Advertisement

Advertisement


Home > Movies - Reviews

Dasara Review: మూవీ రివ్యూ: దసరా

Dasara Review: మూవీ రివ్యూ: దసరా

చిత్రం: దసరా
రేటింగ్: 2.75/5
తారాగణం: నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయికుమార్, టాం చక్కో, పూర్ణ తదితరులు
సంభాషణలు: తోట శ్రీనివాస్
సంగీతం: సంతోష్ నారాయణన్
కెమెరా: సత్యన్ సూరన్
ఎడిటర్: నవీన్ నూలి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: శ్రీకాంత్ ఓడెల
విడుదల: మార్చ్ 30, 2023

"అంటే సుందరానికి" లాంటి కామెడీ సినిమా తర్వాత పూర్తి కాంట్రాస్ట్ లుక్కుతో నాని "దసరా"తో ముందుకొచ్చాడు. చంకీల అంగీలేసి పాట వైరల్ అవ్వడం, నాని కొత్త లుక్ ఆసక్తికరంగా ఉండడం, ట్రైలర్ కూడా గ్రిప్పింగ్ గా అనిపించడంతో అంచనాలు ఏర్పడ్డాయి. 

విషయమేంటంటే..

1990ల్లో వీర్లపల్లి అనే ఊరిలో సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో కథ ఓపెన్ అవుతుంది. అక్కడ ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేష్) స్నేహితులు. ఆ ఊరిలో సిల్క్ బార్ అని ఒకటుంటుంది. ఊరిలోని మగాళ్లంతా అక్కడ తప్ప తాగడం ఒక రివాజు. స్థానిక రాజకీయ నాయకులు వాళ్ల జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురి కథ ఎలా మలుపులు తీసుకుందనేది చిత్రం. 

చేసిన పాత్ర నానికి కొత్తవ్వచ్చు కానీ ప్రేక్షకులకి కాదు. అయినప్పటికీ తనదైన శైలిలో ప్రతిభని చూపించాడు. ఈ విషయంలో నిర్మొహమాటంగా ప్రశంసించవచ్చు. 

కీర్తి సురేష్ కూడా హైలైట్. వెన్నెల పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి గతంలో ఈ తరహా పాత్రలు చేసిన హీరోయిన్స్ కంటే గొప్పగా చేసిందనిపించింది. 

హీరో ఫ్రెండ్ గా చేసిన కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, విలన్ గా మళయాళ నటుడు టాం చక్కో పాన్-ఇండియా ఫార్ములాలో భాగంగా వచ్చారు తప్ప ఆ స్థాయి నటనా ప్రతిభ చూపగలిగేవాళ్లు తెలుగులో కూడా చాలామంది ఉన్నారు. తమకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకున్నందుకు ఈ నటులని కూడా ప్రశంసించాలి. 

సముద్రఖనికి కొత్త లుక్కైతే ఇచ్చారు కానీ గొప్ప పాత్రైతే లేదు. సాయికుమార్ పాత్ర నిడివి ఉన్నంతలో కాస్త పర్వాలేదు. ఝాన్సి చాలా ఈజ్ తో పాత్రలో ఒదిగిపోతూ చక్కగా చేసింది. అవకాశాలు రావాలే గానీ ఈమె ఎప్పుడూ నిరాశపరచదు. క్యారెక్టర్ యాక్టర్ గా టాప్ లెవెల్ కి వెళ్లడానికి చాలా స్కోప్ ఉంది ఈమెకు. 

ఈ సినిమాకి హైలైట్ ఏమిటంటే బీజీఎం. సాధారణ కథని కూడా పై స్థాయిలో నిలబెట్టిన ఘనత ఈ డిపార్ట్మెంటుదే. కెమెరా వర్క్ ని, డిజిటల్ టోనింగ్ ని కూడా శభాష్ అనొచ్చు. 

ఇక ప్రధానమైన మైనస్ కథే. కథనం నడుస్తున్న కొద్దీ ఇలాంటిది ఎక్కడో చూసామన్న డెజావూ అనుభూతి కలుగుతుంటుంది. ఒకటి కాదు రెండు కాదు..చాలా సినిమాల స్ఫూర్తి ఇందులో కనిపిస్తుంది. 

