సినిమా రివ్యూ: గరుడ వేగ

రివ్యూ: పిఎస్‌వి గరుడ వేగ 126.18ఎమ్‌ రేటింగ్‌: 3/5 బ్యానర్‌: జ్యోస్టార్‌ ఎంటర్‌ప్రైజస్‌, శివాని శివాత్మిక ఫిలింస్‌ తారాగణం: రాజశేఖర్‌, ఆదిత్‌, పూజ కుమార్‌, కిషోర్‌, నాజర్‌, శ్రద్ధ దాస్‌, రవివర్మ, పృధ్వీ, చరణ్‌…

రివ్యూ: పిఎస్‌వి గరుడ వేగ 126.18ఎమ్‌
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: జ్యోస్టార్‌ ఎంటర్‌ప్రైజస్‌, శివాని శివాత్మిక ఫిలింస్‌
తారాగణం: రాజశేఖర్‌, ఆదిత్‌, పూజ కుమార్‌, కిషోర్‌, నాజర్‌, శ్రద్ధ దాస్‌, రవివర్మ, పృధ్వీ, చరణ్‌ దీప్‌, పోసాని కృష్ణమురళి, సయాజి షిండే, ఆదర్శ్‌, సన్నీలియోని తదితరులు
కూర్పు: ధర్మేంద్ర కాకర్ల
సంగీతం: భీమ్స్‌
నేపథ్య సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
ఛాయాగ్రహణం: అంజి, గికా చెలిడ్జే, బకుర్‌ చికోబవ, సురేష్‌, శ్యామ్‌
నిర్మాత: ఎం. కోటేశ్వరరాజు
రచన, దర్శకత్వం: ప్రవీణ్‌ సత్తారు
విడుదల తేదీ: నవంబర్‌ 3, 2017

నరాలు తెగే ఉత్కంఠ, ఊపిరి సలపని వేగం, గుండె చప్పుడుని ఉరకలెత్తించే పోరాట దృశ్యాలు… తెలుగు సినిమాలకి సంబంధించి ఇలాంటి అనుభూతులు చాలా అరుదు. ప్రవీణ్‌ సత్తారు ఇలాంటి అనుభవాన్ని ఆసాంతం ఇవ్వకపోయినా, 'విరామం' వరకు ఈ తరహా అనుభూతిని తెలుగు సినిమాతో అందించి తన 'సత్తా' చాటుకున్నాడు. ప్రతి సినిమాతో ఒక కొత్త జోనర్‌ని అటెంప్ట్‌ చేసే ప్రవీణ్‌ ఈసారి యాక్షన్‌ జోనర్‌లో తెలుగు సినిమా ఎక్కువగా ఎక్స్‌ప్లోర్‌ చేయని ఎలిమెంట్స్‌ని తీసుకుని ఒక కొత్త అనుభూతిని అందించాడు. అయితే ఈ గరుడ 'వేగం' సినిమా అంతటా చూపించినట్టయితే ఇదో అద్భుతమయ్యేది. కానీ దానిని తొలి సగానికే పరిమితం చేయడంతో ఒక అనుభూతిగా మాత్రం మిగిలింది.

ప్రథమార్ధం అంతటిలో కొన్ని నిమిషాలు (రాజశేఖర్‌-పూజ-అలీ కౌన్సిలింగ్‌ సీన్‌, పృధ్వీ ఇంట్రడక్షన్‌) మినహా బిగి సడలని కథనంతో, ఉరుకులు పరుగులతో కూడిన కథాగమనంతో సాగిన ఈ చిత్రం ఇంటర్వెల్‌ టైమ్‌కి దర్శకుడు, అతని టెక్నికల్‌ టీమ్‌కి హేట్సాఫ్‌ చెప్పే రీతిన తెరకెక్కింది. ద్వితియార్ధంలో అసలు కథ ఏంటనేది తెలిసిన తర్వాత యాక్షన్‌ తగ్గి కమర్షియల్‌ రూట్‌ తీసుకుంది.

