సినిమా రివ్యూ: నక్షత్రం

రివ్యూ: నక్షత్రం రేటింగ్‌: 1/5 బ్యానర్‌: బుట్టబొమ్మ క్రియేషన్స్‌, విన్‌ విన్‌ విన్‌ క్రియేషన్స్‌ తారాగణం: సందీప్‌ కిషన్‌, సాయి ధరమ్‌ తేజ్‌, రెజీనా, ప్రగ్యా జైస్వాల్‌, ప్రకాష్‌రాజ్‌, తనీష్‌, శివాజీరాజా, జెడి చక్రవర్తి,…

రివ్యూ: నక్షత్రం
రేటింగ్‌: 1/5
బ్యానర్‌: బుట్టబొమ్మ క్రియేషన్స్‌, విన్‌ విన్‌ విన్‌ క్రియేషన్స్‌
తారాగణం: సందీప్‌ కిషన్‌, సాయి ధరమ్‌ తేజ్‌, రెజీనా, ప్రగ్యా జైస్వాల్‌, ప్రకాష్‌రాజ్‌, తనీష్‌, శివాజీరాజా, జెడి చక్రవర్తి, తులసి తదితరులు
కూర్పు: శివ వై ప్రసాద్‌
సంగీతం: భీమ్స్‌, భరత్‌ మధుసూదన్‌, హరిగౌర
ఛాయాగ్రహణం: శ్రీకాంత్‌ నారోజ్‌
నిర్మాతలు: కె. శ్రీనివాసులు, ఎస్‌. వేణుగోపాల్‌, సజ్జు
రచన, దర్శకత్వం: కృష్ణవంశీ
విడుదల తేదీ: ఆగస్ట్‌ 4, 2017

ప్రకాష్‌రాజ్‌ లాంటి ఉత్తమ నటుడు కూడా అవసరానికి మించి నటిస్తోంటే సదరు చిత్రంలో ఏదో లోపముందని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ధ్వని కాలుష్యమంతా ఇందులోనే వుందా అన్నట్టుగా కేవలం వాయిద్యాల హోరుకే కాకుండా నటీనటులు సంభాషించుకుంటున్నా కానీ చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తుందీ నక్షత్రం. మొదలవడమే లౌడ్‌ నోట్‌లో మొదలైన సినిమా ముందుకు సాగే కొద్దీ శబ్ధ కాలుష్యానికి సినిమాటిక్‌ ఎగ్జాంపుల్‌గా మారుతుందే తప్ప ఏ పాయింట్‌లోను సెన్సిబులిటీస్‌ని అర్థం చేసుకుని అందుకు తగ్గ సటిల్‌టీ చూపించదు.

సాయి ధరమ్‌ తేజ్‌ చేసిన స్పెషల్‌ క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్‌ చేయడానికి వీలయినంత డిలే చేయడం ఒక్కటే స్క్రీన్‌ప్లే పరంగా మెచ్చుకోతగ్గ అంశం. అంటే ఆ పాత్ర మిగతా భారం మొత్తాన్ని మరిపించేంత గొప్పగా వుందని కాదు. జరుగుతున్న కథలో ఏమీ లేకపోయినా, ముందు ముందు 'ఏదో వుంటుందనే' భ్రమ కల్పించడానికి ప్రేరకంలా మాత్రం అతను చేసిన 'అలెగ్జాండర్‌' పాత్ర పని చేసింది.

తొంభైలలోనే ఉత్తమ చిత్రాలని రూపొందించడంతో పాటు, టేకింగ్‌ పరంగా కొత్త అనుభూతులని అందించిన దర్శకుడు కృష్ణవంశీ ఇప్పటికీ అక్కడే స్టక్‌ అయిపోయారా అన్న భావన ఈ చిత్రం చూస్తుంటే కలుగుతుంది. ఆయన తీసిన పలు చిత్రాలని గుర్తుకు తెచ్చే విధంగా చిత్రీకరణ వుంది కానీ, అప్పట్లో ఆయన సినిమాల్లో కనిపించిన గాఢత, తీక్షణత పూర్తిగా లోపించాయి.

అసలు సినిమా ప్లాట్‌ ఏమిటనేది అర్థం కావడానికే చాలా సమయం పడుతుంది. 'ప్రతి పౌరుడూ యూనిఫామ్‌ లేని పోలీసే' అనేది కృష్ణవంశీ చెప్పాలనుకున్న పాయింట్‌ అని ఇంటర్వెల్‌కి ముందు అనిపిస్తుంది. కానీ ఆ పాయింట్‌ ఎత్తుకున్న కాసేపటికే అది పక్కన పడిపోయి కథ మరెటో పోతుంది.

పోలీస్‌ కావడమే జీవిత లక్ష్యంగా బతుకుతోన్న యువకుడు పోలీస్‌ కాలేకపోయినా కానీ పోలీస్‌ డ్యూటీ చేసేయాలని డిసైడ్‌ అవుతాడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు చూస్తున్నపుడు ఎక్కడో లోతుల్లో ఒక మంచి సినిమా కాదగ్గ లక్షణాలు ఉన్నట్టే కనిపిస్తాయి కానీ దానిని కప్పిపుచ్చేసే లోపాలే హైలైట్‌ అవుతుంటాయి. 

