రివ్యూ: దర్శకుడు
రేటింగ్: 2/5
బ్యానర్: సుకుమార్ రైటింగ్స్
తారాగణం: అశోక్ బండ్రెడ్డి, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ, సుదర్శన్, కేదార్ శంకర్, నోయల్ షాన్, జెమిని సురేష్ తదితరులు
కూర్పు: నవీన్ నూలి
సంగీతం: సాయి కార్తీక్
ఛాయాగ్రహణం: ప్రవీణ్ అనుమోలు
నిర్మాతలు: బి.ఎన్.సి.ఎస్.పి. విజయ్ కుమార్, థామస్ రెడ్డి ఆడూరి, రవిచంద్ర సత్తి
సమర్పణ: సుకుమార్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: జక్కా హరిప్రసాద్
విడుదల తేదీ: ఆగస్ట్ 4, 2017
కొన్ని కథలు ఐడియాగా చాలా బాగుంటాయి. పేపర్‌పై వున్నపుడు ఆ ఐడియాలు చాలా ఎక్సయిట్ చేస్తాయి. సుకుమార్ ఈ కథని మెచ్చి తన బ్యానర్‌పై నిర్మించడానికి ఎందుకు అంగీకరించారనేది క్లియర్‌గా తెలుస్తుంటుంది.
స్టోరీ పరంగా 'దర్శకుడు' చాలా ఇంట్రెస్టింగ్ థాట్. ఒక సరికొత్త అనుభూతిని అందించే సినిమాగా షేప్ తీసుకునే అవకాశమున్న స్టఫ్. బట్ ఈ కథని పర్‌ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేసే దర్శకుడితో పాటు లీడ్ క్యారెక్టర్ ఎమోషన్స్‌ని అర్థమయ్యేలా ఎక్స్‌ప్రెస్ చేసే కథానాయకుడు కూడా చాలా ముఖ్యం. కొన్ని బలమైన కథలకి బలహీనమైన కథానాయకుడు వున్నా పాస్ అయిపోతుంటాయి. కానీ ఇలాంటి సంక్లిష్టమైన కథలని తన భుజాలపై మోసే కథానాయకుడు వుండడం తప్పనిసరి.
జక్కా హరిప్రసాద్ రాసుకున్న స్టోరీలో సోల్ గుర్తించి ఎంకరేజ్ చేసిన సుకుమార్ కాస్టింగ్ పరంగా కూడా కేర్ తీసుకుని వుండాల్సింది. ఎందుకంటే ఈ దర్శకుడికి కథానాయకుడే మైనస్ అయ్యాడు మరి.
సినిమా దర్శకుడు కావాలనేదే కలగా పెరిగిన ఓ యువకుడు (అశోక్) ఎట్టకేలకు ఆ అవకాశాన్ని సంపాదించుకుంటాడు. తన లక్ష్యం చేరుకోవడం కోసం అవకాశవాదాన్ని నమ్ముకోవడానికి, అవతలి వాడి అవకాశాన్ని లాగేసుకోవడానికి కూడా వెనకాడని అతడికి తన కథ ఓకే చేయించుకోవడంలో చిన్న సమస్య ఎదురవుతుంది. తన కథలో రొమాన్స్ ట్రాక్ బాలేదని, ప్రేమలో పడకపోవడం వల్ల ఆ ట్రాక్ సరిగా రాయలేకపోయావని, ఆ ట్రాక్ సరిచేస్తే సెట్స్‌కి వెళ్లిపోదామని చెప్తాడు నిర్మాత. దాంతో ఆ ట్రాక్ రాయడానికి ఇన్‌స్పిరేషన్ వెతుక్కుంటూ వెళ్లిన ఆ దర్శకుడికి ఒకమ్మాయి (ఈష) తారసపడుతుంది. ఆ పరిచయంలో అతడి పట్ల ఆమె ఆకర్షితురాలవుతుంది. కానీ అతను మాత్రం తన కథకోసం ఆమె ఫీలింగ్స్ మానిప్యులేట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆమె మనసు విరిగిపోతుంది. తన ప్యాషన్ తప్ప ఎదుటి వాళ్ల ఫీలింగ్స్, ఎమోషన్స్ పట్టని ఆ దర్శకుడి జీవితం చివరకు ఏమవుతుంది?
సుకుమార్ సినిమాల్లో కనిపించే ఎక్స్‌ట్రీమ్ లక్షణాలున్న విలక్షణమైన పాత్రే ఇందులోని లీడ్ క్యారెక్టర్ కూడా. కథానాయకుడి ఆలోచనా తీరు చూస్తే సుకుమార్ మలచిన 'ఆర్య' క్యారెక్టర్ గుర్తొస్తుంది. తన లక్ష్యం చేరడం కోసం ఎంతటి మానిప్యులేషన్‌కి అయినా పాల్పడే ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానం బాగుంది. తన ఫీలింగ్స్‌ని అతను సినిమా కోసం వాడేసుకుంటున్నాడని, తనని ప్రేమించడం లేదని తెలిసి ఓ సందర్భంలో హీరోని హీరోయిన్ ఛీ కొడుతుంది. దానిని కూడా అతను తను రాసుకునే కథకి ఇంటర్వెల్ బ్యాంగ్‌గా వాడేసుకుంటాడు.