ఈ పార్ట్‌లో కూడా కాంప్రమైజ్‌ కాకుండా 'బోర్న్‌ సిరీస్‌' మాదిరి ఒక పూర్తి స్థాయి యాక్షన్‌ థ్రిల్లర్‌ని తీర్చిదిద్దడానికి ప్రయత్నించాల్సింది. ఫస్ట్‌ హాఫ్‌లో అంతటి వేగం చూపించిన తర్వాత ద్వితియార్థంలో కథ ముందుకి నడుస్తున్నా కానీ ఆ స్పీడ్‌, ఆ థ్రిల్‌ మిస్‌ అవుతోన్న ఫీలింగ్‌ వస్తుంది. పతాక సన్నివేశాలకి వచ్చేసరికి రియలిస్టిక్‌ అప్రోచ్‌ కంటే సినిమాటిక్‌గా వెళ్లిపోవడం కూడా ఒకింత నిరాశ పరుస్తుంది. అయితే ఫస్ట్‌ హాఫ్‌లో ఇచ్చిన అనుభూతికే పైసా వసూల్‌ అనిపించే ఈ చిత్రానికి మిగతాదంతా బోనస్‌ అనుకోవాలి.

కథ విషయానికి వస్తే, నేషనల్‌ ఇంటిల్లిజెన్స్‌ ఆఫీసర్‌ (రాజశేఖర్‌) కారుని మరో కారు గుద్దేస్తుంది. వాళ్ల దగ్గర తుపాకులు చూసిన ఆఫీసర్‌ వాళ్లని వెంబడిస్తాడు కానీ తప్పించుకుంటారు. న్యూస్‌లో చూసిన ఒక మర్డర్‌తో ఈ యాక్సిడెంట్‌ లింక్‌ అవడంతో దానిని చేధించే పనిలో పడతాడు. చిన్న యాక్సిడెంట్‌తో మొదలై, మర్డర్‌గా మారి, ఆపై బాంబ్‌ త్రెట్‌గా టర్న్‌ తీసుకుని, అటుపై ఇంటర్నేషనల్‌ స్కామ్‌గా రూపాంతరం చెందే క్రైమ్‌ని శేఖర్‌ ఎలా చేధిస్తూ వెళతాడనేది కథ.

సింగిల్‌ లైన్‌లో చెబితే ఒక పోలీస్‌ అధికారి, ఒక పెద్ద స్కామ్‌, ఇన్వెస్టిగేషన్‌ వగైరా మామూలు ఎలిమెంట్స్‌తో సగటు కథలానే వుంటుంది కానీ దానిని దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రత్యేకించి ఈ కథని అతను మొదలు పెట్టిన తీరు, కుర్చీల్లో కుదురుకుంటోన్న ప్రేక్షకుల ఫుల్‌ అటెన్షన్‌ని రాబట్టుకునే వైనం అమితంగా మెప్పిస్తుంది. డార్జిలింగ్‌లో బైక్‌ ఛేజ్‌తో ఉత్కంఠభరితంగా మొదలైన చిత్రం ఆ తర్వాత పాత్రల పరిచయంతో కాస్త నెమ్మదించినా, ఒకసారి హీరో కార్యసాధనకి ఉపక్రమించిన తరుణం నుంచి ఇంటర్వెల్‌ కార్డ్‌ పడే వరకు టాప్‌ గేర్‌లో వెళుతుంది.

ఇంటర్వెల్‌ టైమ్‌లో అదే మాదిరి థ్రిల్‌ని తర్వాత కూడా ఎక్స్‌పెక్ట్‌ చేస్తే మాత్రం నిరాశ తప్పదు. మిస్టరీ ఏమిటనేది రివీల్‌ అయిన తర్వాత స్టోరీ మరీ కన్వీనియంట్‌ రూట్లోకి వెళ్లిపోతుంది. శత్రు దుర్బేధ్యమైన కథానాయకుడు, దర్శకుడు తీసుకున్న సినిమాటిక్‌ లిబర్టీ సాయంతో అతి పెద్ద స్కామ్‌ని చులాగ్గా చక్కబెట్టేయడంతో ఇంటర్వెల్‌ టైమ్‌లో వున్న ఎక్సయిట్‌మెంట్‌ కాస్తా క్లయిమాక్స్‌ అయ్యేసరికి సగానికి పడిపోతుంది.

ఫస్ట్‌ హాఫ్‌లో హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్‌లో వచ్చే చిన్న బిట్‌ సాంగ్‌ మినహా సైడ్‌ ట్రాక్‌ అవని దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు ద్వితీయార్ధంలో కమర్షియల్‌ డిమాండ్లకి తల వంచినట్టు అనిపిస్తుంది. ఇదే కథని హీరోయిన్‌ ట్రాక్‌ లేకుండా, రెండు గంటల నిడివిలో చెప్పినట్టయితే ఇంకో లెవల్లో వుండేది. హీరోయిన్‌ ట్రాక్‌ వల్ల తగిలించిన ఎక్స్‌ట్రా క్యారెక్టర్లు పృధ్వీ, అవసరాల లాంటివి వేగంగా వెళ్లే సినిమాకి స్పీడ్‌ బ్రేకర్లలా అడ్డు పడ్డాయి. భార్యాభర్తల సన్నివేశాలన్నీ కూడా పంటి కింద రాళ్లలా తగుల్తాయి.

