cloudfront

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: గీత గోవిందం

సినిమా రివ్యూ: గీత గోవిందం

రివ్యూ: గీత గోవిందం
రేటింగ్‌: 3.25/5
బ్యానర్‌: జిఏ 2 పిక్చర్స్‌
తారాగణం: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా, రాహుల్‌ రామకృష్ణ, వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు, నాగబాబు తదితరులు
సంగీతం: గోపి సుందర్‌
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
ఛాయాగ్రహణం: మణికండన్‌
నిర్మాత: బన్నీ వాస్‌
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పరశురాం
విడుదల తేదీ: ఆగస్ట్‌ 15, 2018

క్యారెక్టరైజేషన్‌ సరిగ్గా కుదిరితే దాని చుట్టూ ఒక కథ అల్లడం అంత కష్టమేం కాదు. ఆర్య, భలే భలే మగాడివోయ్‌ లాంటివి అలా క్యారెక్టరైజేషన్‌తో మ్యాజిక్‌ చేసినవే. అలాగే కాన్‌ఫ్లిక్ట్‌ సరిగ్గా సెట్‌ అయితే దాంతోనే కథని నడిపించడం అంత కంటే సులువు. ఖుషీ, బొమ్మరిల్లుని బ్లాక్‌బస్టర్‌గా మార్చినవి చిన్న కాన్‌ఫ్లిక్ట్‌లే. అలాగే 'గీత గోవిందం'లో కూడా చిన్న కాన్‌ఫ్లిక్ట్‌తోనే పరశురాం కొండంత వినోదం పండించాడు.

గోవింద్‌ (విజయ్‌) చాలా చాలా మంచివాడు. గీతని (రష్మిక) చూసి ప్రేమిస్తాడు. ఆమెకి కూడా తనపై మంచి ఇంప్రెషనే వేస్తాడు. ఒకట్రెండు సీన్లయితే 'ఐ లవ్యూ' చెప్పడానికి ఎంతో దూరంలో లేదనుకుంటాడు. కానీ ఇంతలో చిన్న పొరపాటు చేస్తాడు. ఆమె నిద్రిస్తూ వుండగా సెల్ఫీ తీసుకుందామనే ప్రయత్నం చేయగా, బస్సు కుదుపుకి పొరపాటున ఆమెకి ముద్దు పెట్టేస్తాడు. దాంతో ఆమె దృష్టిలో చులకన అయిపోతాడు. ఆమె తన అన్నయ్యకి (సుబ్బరాజు) ఫోన్‌ చేసి వచ్చి వీడిని చంపేయమని చెప్పడంతో పారిపోతాడు. కానీ తన నుంచి ఎక్కువ దూరం వెళ్లలేడు. మళ్లీ కలిసిన సిట్యువేషన్‌లో ఆమె కూడా అసలు సంగతి బయటపెట్టలేదు.

ఏ కథలో అయినా కాన్‌ఫ్లిక్ట్‌ మొదటి ఇరవై నిమిషాల్లో వచ్చేయాలనేది స్క్రీన్‌ప్లే రూలు. కానీ జనరల్‌గా లవ్‌స్టోరీలకి ఇది వర్తించదు. కాన్‌ఫ్లిక్ట్‌ని ఇంటర్వెల్‌ దగ్గర ఎస్టాబ్లిష్‌ చేసేలోగా టైమ్‌పాస్‌ చేయడం మన లవ్‌స్టోరీలకి అలవాటు. కానీ ఈ కథలో సంఘర్షణ సరిగ్గా స్క్రీన్‌ప్లే రూల్స్‌ ప్రకారం తొలి ఇరవై నిమిషాల్లోనే మొదలవుతుంది. ఇక దానినే ఆలంబన చేసుకుని పరశురాం రాసుకున్న పకడ్బందీ కథనం, పాత్రలని 'లాక్‌' చేస్తూ వెళ్లిన విధానం ఈ చిత్రాన్ని రసవత్తరంగా మార్చింది.