ఒక సందర్భంలో ఆమెకి యాక్సిడెంట్ అయి చావు బ్రతుకుల్లో వుంటే, ఆంబులెన్స్‌లో స్నేహితుడిని ఇచ్చి పంపించేసి, షూటింగ్ కంటిన్యూ చేస్తాడు. ఆమె ప్రాణ స్నేహితురాలు తన సినిమాలో హీరోయిన్ కావడంతో షూటింగ్ అప్‌సెట్ అవుతుందని తనని కూడా హాస్పిటల్‌కి వెళ్లనివ్వడు. ఇలాంటి సీన్స్‌తో ఒక ప్యాషనేట్ క్యారెక్టర్ ఐడియాలజీని ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం చాలా బాగుంది. తన వృత్తి తప్ప మరి దేనినీ లెక్క చేయని హీరో పాత్ర చిత్రంగా అనిపిస్తూనే ఆకర్షిస్తుంది.
అయితే ఇంత ప్రాక్టికల్ క్యారెక్టర్‌ని సృష్టించి, మూడొంతుల వరకు క్యారెక్టర్ గ్రాఫ్ మెయింటైన్ చేసి, పతాక సన్నివేశాలకి వచ్చేసరికి సినిమాటిక్ ముగింపునివ్వడమే పాత్రౌచిత్యాన్ని దెబ్బ తీసింది. అంత వరకు చాలా ప్రాక్టికల్‌గా చూపిస్తూ వచ్చిన పాత్రని హీరోయిన్ వైపు నుంచి కన్విన్సింగ్‌గా మార్చడం కోసం అతని ఆలోచనలకి మరో కోణాన్ని చూపించడం వల్ల అంతవరకు ప్రత్యేకంగా అనిపించిన పాత్ర చివరకు వచ్చేసరికి సగటు స్వభావంతో తేలిపోయింది. ఇలాంటి సబ్జెక్ట్‌కి అత్యంత అవసరమైన పంచ్ క్లయిమాక్స్‌లో మిస్ అయింది.
ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్ సీన్స్‌లో డ్రాగ్ ఎక్కువై, ఇంపాక్ట్ తగ్గిపోవడం, అంతవరకు ఉన్న ఫ్రెష్‌నెస్ పోయి క్యారెక్టర్స్ అన్నీ కన్వీనియంట్‌గా రొటీన్‌గా బిహేవ్ చేయడం, కమర్షియల్ ఎండింగ్ కోసమని పడ్డ తపన డామినేట్ అవడం 'దర్శకుడు' బార్‌ని చాలా కిందకి లాగేసాయి.
అశోక్ ఈ పాత్రకి రాంగ్ ఛాయిస్. తన పాత్రకి అవసరమైన కన్నింగ్‌నెస్, ఎనర్జీ, ఎంతూజియాజమ్ ఏదీ చూపించలేకపోయాడు. కేవలం డైలాగులతో తన ఫీలింగ్స్ ఏమిటనేది చెబుతుంటాడే తప్ప నిజంగానే ప్యాషనేట్ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడనేది తెర మీదకి తీసుకురాలేకపోయాడు. డైలాగ్స్ లేకుండా ఎమోషన్ కన్వే చేయాల్సిన సందర్భాల్లో అయితే పూర్తిగా తేలిపోయాడు. ఎక్స్‌ప్రెసివ్ అయిన ఎనర్జిటిక్ యాక్టర్ ఎవరు వున్నా ఈ దర్శకుడు మరోలా షేప్ తీసుకుని వుండేది. కథలో సత్తా వున్నా కానీ కథానాయకుడి వల్ల అది సగానికి పడిపోయింది.
ఈష ఎక్స్‌ప్రెసివ్ యాక్ట్రెస్. తన పాత్రని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా బాగా చేసింది. మిగిలిన వారిలో సుదర్శన్‌కి మంచి క్యారెక్టర్ దక్కింది. బాగా చేసాడు. కో డైరెక్టర్‌గా జెమిని సురేష్ కూడా ఆకట్టుకుంటాడు. పాటలు మెప్పించలేదు కానీ థీమ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పర్‌ఫెక్ట్‌గా వుంది. జక్కా హరిప్రసాద్ రచయితగా రాణించాడు. దర్శకుడిగా కూడా బాగానే హ్యాండిల్ చేసాడు. లాస్ట్ యాక్ట్ సరిగా రాసుకుని వుంటే తన ఆలోచనలకి పరిపూర్ణ న్యాయం చేసి వుండేవాడు.
కొత్తరకం కథలు చూడాలనుకునే వారికి దర్శకుడు కొంతవరకు తృప్తినిస్తుంది. అయితే సినిమా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే చిత్రాలకి లిమిటెడ్ అప్పీల్ అనేది పెద్ద సమస్య. ఇలాంటి వాటితో కనక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య తక్కువ కనుక ఆటోమేటిగ్గా రీచ్ రిస్ట్రిక్ట్ అయిపోతుంది. దానికి తోడు కథనంలోను కొన్ని సమస్యలుండడం, అన్నిటికీ మించి లీడ్ యాక్టర్ మిస్‌కాస్ట్ అవడంతో ఈ 'దర్శకుడు' ఆ లిమిటెడ్ ఆడియన్స్ నుంచి కూడా హోల్‌సమ్ అప్లాజ్ అందుకోలేకపోతుంది.
బాటమ్ లైన్: దర్శకుడు ఓకే, కానీ కథానాయకుడే!
గణేష్ రావూరి