కనీసం క్లయిమాక్స్‌ సీన్‌లో అయినా హీరోయిన్‌ని అవాయిడ్‌ చేసుండాల్సింది. అక్కడ కూడా ఆమెని ఎంటర్‌ చేయడం వల్ల అవసరం లేని కామెడీ చేసి విసిగించాల్సి వచ్చింది. అలాగే రాజశేఖర్‌కి కాన్సర్‌ అంటూ జరిగే తంతు ఏమిటో, అసలది ఎందుకో ఎంతకీ అంతు చిక్కదు. కనీసం దానికి చివర్లో 'వివరణ' సైతం ఇవ్వలేదు! సన్నీలియోని పాట కానీ, అక్కడ జరిగే కామెడీ కానీ ఈ కథకి ఎంత మాత్రం అవసరం లేదు. అలాగే అంతటి స్కామ్‌ని డీల్‌ చేసే విలన్లు కూడా హీరోకి 'తప్పించుకో చూద్దాం' లాంటి అవకాశాలివ్వడం మరీ సినిమాటిక్‌గా వుంది.

అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆలోచించే ప్రవీణ్‌ సత్తారు లాంటి దర్శకులు సైతం కమర్షియల్‌ డిమాండ్లకి తలవంచినట్టయితే ఇక 'గుర్తుండిపోయే' సినిమాలెలా వస్తాయి. లక్కీగా సెకండ్‌ హాఫ్‌ ట్రాక్‌ తప్పినప్పటికీ ఫస్ట్‌ హాఫ్‌లో ఇచ్చిన అనుభూతి చాలా బలంగా వుండడం వల్ల ఓవరాల్‌గా శాటిస్‌ఫాక్టరీ ఫీల్‌ వస్తుంది. ఇన్నేళ్ల తర్వాత రాజశేఖర్‌కి మళ్లీ తన శైలికి తగ్గ పాత్ర దొరికింది. తన వంతుగా రాజశేఖర్‌ ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయగా, హ్యాకర్‌ పాత్రలో ఆదిత్‌ చక్కగా ఇమిడిపోయాడు.

కిషోర్‌ క్యారెక్టర్‌ని మరీ తేల్చి పడేసారు. రవివర్మ, నాజర్‌, చరణ్‌ దీప్‌ తమ పాత్రల్లో రాణించారు. పూజా కుమార్‌ పాత్ర చిత్రణ ఈ చిత్రం నెగెటివ్‌ పాయింట్స్‌లోకే వెళుతుంది. పృధ్వీ కామెడీ నవ్వించకపోగా అసహనం కలిగిస్తుంది. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో సినిమాటోగ్రఫీ, యాక్షన్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ హైలైట్స్‌గా నిలిచాయి. తన టెక్నికల్‌ టీమ్‌నుంచి ఇంత చక్కని అవుట్‌పుట్‌ తీసుకున్న ప్రవీణ్‌ సత్తారుని అభినందించాలి. ఖర్చుకి వెనకాడకుండా నిర్మాత ఈ చిత్రాన్ని క్వాలిటీతో అందించారు.

ఇలాంటి నేపథ్యంతోనే వచ్చిన ఇటీవలి భారీ చిత్రాలు స్పైడర్‌, వివేకం ఏమి చేయలేకపోయాయో అంతకంటే ఎంతో తక్కువ బడ్జెట్‌తో, సాధారణ స్టార్‌ కాస్ట్‌తో ప్రవీణ్‌ సత్తారు చేసి చూపించాడు. ముందే చెప్పినట్టు కమర్షియల్‌ వేల్యూస్‌ కోసమని కాంప్రమైజెస్‌కి పోకుండా సెకండ్‌ హాఫ్‌పై ఇంకాస్త కేర్‌ తీసుకుని వుంటే 'గరుడ వేగ' ట్రెండ్‌ సెట్టింగ్‌ సినిమా అయి వుండేది. రొటీన్‌ సినిమాల నుంచి రిలీఫ్‌ కోసం, తెలుగు తెరపై ఉన్నత ప్రమాణాలతో కూడిన యాక్షన్‌ అనుభూతి కోసం 'గరుడవేగ'ని వీక్షించాలి.

బాటమ్‌ లైన్‌: మిషన్‌ సక్సెస్‌ఫుల్‌!

– గణేష్‌ రావూరి