సినిమా రివ్యూ: దేవదాస్‌

రివ్యూ: దేవదాస్‌ రేటింగ్‌: 2.75/5 బ్యానర్‌: వైజయంతి మూవీస్‌, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ తారాగణం: నాగార్జున అక్కినేని, నాని, రష్మిక మందాన, ఆకాంక్ష సింగ్‌, కునాల్‌ కపూర్‌, నరేష్‌, మురళి శర్మ, శరత్‌…

రివ్యూ: దేవదాస్‌
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: వైజయంతి మూవీస్‌, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌
తారాగణం: నాగార్జున అక్కినేని, నాని, రష్మిక మందాన, ఆకాంక్ష సింగ్‌, కునాల్‌ కపూర్‌, నరేష్‌, మురళి శర్మ, శరత్‌ కుమార్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, సత్య, అవసరాల శ్రీనివాస్‌, ప్రభాకర్‌, సత్యకృష్ణన్‌ తదితరులు
సంగీతం: మణిశర్మ
కూర్పు: ప్రవీణ్‌ పూడి
ఛాయాగ్రహణం: షామ్‌దత్‌
నిర్మాత: అశ్వనీదత్‌ చలసాని
కథనం, దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య టి.
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 27, 2018

ఒక నాగార్జున… ఒక నాని… ఒకరు డాన్‌… ఇంకొకరు డాక్టర్‌… అదీ స్టోరీ! నాగార్జున, నాని కాంబినేషన్‌ కలిసి రావడం 'దేవదాస్‌'కి బిగ్గెస్ట్‌ ప్లస్‌ అయితే, ఆ కాంబినేషన్‌ని దాటి మరే విధమైన సపోర్ట్‌ లేకుండా స్టోరీ, స్క్రీన్‌ప్లే రాసుకోవడం అంతే మైనస్‌. ఈ చిత్రానికి నాగార్జున, నాని ఎంత ప్లస్‌ అయ్యారంటే కొన్ని సందర్భాలలో ఈ సినిమాకున్న బలహీనతలని కూడా పట్టించుకోనంత. ఇద్దరూ ఎంత బాగా చేసారంటే కొన్ని సాధారణ సన్నివేశాలు కూడా రంజింపజేసేంత. ఇంత సాలిడ్‌ కాంబినేషన్‌ని సెట్‌ చేసుకుని వారికి అత్యంత వీక్‌ ప్లాట్‌ఫామ్‌ ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా అన్యాయమనిపిస్తుంది. ఇద్దరి మధ్య వర్కవుట్‌ అయిన కెమిస్ట్రీ చూస్తోంటే… సరయిన కథతో వీళ్లు అద్భుతాలు చేస్తారనే నమ్మకమొస్తుంది.

దేవ (నాగార్జున) డాన్‌ ఎలా అయ్యాడనే అంశంతో కథ మొదలు పెట్టి, అతను కనిపించని శక్తిగా ఎంత ఎదిగాడనే ఇన్‌ఫర్మేషన్‌ ఇచ్చి, కట్‌ చేస్తే… డాక్టర్‌ దాస్‌ (నాని) పరిచయం అవుతాడు. పెద్ద హాస్పిటల్లో వచ్చిన ఉద్యోగం వెంటనే పోవడంతో తమ స్లమ్‌లో చిన్న క్లినిక్‌ నడుపుకుంటూ వుంటాడు. కాల్పుల్లో గాయపడ్డ దేవ తన వద్దకి చికిత్సకి రావడంతో దాసు అతనికి స్నేహితుడవుతాడు. ఇద్దరూ మంచి చెడ్డలు మాట్లాడుకుంటూ, మందు ముచ్చట్లు పెట్టుకుంటూ గడిపేస్తూ వుంటే… ఒక అండర్‌ కవర్‌ పోలీస్‌ పూజ (రష్మిక) దాస్‌పై నిఘా పెడుతుంది. మరోవైపు దేవలోని క్రిమినల్‌ని చంపేసి లవర్‌ని నిద్ర లేపాలని అతని పాత లవ్‌స్టోరీలోని జాహ్నవితో (ఆకాంక్ష) పరిచయానికి దాస్‌ ద్వారా తెరలేస్తుంది. మరి దేవని అతను మార్చుకోగలిగాడా? ఒకవేళ మారినా అన్ని హత్యలు చేసిన దేవ చట్టం నుంచి తప్పించుకోగలడా?