ప్రేమకథలు సక్సెస్‌ కావడానికి కావాల్సిన మరో ముఖ్యమైన అంశం... లీడ్‌ పెయిర్‌! హీరో హీరోయిన్లుగా ఎవరు నటించారు, వారు ఎంత టాలెంటెడ్‌ అనేదానిపైనే వారిపై రాసిన సన్నివేశాలు ఎలివేట్‌ అవుతాయి. పరశురాం గతంలో తీసిన కొన్ని చిత్రాల్లో హీరోలు కుదరక రేంజ్‌ తగ్గిపోయాయి. కానీ కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే హీరో వస్తాడని... అర్జున్‌రెడ్డి రాకముందే ఈ చిత్రానికి విజయ్‌ దొరికేసాడు. అర్జున్‌రెడ్డితో ప్రేక్షకుల్లో ఏర్పడిన ఇమేజ్‌ కూడా ఈ గోవిందం పాత్రకి అదనంగా దోహదపడింది. గోవిందంని అపార్ధం చేసుకుని గీత అతనిపై అభాండాలు వేసే పలు సందర్భాలలో 'అర్జున్‌ రెడ్డి' తలపుకి రావడంతో ఆ సన్నివేశాలు, సంభాషణలు మరింత రక్తి కడతాయి.

గోవిందం పాత్రలో లీనమైపోయి అత్యంత సహజమైన నటనతో మెప్పించిన విజయ్‌కి జోడీగా నటించిన రష్మిక కూడా హావభావాలతోనే ఎన్నో మాటలు పలికించేస్తూ అద్భుత అభినయంతో అమితంగా ఆకట్టుకుంది. కేవలం కంటిచూపుతోనే ఆమె చాలా సన్నివేశాల్లో ఎన్నో సంభాషణలు చెప్పినట్టనిపిస్తుంది. ఎనభై శాతానికి పైగా సినిమాలో హీరో హీరోయిన్లు మినహా మిగిలిన ఎవరూ వుండరు కానీ ఆ ఇద్దరే కనిపిస్తున్నారనే భావనే కలగకపోగా, ఇద్దరూ కలిసి కనిపించిన ప్రతి సందర్భాన్ని ఎంజాయ్‌ చేసేలా చేసారు. చిన్న 'గీత'లాంటి కథ వున్న ఈ చిత్రాన్ని నడిపించడంలో దర్శకుడు పరశురాం చాలానే చాతుర్యం చూపించాడు.

కథని మొదలు పెట్టడానికి నిత్యామీనన్‌ క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్‌ చేయడం, ఆమెతో విజయ్‌ కథ చెబుతున్నట్టుగా మొదలు పెట్టడం, చివర్లో ప్రేమకథలకి తప్పని ఒక రొటీన్‌ రూట్లోకి వెళ్లిపోయిన తర్వాత వెన్నెల కిషోర్‌ పాత్రని ఇంట్రడ్యూస్‌ చేయడం, అతని పాత్ర ద్వారా రొటీన్‌ క్లయిమాక్స్‌ బోర్‌ కొట్టకుండా చూసుకోవడం లాంటివి బాగా ప్లస్‌ అయ్యాయి. అలాగే సుబ్బరాజుకి అసలు సంగతి ఎప్పుడు తెలిసిపోతుందో, దాని వల్ల విజయ్‌ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో అనే టెన్షన్‌ని కూడా అలాగే మెయింటైన్‌ చేస్తూ ఆసక్తి సన్నగిల్లని విధంగా కథనం రాసుకోవడం చాలా దోహదపడింది. అదే విధంగా గోవింద్‌ గొప్పతనం గీత గ్రహించడానికి కూడా మంచి ప్లాంటింగ్‌ అండ్‌ పే ఆఫ్‌ పడడంతో ఎక్కడా ఏ ఎమోషన్‌ ఫోర్స్‌డ్‌గా అనిపించకుండా చాలా కన్విన్సింగ్‌ లవ్‌స్టోరీలా వుండడం దీనికి ఇంకాస్త బూస్ట్‌ ఇచ్చింది.

