Advertisement

Advertisement


Home > Movies - Reviews

First Day First Show Review: మూవీ రివ్యూ: ఫస్ట్ డే ఫస్ట్ షో

First Day First Show Review: మూవీ రివ్యూ: ఫస్ట్ డే ఫస్ట్ షో

టైటిల్: ఫస్ట్ డే ఫస్ట్ షో
రేటింగ్: 1.5/5
తారాగణం: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, ప్రభాస్ శీను, వంశీధర్ గౌడ్ తదితరులు
కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి
సంగీతం: రధన్
నిర్మాతలు: శ్రీజ ఏడిద, శ్రీరామ్ ఏడిద
రచన: అనుదీప్ కేవీ
దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ
విడుదల తేదీ: 2 సెప్టెంబర్ 2022

కొన్ని సినిమాలు అనేక కారణాల వల్ల గాలివాటానికి ఆడేస్తుంటాయి. ఒకటి ఆడింది కదా అని దానినొక జానర్ అనుకునో, ఫార్ములా అనుకునో అదే కోవలో ఇంకొన్ని తయారవుతుంటాయి. 

కరోనా మొదటి వేవ్, రెండో వేవ్ మధ్యనున్న సంధికాలంలో "జాతిరత్నాలు" వచ్చింది. లాక్డౌన్ నుంచి బయటిపడి థియేటర్లకొచ్చిన ప్రేక్షకులు ఆ సినిమాని హిట్ చేసేసారు. ఫార్స్ కామెడీ, చిన్న చిన్న పంచులు మొదలైన వాటితో పాటు నవీన్ పోలిశెట్టి సహజమైన నటనాప్రతిభ ఆ సినిమా విజయానికి కారణమయ్యింది. దర్శకుడు అనుదీప్ కే.వీ ఆ చిత్రంతో పేరు పొందాడు. 

ఇప్పుడు మళ్లీ అదే కోవలో "ఫస్ట్ డే ఫస్ట్ షో" రాసుకుని, "జాతిరత్నాలు" కంటే చిన్న స్కేల్ లో ఇద్దరు కొత్త దర్శకుల చేత తెరకెక్కించాడు. అన్నిటా, అంతటా తానే ఉండి ఈ ప్రాజెక్ట్ కి ఒక రకంగా షో రన్నర్ గా ఉన్నాడు అనుదీప్. 

ఇక విషయంలోకి వెళ్దాం. 

సినిమా మొత్తం 2001 నేపథ్యంలో జరుగుతుంది. హీరోహీరోయిన్లిద్దరూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. 

"ఖుషి" సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తన లవర్ తో కలిసి చూడాలనుకున్న  హీరో ఎంత కష్టపడి టికెట్లు సాధించాడనేది కథ. ఇంత చిన్న లైన్ ని 2 గంటల సినిమాగా మలచాలంటే ఆద్యంతం నవ్వులు నింపాలి. స్క్రిప్ట్ పకడ్బందీగా ఉండాలి. 

కానీ టెకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తోచిన కామెడీ పెట్టేసుకుని కిచిడీ చేసేసారు. పావు గంటలో అయిపోయే షార్ట్ ఫిల్మ్ ని రెండు గంటల సేపు సాగదీసినట్టయ్యింది. 

ఇక్కడ ప్రధానమైన లోపం ఒకటి గమనించాలి. 

"ఖుషి" తర్వాతే తప్ప "బద్రి", "తమ్ముడు" టైముకి పవన్ కళ్యాణ్ సినిమాలకి టికెట్స్ దొరకనంత పరిస్థితైతే లేదు. అప్పుడప్పుడే మొగ్గగా ఉన్న అతను స్టార్ గా రెక్కలు విప్పుకుంటున్నాడు. అయినా ఆ రోజుల్లో బ్లాక్ టికెట్స్ కూడా ప్రతీ సినిమా హాలు దగ్గర విరివిగా అమ్మేవాళ్ళు. జేబులో డబ్బుంటే కులాసాగా టికెట్ కొనుక్కుని వెళ్ళి సినిమా చూసేవాళ్లు. కానీ దానిని పూర్తిగా వక్రీకరించేసి ఆ రోజుల్లో మొదటి ఆట టికెట్ సంపాదించడమేదో పెద్ద ఘనకార్యం అన్నట్టు చూపించడం, దానినే హీరోయిజమనుకోమనడం ఆశ్చర్యం. 

ఇందులో ఒక్క తనికెళ్ల భరణి పాత్ర తప్ప అందరూ అసహజంగానే ఉంటారు. 

75-80 ఏళ్ల వృద్ధుడిని పవన్ కల్యాణ్ ఫ్యాన్ లాగ చూపించడం, అతను పోతే ఒకడొచ్చి "హే చికీత.." పాటని విషాదగీతంగా పాడడం, ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ చుట్టూ తిప్పిన డ్రామాని స్మశానం దాకా తీసుకుపోవడం చిరాకుకే చిరాకు తెప్పిస్తుంది. నాన్సెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా ఉంటుంది ఈ ట్రాకంతా. 

హీరో పడే కష్టానికి కనెక్ట్ కావడానికి అతను చేసే పనే పనికిమాలినది. ఆ విషయం తండ్రి పాత్ర చేత చెప్పిస్తూనే ఉన్నారు. ఆ పనికిమాలిన పనికి ఏదో పెద్ద వీరత్వాన్ని ఆపాదించి సాగదీస్తుంటే ప్రేక్షకుడికి అసహనం తారాస్థాయికి వెళ్తుంటుంది. 

ఒక సీన్లో పాత్రగా అనుదీప్ కనిపించి "నే అడిగింది చెప్ప..నే చెప్పేది ఇనాలె" అంటాడు. "జాతి రత్నాలు" తర్వాత కాస్త భిన్నంగా, అంతకంటే బెటర్ గా ఏదైనా చెప్తాడనుకుంటే మరింత నాసిరకంగా ఈ కథ చెప్పాడు..జనం చూసేయాలనుకున్నాడు. 

అదేంటో గానీ...అమలాపురం నుంచి నారాయణ్ ఖేడ్ దాకా తెలుగువాళ్లల్లో 90% మంది పవన్ కల్యాణ్ అభిమానులే అన్నట్టు చూపించడం భజనకి పరాకాష్ట. 

కాస్త ఉన్నంతలో పర్వాలేదనిపించేవి వెన్నెల కిషోర్ ఎపిసోడ్, ఒక పాట. మిగతాదంతా జంక్ మెటీరియలే. 

టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులరైన సంచిత బసుని బిహార్ నుంచి తీసుకొచ్చారు. మంచి ఫొటోజెనిక్ ఫేస్. కానీ అత్యంత పేలవమైన క్యారెక్టర్ రాసుకున్నారు ఆమెకి. హీరోతో సమానంగా ఆమె కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే. 

హీరోగా కనిపించిన శ్రీకాంత్ రెడ్డి పక్కా షార్ట్ ఫిల్మ్ నటుడిగా ఉన్నాడు తప్ప బాక్సాఫీసు కలెక్షన్స్ తెప్పించగలిగే కటౌట్ గానీ, విషయం గానీ కనపడలేదు.

సాంకేతిక అంశాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 

అత్యంత లో బడ్జెట్లో తీసి, ఎంత 2 గంటల్లో ముగించినా ఇంతోటి కథ ఎప్పుడౌతుందా అనిపిస్తూ వాచీలకేసి చూసుకునేలా చేసారు. ఓటీటీలో కూడా బోరుకొట్టించగలిగే చిత్రమిది. 

బాటం లైన్: ఫస్ట్ డే ఫ్లాప్ షో

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?