దేవ, దాస్‌ ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ, తక్కువ జరగకూడదని దృష్టి మొత్తం వారి పాత్రల మీదే పెట్టినట్టున్నారు. దీంతో హీరోయిన్లతో సహా మిగిలిన సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌లో దేనికీ తగిన సీన్‌ ఇవ్వలేదు. కీలకమైన విలన్‌ (కునాల్‌ కపూర్‌ డాన్‌గా స్టయిలిష్‌గా వున్నా చెప్పుకోతగ్గ ఇంప్రెషన్‌ వేయలేకపోయాడు) పాత్ర కూడా బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితమయ్యేంతగా దేవ-దాస్‌ పాత్రలు సినిమా రన్‌ టైమ్‌ని భారీ స్థాయిలో ఆక్రమిస్తాయి. కనీసం దేవ-దాస్‌ల లవ్‌స్టోరీస్‌కి అయినా తగినంత స్పేస్‌ ఇచ్చి వుంటే కంటెంట్‌కి అవకాశం వుండేది. ఆ సీన్లు కూడా తూకమేసినట్టు అలా వచ్చిపోతుంటాయే తప్ప ఎక్కడా డ్రైవింగ్‌ సీట్‌ తీసుకోవు.

ఇక పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ ట్రాక్‌ అయితే జోక్‌లానే అనిపిస్తుంది. అంత పెద్ద డాన్‌ ఊళ్లోకి వచ్చి ఒక క్లినిక్‌లో డాక్టర్‌తో స్నేహం చేస్తున్నాడనే అనుమానంతో చేసే అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ కామెడీలో కలిసిపోయింది. ఒకవేళ దీనిని ఎవరైనా సీరియస్‌గా తీసుకుంటారేమో అన్నట్టు పోలీస్‌ గెటప్‌లో రష్మిక మరింత కామెడీగా కనిపిస్తుంది. దేవ, దాస్‌ ఇద్దరూ కలిసి వున్న సన్నివేశాలతో పాటు పిల్లాడి చేతిలోకి వెళ్లిన గన్‌ కోసం నాని పడే పాట్లు, నాగార్జున సెక్సాలజిస్ట్‌ అనుకుని నరేష్‌ తన సమస్యలు చెప్పుకోవడం లాంటి ఎపిసోడ్స్‌ సరదాగా అనిపిస్తాయి.

ఫస్ట్‌ హాఫ్‌లో కథ ఎటూ కదలకపోయినా హీరోలిద్దరి పాత్రలు కలిసిన తర్వాత వినోదం బాగానే పండుతుంది. కానీ ఇంటర్వెల్‌ పాయింట్‌లో అసలు ప్లాట్‌కి (దేవలో మార్పు తీసుకురావడం) మూవ్‌ అయ్యే పరిస్థితులు అంత ఎక్సయిట్‌ చేయకపోగా, రష్మిక క్యారెక్టర్‌ తాలూకు ట్విస్ట్‌ కూడా రివీల్‌ అవడంతో 'నెక్స్‌ట్‌ ఏంటి?' అనే క్వశ్చన్‌ మార్క్‌ పడుతుంది. కథ జోలికి పోనంత వరకు సాఫీగా సాగిపోయిన సినిమా కాస్తా అక్కడ్నుంచీ ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది.

జాహ్నవికి దేవని దగ్గర చేసే ట్రాక్‌ జస్ట్‌ అలా ఓపెన్‌ అయి క్లోజ్‌ అయిపోయి, మళ్లీ స్టోరీ ఎక్కడుందో అక్కడికే వచ్చేస్తుంది. అలాగే పూజ పోలీస్‌ అని రివీల్‌ అయ్యాక ఆ లవ్‌స్టోరీని ముందుకు కదపడానికి కుదరని లాక్‌ పడిపోతుంది. మళ్లీ 'దేవలో మార్పు ఎలా తీసుకురావాలి?' అనే పాయింట్‌ మీదకి ఫోకస్‌ మళ్లిన తర్వాత దేవలోని కౄరత్వం కళ్లారా చూసిన దాస్‌ అతడికి దూరం కావడం, ఇక 'శంకర్‌దాదా' తరహాలో దేవ తనలోని మనిషిని కనుగొనడం, అతడిలోని మార్పు దాస్‌ గుర్తించడం వగైరా ఎమోషనల్‌ సన్నివేశాలు ఆశించిన ఇంపాక్ట్‌ ఇవ్వలేకపోయాయి.

చిన్న పిల్లాడి పాత్రని పరిచయం చేయడం, తద్వారా దేవ తన తప్పులు తెలుసుకోవడం చాలా సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఈ ప్రాసెస్‌లో వినోదం పాజ్‌ తీసుకుని కథనం మరింత మందకొడిగా మారుతుంది. ఇక పతాక సన్నివేశాలయితే ఫస్ట్‌ డ్రాఫ్ట్‌లోంచి సరాసరి తెర మీదకి వచ్చేసినంత 'రఫ్‌'గా వున్నాయి. ముందుగా చెప్పినట్టు ఈ చిత్రానికి దేవ-దాస్‌ మాత్రం భలేగా కుదిరేసారు. ఇద్దరు నటుల ఇమేజ్‌కి, యాక్టింగ్‌ స్టయిల్‌కి తగ్గట్టు పాత్రలు తీర్చిదిద్దడంతో ఇద్దరూ హ్యాపీగా ఇమిడిపోయారు.

