కొట్టేసి, సౌండ్‌బాక్సుల చెవులకి చిల్లులు పెట్టేసారు. అయితే చివర్లో వచ్చిన జ్యోతిరాణా వారందరనీ చిన్నబోయేలా చేసి ఓవరాక్షన్‌ ఛాంపియన్‌ ట్రోఫీని ఎగరేసుకుపోయింది.

విజువల్‌గా గ్రాండ్‌గా తీర్చిదిద్దిన ఈ చిత్రంలో సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలిచింది. హిమాలయాల ఏరియల్‌ షాట్లు, యుద్ధ సన్నివేశాల్లో కనిపించిన సహజత్వం ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం బాగుంది కానీ పాటలన్నీ ఒకే తరహాలో అనిపిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో కలిసిపోయాయి. పూరి జగన్నాధ్‌కి కాస్త బ్రేక్‌ అవసరం. రచనపై ఎక్కువ సమయం కేటాయించకపోవడం ఆయన బిగ్గెస్ట్‌ వీక్‌నెస్‌ అని మళ్లీ ప్రూవ్‌ అయింది. ప్రతి సన్నివేశాన్ని జనరంజకంగా మలిచే తన ప్రతిభ క్రమేపీ కానరాకుండా పోతోంది. పూరి సినిమాలు కొన్నిసార్లు సెన్స్‌లెస్‌నెస్‌తో కూడా ఎంటర్‌టైన్‌ చేసిన దాఖలాలున్నాయి. కానీ మెహబూబాలో అలా అడ్జస్ట్‌ అయిపోయి ఎంటర్‌టైన్‌ అవడానికి కూడా ఆస్కారర లేకపోయింది.

బాటమ్‌ లైన్‌: మహా బోర్‌!

– గణేష్‌ రావూరి