Advertisement

Advertisement


Home > Movies - Reviews

Devil Review: మూవీ రివ్యూ: డెవిల్

Devil Review: మూవీ రివ్యూ: డెవిల్

చిత్రం: డెవిల్
రేటింగ్: 2.25/5
తారాగణం:
కళ్యాణ్ రామ్‌, సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగర్, సత్య, హరితేజ, సీత, షఫి తదితరులు
ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్.ఎస్
కూర్పు: తమ్మిరాజు
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
రచన: శ్రీకాంత్ విస్సా 
నిర్మాత-దర్శకత్వం: అభిషేక్ నామా 
విడుదల: 29 డిసెంబర్ 2023

గత ఏడాది "బింబిసార" తో హిట్టు కొట్టి ఈ ఏడు "అమిగోస్" తో ఫ్లాప్ చవిచూసి సంవత్సరాంతంలో "డెవిల్" తో పలకరించాడు కళ్యాణ్ రామ్‌. అలాగే మరొక విశేషం ఏంటంటే ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత ఒకరే. నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా తెరంగేట్రం చేసిన సినిమాగా తెర మీదకొచ్చిన ఈ "డెవిల్" లోని విషయాలు, విశేషాలు ఏవిటో చూద్దాం. 

డెవిల్ (కళ్యాణ్ రామ్‌) ఒక బ్రిటీష్ గూఢచారి. రాసపాడు అనే ఊళ్లో జరిగిన ఒక జమిందారు కూతురి హత్య కేసుని పరిశోధించదానికి వస్తాడు. ఈ కేసుకి సుభాష్ చంద్రబోసుకి సంబంధించిన త్రివర్ణ అనే వ్యక్తికి ఒక లింకుంటుంది. ఆ లింకుని ఛేదించడం డెవిల్ పని.

ఇక ఆ జమిందార్ మేనకోడలు నైషధ (సంయుక్త మీనాన్) సుభాష్ చంద్రబోస్ కి చెందిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి కోవర్టుగా పని చేస్తుంటుంది. అసలామె ఉద్దేశాలేవిటో తెలుసుకోవడానికి ఆమెను ప్రేమలోకి దింపుతాడు డెవిల్. చివరికి ఏమౌతుంది? నటనగా మొదలైన ప్రేమ అన్ని సినిమాల్లోలాగానే నిజమైన ప్రేమగా మారుతుందా? హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడా లేక బ్రిటీష్ వాళ్లని గెలిపిస్తాడా? అసలు త్రివర్ణకి, డెవిల్ కి సంబంధం ఏమై ఉంటుంది? ఈ ప్రశ్నలకి సమాధానాలు కథనంలో ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితానికి ముడిపడి ఉన్న కొన్ని కాల్పనిక కథలు, కొన్ని బయోపిక్కులు గత కొంతకాలంగా వెలుగులోకొస్తున్నాయి. ఆ కోవలో ఒక మంచి దేశభక్తి ప్రేరకమైన కథని అందించడానికి రాసుకున్నదే ఈ "డెవిల్". అయితే కథగా ఉన్న దానిని తెరకెక్కించడంలో చాలా ఆపసోపాలు పడ్డారు. ఆసక్తిగా మలచడానికి కిందా మీదా పడ్డా కావాల్సిన దినుసులు సరిగా పడక చప్పగా తయారైన సినిమా ఇది. 

కథని ఆసక్తిగా మలిచేది కథనం. ప్రేక్షకులకి ఉత్కంఠ కలిగించాలన్న, కట్టిపారేయాలన్నా ఇదే మూలం. అలాగే సామాన్యమైన సన్నివేశాలు కూడా విశేషంగా అనిపింపజేసే టెక్నిక్ నేపథ్య సంగీతం. మెదడుని తాకేది స్క్రీన్ ప్లే అయితే, మనసును తాకేది బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఈ రెండూ ఈ సినిమాలో మైనస్సులైపోయాయి. దాంతో తెర మీద ఏవో సీన్లు కదులుతున్నా ఎక్కడా అనుభూతి కలగదు. ఎవరు చస్తున్నా, ఎవరు తప్పించుకుంటున్నా పెద్దగా భావోద్వేగం కదలదు. 

ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు నిర్మాణ విలువలు. 1940ల నాటి యాంబియెన్స్ ని చక్కగా తెర మీద నిలిపారు. ఆర్ట్ డైరెక్షన్ కి ఫుల్ మార్క్స్ వెయ్యాలి. అలాగే మేకప్ విభాగం కూడా. కెమెరా పని తనం, సీన్ ఎడిటింగ్ వగైరాలు బాగున్నాయి. టెక్నికల్ గా ఈ విషయాల్లో ఉన్న బలం పైన చెప్పుకున్నట్టు కనీసం స్క్రీన్ ప్లేలో ఉండుంటే బాగుండేది. పాటలు తేలిపోయాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా గుండెలకి హత్తుకునేలా లేదు. 