ఇంటర్వెల్‌ ముందు వరకు ఆడియన్స్‌ ఇంట్రెస్ట్‌ని హూల్డ్‌ చేయడం కోసం వివిధ త్రెడ్స్‌ అల్లుకుంటూ పోయారు. పోలీస్‌ ఉద్యోగం కోసం తపించే హీరో, సినీ రంగంలో డాన్స్‌ అసిస్టెంట్‌గా పని చేస్తూ కొరియోగ్రాఫర్‌ నుంచి వేధింపులకి గురయ్యే హీరోయిన్‌, ఒక సిన్సియర్‌ పోలీస్‌ కమీషనర్‌కి సంఘ వ్యతిరేక శక్తి అయిన కొడుకు, దొంగతనాలు చేసే మరో లేడీ క్యారెక్టర్‌… ఇలా రకరకాలుగా నడుస్తోన్న కథ ఇంటర్వెల్‌ ముందు 'అలెగ్జాండర్‌' పరిచయంతో ఒక కొలిక్కి వచ్చినట్టు అనిపిస్తుంది. తీరా ఆ అలెగ్జాండర్‌ అసలు కథలోకి తొంగి చూస్తే అనంతమైన శూన్యం తప్ప కాస్తయినా విషయం గోచరించదు. సాయి ధరమ్‌ తేజ్‌తో స్పెషల్‌ క్యారెక్టర్‌ అయితే చేయించారు కానీ ఆ క్యారెక్టర్‌ని స్పెషల్‌గా నిలబెట్టడానికి ఏమీ చేయలేకపోయారు. 

సాయిధరమ్‌ తేజ్‌ వున్నందుకు ఒక్కటంటే ఒక్క సీన్‌ అయినా స్ట్రయికింగ్‌గా లేదు. అలెగ్జాండర్‌ అంటూ ఇచ్చిన బిల్డప్‌లో కనీసం పాయింట్‌ నాట్‌ నాట్‌ వన్‌ పర్సంట్‌ అయినా ఎఫెక్ట్‌ వుండాలిగా? కనీసం ఈ క్యారెక్టర్‌కి ప్రోపర్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ కూడా రాసుకోలేదు. మిగతా యాక్టర్లంతా హై డెసిబెల్‌ పర్‌ఫార్మెన్స్‌తో శ్రవణ శక్తికి పరీక్ష పెడితే సాయిధరమ్‌ తేజ్‌ ఒక్కడూ సైలెంట్‌గా, సటిల్‌గా కనిపించాడు. పవర్‌ఫుల్‌గా చూపించాల్సిన ఈ పాత్రని పేలవంగా తీర్చిదిద్దడమే కాకుండా, అంతకంటే బేలగా ముగించేయడంతో తేజ్‌ చేసిన పాత్ర వృధా పోయింది. సందీప్‌ కిషన్‌కి నటుడిగా తన సత్తా చాటుకునే అవకాశాన్ని ఇంటర్వెల్‌ ముందు సీన్‌ కల్పించింది. పోలీస్‌ కావాలనే తన కల భగ్నమవుతున్నపుడు అతని పెయిన్‌ రియల్‌గా వుంది. అయితే మిగిలిన చాలా పాత్రల్లా తన క్యారెక్టర్‌ని కూడా ఓవర్‌గా డిజైన్‌ చేయడం వల్ల సందీప్‌ చేష్టలుడిగి చూస్తుండిపోవాల్సి వచ్చింది.

ప్రకాష్‌రాజ్‌ నటన ఎనభైల కాలం నాటి ఓవర్‌ ది టాప్‌ యాక్షన్‌ డ్రామాలని తలపిస్తే, తులసి పర్‌ఫార్మెన్స్‌కి పాత కాలం నాటి తమిళ నటులు సైతం చిన్నబోవాలి. హీరోయిన్లిద్దరూ స్కిన్‌ షోకి మాత్రమే పరిమితమయ్యారు. వాళ్లు నటించాల్సిన సందర్భాలు వచ్చినపుడు మిగిలిన ఏ సైడ్‌ యాక్టర్ల పర్‌ఫార్మెన్స్‌కీ తీసిపోలేదు. 

టెక్నికల్‌గా ఉన్నత ప్రమాణాలు పాటించే కృష్ణవంశీ ఇప్పటి ట్రెండ్‌కి అనుగుణంగా అప్‌డేట్‌ కాలేకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. అవుట్‌పుట్‌ పరంగా ఈమధ్య తన గురువు రామ్‌గోపాల్‌వర్మ అందిస్తోన్న చిత్రాలకి ఏమాత్రం తీసిపోని సాంకేతిక విలువలతో నక్షత్రం తెరకెక్కింది. సంగీతం, ఛాయాగ్రహణం, కళ, కూర్పు ఏదీ కూడా నేటి కాలం సినిమాల ప్రమాణాలకి తగ్గట్టు లేవు. గోవిందుడు అందరివాడేలే చిత్రానికి, దీనికి మధ్య మేకింగ్‌, టేకింగ్‌ పరంగా కనిపించిన వ్యత్యాసానికి షాక్‌కి గురవుతారు. సినిమా ముందుకి సాగే కొద్దీ గ్రాఫ్‌ పడిపోతూ, తళుకులు చూపిస్తుందని అనుకున్న నక్షత్రం కాస్తా ప్రేక్షకులకి చుక్కలు చూపించడంతోనే సరిపెట్టింది. 

బాటమ్‌ లైన్‌: మెరవని నక్షత్రం!

– గణేష్‌ రావూరి