Ghani Review: మూవీ రివ్యూ: గని

టైటిల్: గని రేటింగ్: 2.25/5 తారాగణం: వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్, జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నదియా, నరేష్, తనికెళ్ల, తమన్నా తదితరులు కెమెరా: జార్జ్ విలియంస్ ఎడిటింగ్: మార్తాండ్…

టైటిల్: గని
రేటింగ్: 2.25/5
తారాగణం: వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్, జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నదియా, నరేష్, తనికెళ్ల, తమన్నా తదితరులు
కెమెరా: జార్జ్ విలియంస్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్
సంగీతం: తమన్
నిర్మాత: సిద్ధు, అల్లు బాబి
దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి
విడుదల: 8 ఏప్రిల్ 2022

క్రీడల నేపథ్యంలో సినిమాలు చాలానే వచ్చాయి, వస్తున్నాయి. అయితే ఎక్కడో ఒక లగాన్, ఒక దంగల్ లాంటివి తప్ప మనసుల్ని కట్టి పారేసే సినిమాలు అరుదే. 

అయితే బాక్సింగ్ నేపథ్యంలో కథ అని గత కొన్నేళ్లుగా ప్రచారం చేసుకున్న “గని” ఒక వర్గం ప్రేక్షకుల అటెన్షనైతే పొందగలిగింది.

వరుణ్ తేజ్ బాడీ మేకవర్ ఈ చిత్రం పోస్టర్ కి, ట్రైలర్ కి ప్రధాన ఆకర్షణ. అలాగే ముఖ్యమైన పాత్రలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, స్పెషల్ సాంగులో తమన్నా మొదలైనవన్నీ కలిపి ఇదొక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనే అభిప్రాయం కలిగింది. 

విషయంలోకి వెళితే ఇది సింగిల్ పాయింట్ రివెంజ్ డ్రామా. క్రీడా నేపథ్యమే తప్ప ఆ క్రీడ చుట్టూ ఎటువంటి ఎమోషన్ ని నిలబట్టలేదు కథకుడు. 

మన దేశంలోని బాక్సింగ్ క్రీడాకారులు సరైన వనరులు లేక ఎలా ఇబ్బంది పడుతున్నారో ఒక సీన్లో సమాచారం మాత్రం పెట్టారంతే. అంతకు మించి దీనిని బాక్సింగ్ సినిమా అని చెప్పుకోనక్కర్లేదు. ఆమాటకొస్తే ఇక్కడ బాక్సింగ్ కాకుండా ఏ క్రీడ పెట్టినా కూడా తేడా పడదు.

ఎప్పుడో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన పవన్ కళ్యాణ్ “తమ్ముడు” లోనే భావోద్వేగభరితమైన కథ, సన్నివేశాలున్నాయి. ఇక్కడ ఆ డ్రామా కూడా పండలేదు. 

సాధారణంగా సినిమా మొదటి పది నిమిషాలు చూస్తే ముందు ముందు ఎలా ఉండబోతుందో సూచనప్రాయంగా తెలుస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. పేలవమైన సంభాషణలు, రొటీన్ ఫార్ములా సాంగ్స్, ఎస్టాబ్లిషింగ్ షాట్స్ అన్నీ చూస్తే ఫార్ములాని ఫాలో అయ్యి చేసిన సినిమా తప్ప సహజంగా మనసులోంచి పుట్టినట్టు అనిపించదు.

ఫస్టాఫ్ అంతా ఎక్కడా గ్రిప్ లేకుండానే సా..గుతుంది. సెకండాఫ్ అయినా కూర్చోబెట్టగలగడానికి కారణం ఉపేంద్ర స్క్రీన్ ప్రెజెన్స్, తమన్నా పాటాల్లాంటివి. అలాగని తమన్నా సాంగ్ అద్భుతమని కాదు. కేవలం తెర మీద తెలిసిన స్టార్ నర్తిస్తోందన్న ఆసక్తి మాత్రమే. 

ఉపేంద్ర రివీలింగ్ సీన్ ఒక్కటి కాస్త ఆసక్తికరంగా చేయగలిగారు. 

నిజానికి ఈ మాత్రం తారల చమక్కు లేకుండా ఈ సినిమాని ఊహించుకుంటేనే కష్టమనిపిస్తుంది. 

కథారచన, దర్శకత్వం సాధారణ స్థాయిలో ఉన్నాయి. లవ్ ట్రాక్ ని పరమ నీరసంగా నడిపారు. 

ఎంత తమన్ సంగీతమైనా పాటలు కూడా అంతంతమాత్రంగా ఉండి పాత పద్ధతిలోనే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మామూలే. 

వరుణ్ తేజ్ కష్టం మాత్రం ప్రస్ఫుటంగా కనిపించింది. ఒక్క సినిమా కోసం అంతలా బాడీని బిల్డ్ చేసిన తన పట్టుదలకి ఎన్ని మార్కులైనా వేయొచ్చు. ఒళ్లంతా కండరాల “గని” లాగ మార్చుకున్నాడు. 

హీరోయిన్ సయీ మంజ్రేకర్ చూడడానికి బాగుంది. హావభావాలు పలుకుతున్నా కానీ దర్శకుడు ఆమె ప్రతిభను బయట పెట్టుకోవడానికి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. 

ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ శెట్టి, నదియా తమతమ పాత్రలకు న్యాయం చేసారు. కానీ నదియా పాత్రని సరిగ్గా మలచలేకపోయారు. ఉపేంద్ర పాత్ర నిడివి కూడా తక్కువే. జగపతిబాబుని ఇలాంటి పర్ఫామెన్సులో చాలాసార్లు చూసేసాం. నరేష్ పాత్ర మాత్రం ఆటలో అరటిపండులాగ ఉంది.

బహుశా అన్ని భాషల నటీనటులైతే ఓటీటీలో పాన్ ఇండియా రీచ్ తీసుకురావొచ్చనేమో కేరళ నుంచి నదియాని, కర్ణాటక నుంచి ఉపేంద్రని, బాలీవుడ్ నుంచి సునీల్ శెట్టిని తీసుకొచ్చారు.  

ఉగాది వెంటనే వచ్చిన ఈ సినిమాకి ఆదాయ, వ్యయాల మధ్య తేడా ఎక్కువగానే ఉండేట్టుంది; రాజపూజ్యం తక్కువ అవమానం ఎక్కువ అయ్యేట్టుంది.

బాటం లైన్: పంచ్ లో బలం లేదు