"రంగస్థలం"లాగ కథనాన్ని నడపలనే ప్రయత్నం, 

"పుష్ప" లాగ మాండలికం పలికించాలనే ఉత్సాహం, 

"కాంతార" లాంటి క్లైమాక్స్ ఉండాలనే ఆలోచన, 

అందులో మళ్లీ మగధీరలో లాగ వందమందిని నరుక్కుంటూ రెచ్చిపోయే వైనం, 

"లగాన్" క్రికెట్ టీం ని గుర్తు తెచ్చే హీరో బలగం, 

ఎండింగ్ సీన్లో "రుద్రవీణ" స్ఫూర్తితో ఒక బిట్..ఇలా నదులున్నీ సముద్రంలో కలుస్తాయన్నట్టుగా ఎన్నో సినిమాల కథలు పాయలుపాయలుగా ప్రవహించి ఈ "దసరా"లో కలిసాయి. సముద్రమంటే గుర్తుకొచ్చింది...ఇందులోని ప్రధామైన ట్రాక్ సిద్ధార్థ్, శర్వానంద్ లతో తీసిన "మహాసముద్రం"లో కూడా కనిపిస్తుంది. ఆ విధంగా హిట్ సినిమాల్నే కాదు, స్ఫూర్తి పొందడానికి ఫ్లాపుల్ని కూడా వదల్లేదనిపిస్తుంది. 

దర్శకుడిలో మంచి విషయమైతే ఉంది. టెక్నికల్ గా కథని తెర మీద ఎలా చూపించవచ్చో, సౌండ్ తో ఎలా అకట్టుకోవచ్చో ఔపోసన పట్టాడు. అదే తపన, తపస్సు కథాకథనాల మీద కూడా పెట్టగలిగితే కొత్త అనుభూతినివ్వగలిగే వాడు. 

"దసరా"లో లోపించేది ఆ కొత్తదనమే. ఇంటర్వల్ బ్యాంగ్, ద్వితీయార్ధంలో తొలిభాగం ట్విస్టివ్వడం బాగానే ఉంది. కానీ క్లైమాక్స్ లో అంతకంటే పెద్ద ట్విస్ట్ ఇవ్వకపోతే అది గొప్ప చిత్రమనిపించుకోదు. "రంగస్థలం" స్కోర్ చేసింది అక్కడే. ఊహించగలిగే సాదా క్లైమాక్స్ ఈ "దసరా" కి పడాల్సిన మార్కులు కూడా పడకుందా చేసింది. 

ఓపెనింగ్ సీన్లో ఉన్న గ్రిప్, మొదటి పాటలో ఉన్న కొత్తదనం రాను రాను లేకుండా పోవడం, పైన చెప్పుకున్నట్టు ఇంటర్వెల్ బ్యాంగ్ బాగున్నా ద్వితీయార్ధంలోని మలిభాగం ఫ్లాట్ గా ఉండడం ఈ చిత్రానికి ప్రధానలోపం. 

గొప్ప పాట అనుకున్న "చంకీల అంగీలేసి" వీడియోలో తేలిపోయినట్టయ్యింది. సాధారణంగా హీరో హీరోయిన్స్ పాడుతుంటే వెనక కోరస్ మౌనంగా స్టెప్పులేస్తుంటారు. ఇందులో రివర్స్. వెనుక గ్రూప్ డ్యాన్సర్స్ పాడుతుంటే నాని, కీర్తి లిప్ మూమెంట్ లేకుండా డ్యాన్స్ చెస్తుంటారు. దానివల్ల ఈ పాట మీద పెట్టుకున్న అంచనాలు ఢమాలన్నాయి. 

ఇకపోతే "1995 హ్యాపీ న్యూ ఇయర్" అంటూ ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఒక గ్రీటింగ్ కార్డ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఒక సన్నివేశంలో 15 ఏళ్లు గడిచిపోయాయని నాని కీర్తితో చెబుతాడు. అంటే సినిమా లెక్క ప్రకారం తెర మీద జరుగుతున్న కథాకాలం 2010 అనుకోవాలి. కానీ ఎక్కడా ఆ దాఖలాలు కనపడవు. 1980లని గుర్తు చేస్తూ సిల్క్ స్మిత బార్, 1950లని గుర్తు చేసే కొన్ని సంప్రదాయాలు (2010 నాటికి ఇవి కుగ్రామాల్లో కూడా లేవు. ఎక్కడో ఒక చోట జరిగిందని ఆధారం చూపించవచ్చు. కానీ చూసేవాళ్లకి కన్విన్సింగ్ గా అనిపించదని ఇక్కడ పాయింట్), 2010 నాటి కథే అయినా ఎక్కడా మొబైల్ ఫోన్స్ కనిపించకపోవడం వంటివన్నీ ఆడ్ గా ఉన్నాయి. 

కథగా ఇది ఒక రివెంజ్ డ్రామా. అయితే రా అండ్ రఫ్ యాంబియన్స్లో రఫ్ఫుగా కనిపించే నానిని నానా సినిమాల సమ్మేళనంగా నైపించే కథలో చూడాలనుకుంటే చూడొచ్చు. అంతే తప్ప టైటిల్లో ఉన్నంత పండగ ఫీలింగైతే కలగదు. 

బాటం లైన్: దస "రా"

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?