అయితే కథ మొదలు పెట్టినపుడు స్మూత్‌ టేకాఫ్‌ లేకుండా సీన్ల మధ్య జంప్స్‌ వున్నట్టు అనిపించడం పంటి కింద రాయిలా తగులుతుంది. ముఖ్యంగా అను ఎమాన్యుయేల్‌పై చిత్రీకరించిన సన్నివేశం మరీ అతికించినట్టు అనిపిస్తుంది. అలాగే హీరోయిన్‌కి వున్న అపార్ధం తొలగిపోయిన తర్వాత హీరో అభ్యంతరం చెప్పడం కూడా ఇంకాసేపు డ్రాగ్‌ చేయడానికి చెప్పిన కారణంలా తోస్తుంది. యాక్షన్‌కి స్కోప్‌ వున్నా కానీ దాని జోలికే పోకుండా గోవింద్‌ క్యారెక్టర్‌ని సగటు యువకుడిలా చూపించడం, ఒక సగటు కుర్రాడికి ఇలాంటి సమస్య వస్తే ఏ విధంగా డీల్‌ చేసుకుంటాడో అలాగే సమస్యని పరిష్కరించడం చాలా బాగుంది. సింగిల్‌ లైన్‌ స్టోరీతో ఇంత పకడ్బందీ స్క్రీన్‌ప్లే రాసుకోవడంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా ఎక్కడా లోటు రానివ్వకుండా నడిపించిన విధానంలోనే పరశురాం ప్రతిభ తెలుస్తుంది.

స్టాండర్డ్‌ త్రీ-యాక్ట్‌ స్ట్రక్చర్‌తోనే ఒక సూపర్‌ ఎంటర్‌టైనింగ్‌ లవ్‌స్టోరీ మలిచిన పరశురాం తన టాలెంట్‌ ఏమిటనేది ఇందులో పూర్తిగా చూపించగలిగాడు. ఇంతకాలం తను పడ్డ కష్టానికి తగ్గ గుర్తింపు, గౌరవం అన్నీ ఈసారి సాధిస్తాడు. ఇక ప్రేమకథలు గుర్తుండిపోవడానికి కావాల్సిన మంచి పాటలు ఇందులో చక్కగా కుదిరాయి. ఇంకేం ఇంకేం కావాలే పాట గురించి ప్రత్యేకించి చెప్పేదేమీ లేదు. ఏంటీ ఏంటీ, వచ్చిందమ్మా పాటలు కూడా వినసొంపుగా వున్నాయి. పాటల కోసం లొకేషన్లు షిఫ్ట్‌ చేసేయడం కాకుండా కథలో భాగంగానే చూపించడం మరో ప్లస్‌ అయింది.

యువతకి ఏం నచ్చుతుందో చక్కగా బేరీజు వేసుకుని తను ఎలాంటి పాత్రలు చేస్తే వారికి ఇంకా దగ్గర అవుతాడనేది గుర్తిస్తూ ప్రతి సినిమాతోను ఎదుగుతూ వెళుతోన్న విజయ్‌ దేవరకొండ స్టార్‌డమ్‌ని మరింత పెంచే చిత్రమిది. అర్జున్‌ రెడ్డి అతడిని యూత్‌కి ఫేవరెట్‌ని చేస్తే, గోవింద్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటాడు. భారీ అంచనాలతో వచ్చిన చిత్రం ప్రేక్షకులని టికెట్టు డబ్బులకి మించిన వినోదంతో సంతృప్తి పరిచి పంపించినపుడు ఇక దాని ఫలితం ఎలా వుంటుందనేది స్పెషల్‌గా మెన్షన్‌ చేయాల్సిన పనిలేదు.

బాటమ్‌ లైన్‌: కొండంత వినోదం!
-గణేష్‌ రావూరి