ఈ చిత్రానికి ప్రధానమైన మైనస్ దర్శకత్వం. ఏ సీన్ ఎలా మలిస్తే కన్విన్సింగా ఉంటుందనే కొలతలు తెలీక తీసినట్టుంది. ఉదాహరణకి ఒక పక్కన బ్రిటీష్ ఆర్మీ ట్యాంకర్లు, గన్స్, సైనికులు కలిసి ఒక మోస్తరు బెటాలియన్ ఉంటే మరో పక్క నుంచి హీరో కళ్యాణ్ రామ్ ఒక చేపలు పట్టుకునే పడవలాంటి దాంట్లో వీపుకి రెండు పొడవాటి తుపాకులు కట్టుకుని ఫైటింగ్ కి వచ్చేస్తాడు. బ్రిటీష్ వాళ్లు పేల్చే మందుగుండు సామగ్రీలో ఒక్క బులెట్ కానీ, బాంబు కానీ అయ్యవారిని తాకదు. ఆయన పేలిస్తే మాత్రం ఒక్క పేలుడికి పదేసిమంది సైనికులు గాల్లోకి ఎగిరి మరీ చచ్చిపోతారు. సినిమా అంటే ఇది మామూలే కదా అనుకున్నా మరీ ట్రోలింగ్ మెటీరియల్ లాగ తీయకూడదనేది పాయింట్. 

ఈ తరహా యాక్షన్ సన్నివేశాలు ఎప్పుడో 1980ల్లో ఉండేవి. సినిమా కథ 1940ది కాబట్టి 1980 నాటి ఫ్యూచరిస్టిక్ ఫైట్స్ పెట్టామని అనుకుందో ఏమో దర్శకత్వ విభాగం. కానీ జనం చూస్తున్నది 2023లో అని మర్చిపోతే ఎలా? 

కొన్ని సన్నివేశాలు బాహుబలి నుంచి చూసి ఇన్స్పైర్ అయినట్టుగా అనిపిస్తాయి. మొదట్లో ఒక సముద్రపు దొంగల ముఠా ఒక ఓడపై దాడి చేస్తుంది. ఆ ముఠా నాయకుడు ఏదో విచిత్రమైన భాషలో మాట్లాడతాడు. అది చూడగానే బాహుబలిలోని కాలకేయుల కిలికి భాష గుర్తొస్తుంది. మరొక చోట ఊరిమీదకి పిండారీల దళం దండెత్తుకొస్తోందని ఒక డైలాగుంటుంది. అది కూడా బాహుబలిలో ఉన్నదే. ఇలాంటివి అనవసరపు డైవెర్షన్స్. చూస్తున్న కథలోంచి డైవర్ట్ అయ్యి ప్రేక్షకుడిని వేరేదేదో ఆలోచించేలా చేయడం దర్శకత్వలోపాల్లో ఒకటి.

డైలాగ్స్ అక్కడక్కడ బాగానే ఉన్నా, హీరో ఎలివేషన్ కోసం రాసుకున్న పంచులు రొటీన్ గా అనిపించాయి. ఒకటి రెండు రివీలింగ్ సీన్స్ లో ఎమోషన్ బాగానే పండింది. కానీ అది సరిపోదు. 

నటీనటుల్లో కళ్యాణ్ రామ్ పాత్ర కాసేపు డిటెక్టివ్ లాగ, మరి కాసేపు గూఢచారిలాగ సాగింది. చూడడానికి కన్విన్సింగ్ ఉన్నా అతని మీద చిత్రీకరించిన కొన్ని యాక్షన్ సీన్స్ మరీ అతిగా అనిపించాయి. 

సంయుక్త మీనన్ పాత్ర బాగుంది. మాళవికానాయర్ కనిపించేది కొంచెం సేపే అయినా ఆమె పాత్ర బలంగా ఉంది. షఫి, సత్య, అజయ్ మొదలైనవారు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు. 

అయితే సుభాష్ బొస్ కోసం సీక్రెట్ గా పనిచేసే ఫ్రీడం ఫైటర్స్ గా కనిపించే కొన్ని పాత్రలు జస్ట్ ప్యాడింగ్ కోసం అన్నట్టుగా మిగిలిపోయాయి. వాళ్లని సరిగ్గా వాడుకుని ఉండుంటే మరింత బలమైన కథనమయ్యుండేది. 

కథగా స్పాన్ ఉన్నా, కథనంలో తొట్రుపాట్ల వల్ల, ఎమోషన్ ని పండించడంలో విఫలమవ్వడం వల్ల, సరైన పీక్ మొమెంట్స్ లేకపోవడం వల్ల ప్రేక్షకుడికి పైసావసూల్ అనిపించదు. తీసినవాళ్ల ప్రయత్నం మంచిదే అయినా చూసినవాళ్లకి ఫలితం ఆశాజనకంగా లేదు.

బాటం లైన్: పండని దేశభక్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?