సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువంటారు. అది నిజం కూడా. ముహూర్తం చూడనిదే కాలు కూడా కిందపెట్టని ప్రముఖులున్నారు మన పరిశ్రమలో. అలాంటి సెంటి'మెంటల్' ఇండస్ట్రీలో మంగళవారం నాడు ఓ ఫంక్షన్ పెడతారని ఎవరూ ఊహించరు. ఎందుకంటే, 90 శాతం మంది టాలీవుడ్ జనాలు మంగళవారాన్ని అశుభంగా భావిస్తారు. కానీ అరవింద సమేత యూనిట్ మాత్రం మంగళవారాన్నే ఫిక్స్ చేసింది.
అవును.. అక్టోబర్ 2 మంగళవారం అరవింద సమేత ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం పారిన్ షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకొని మరీ ఈ తేదీని ప్రకటించారు మేకర్స్. ఇలా మంగళవారం ఫంక్షన్ పెట్టడం వెనక కూడా బలమైన సెంటిమెంట్ ఉందట.
నిర్మాత, దర్శకుడు, హీరో.. ఇలా ప్రముఖల జాతకాలన్నీ పరిశీలించి మరీ ఈ తేదీని ఫిక్స్ చేశారట. కాబట్టి మంగళవారం ఫంక్షన్ పెట్టినా సినిమా రిజల్ట్ పై ఎలాంటి నెగెటివ్ ఎఫెక్ట్ పడదట. ఇలా పండితులు భరోసా ఇవ్వబట్టే అక్టోబర్ 2ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు విడుదల తేదీని కూడా ఇదే ప్రాతిపదికన నిర్ణయించినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 11న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఆరోజు శుక్రవారం కాదు. గురువారం పడింది. అయినప్పటికీ జాతక రీత్యా గురువారం భేషుగ్గా ఉందని పండితులు సూచించడంతో ఆ రోజును ఫిక్స్ చేశారు.
మొత్తమ్మీద అరవింద సమేత చిత్రానికి సంబంధించి మొన్నటివరకు ఉత్కంఠ రేపిన రెండు తేదీలపై ఇలా ఒకేరోజు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మొట్టమొదటి సినిమా ఇది.