ఫస్ట్‌ హాఫ్‌లో చాలా సేపు కథ, కాకరకాయ కూడా అవసరం లేదనిపించేంతగా ఇద్దరూ ముందుండి నడిపించేసి చాలా వినోదాన్ని కూడా పండించారు. అరవై తాకుతోన్న నాగార్జునలో ఆ ఛాయలు అస్సలు లేవు. పైగా సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ఇంకా నలభైలలోనే వున్న భావన కలిగించాడు. ఆయన స్క్రీన్‌ ప్రెజెన్స్‌, స్టయిలిష్‌ అప్పీయరెన్స్‌ ఈ చిత్రానికి బాగా కలిసొచ్చాయి. సహజ నటుడు నాని పక్కింటి కుర్రాడి తరహా పాత్రలో ఒదిగిపోయాడు.

యాక్షన్‌, స్టయిల్‌ అంతా నాగ్‌ పరమైతే తన ట్రేడ్‌మార్క్‌ నేచురల్‌ యాక్టింగ్‌, కామెడీ టైమింగ్‌తో దాస్‌గా ఈ చిత్రానికి మరో పిల్లర్‌ అయ్యాడు. మిగిలిన పాత్రల్లో దేనినీ పూర్తిస్థాయిలో తీర్చిదిద్దకపోవడంతో హీరోయిన్స్‌తో సహా అందరూ అవసరమైనపుడు కనిపించి పోయారు. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలు, నిర్మాణ పరంగా రాజీపడని విలువలతో 'దేవదాస్‌' కనువిందు చేస్తుంది. ముఖ్యంగా ఛాయాగ్రహణం ఈ చిత్రానికి అతి పెద్ద ఆకర్షణగా నిలిచింది.

డే లైట్‌ షాట్స్‌ ఎంత కలర్‌ఫుల్‌గా వున్నాయో, నైట్‌ షాట్స్‌ కూడా అంతే స్ట్రయికింగ్‌గా, చక్కని లైటింగ్‌తో సహజత్వాన్ని నింపుకున్నాయి. పాటలు ఎక్కువగా సన్నివేశాల్లో కలిసిపోయాయి. 'వారూ వీరూ' ఒక్కటే అచ్చంగా పాటలా అనిపిస్తుంది. మణిశర్మ సౌండ్‌ట్రాక్‌ అడ్వాంటేజ్‌ కాలేకపోయినా, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం ఖచ్చితంగా ఎస్సెట్టే. నాగ్‌ క్యారెక్టర్‌కి వచ్చే థీమ్‌ మ్యూజిక్‌… రింగ్‌టోన్‌గా సెట్‌ చేసుకోవాలనిపించేంతగా మెప్పిస్తుంది.

'నిజం చెప్పేస్తే ఇది గతమవుతుంది. అబద్ధాన్ని కొనసాగిస్తే అదే భవిష్యత్తు అవుతుంది' లాంటి సంభాషణలు బాగున్నాయి. 'కాంబినేషన్‌' సెట్‌ అయిన తర్వాత కాంబినేషన్‌ని దాటి ముందుకు పోలేనంతగా రచయితలు, దర్శకుడు తమని తాము లిమిట్‌ చేసేసుకోవడం 'దేవదాస్‌' స్థాయికి కూడా లిమిట్‌ని పెట్టేసింది. ఇద్దరు హీరోలు ఖచ్చితంగా సినిమాకి పెద్ద ప్లస్‌ అయినా, ఈ కాంబినేషన్‌పై పెట్టుకున్న నమ్మకానికి ఇద్దరూ శక్తివరచన లేకుండా జస్టిస్‌ చేసినా కానీ కథ, కథనాల పరంగా కాంప్రమైజ్‌ల కారణంగా 'యావరేజ్‌' మార్కుని దాటలేకపోయింది.

ఆహ్లాదకరమైన కాంబినేషన్‌ సీన్లు, కొన్ని కామెడీ దృశ్యాలు కాస్త కాలక్షేపాన్ని ఇచ్చినా కానీ 'దేవదాస్‌' అంతరాంతరాల్లో ఎక్కడో ఒక బ్లాక్‌బస్టర్‌ బయటకి రాకుండా మరుగున పడిపోయిన భావన కలుగుతుంది. మాంఛి కమర్షియల్‌ వంటకానికి అవసరమైన పదార్థాలు, మసాలాలు అన్నీ సమకూరినా కానీ దానిని తయారు చేసేప్పుడు ఏది ఎంత వేయాలనే విషయంలో సమతుల్యం కుదరని కారణంగా 'వంటకం' వాసనలు అదిరిపోయినా, రుచి దగ్గర తేడా వచ్చింది.

బాటమ్‌ లైన్‌: కాంబినేషన్‌ ప్లస్‌!
-గణేష్‌ రావూరి