సినిమా రిలీజ్ అవుతున్నదంటే సక్సెస్ కావాలని శుభాకాంక్షలు చెప్పడం సహజమే. ప్రత్యర్థులు కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పుకోడం స్పోర్టీవ్ స్పిరిట్. ఈ స్పిరిట్ వుంటే ఏ గొడవ వుండదు. కానీ మెగా యంగ్ హీరో వరుణ్‌తేజ్ నటించిన ‘గని’ మూవీ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ ‘మా’ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు ట్వీట్ చేయడంపై నెగెటివ్ కామెంట్స్ రావడం చర్చనీయాంశమైంది.
తన విషెస్‌ను కూడా నెగెటివ్ కోణంలో చూడడంపై మంచు విష్ణు కాసింత అసహనానికి, ఆగ్రహానికి గురయ్యారు. ఇవాళ ‘గని’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా విడుదల సందర్భంగా మంచు విష్ణు చేసిన ట్వీట్ ఏంటో తెలుసుకుందాం. ‘ఆల్ ది బెస్ట్ మై బ్రదర్ వరుణ్ తేజ్. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ విష్ణు విషెస్ చెప్పారు.
‘మా’ ఎన్నికల సందర్భంగా మంచు విష్ణుపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు ప్రత్యర్థిగా ప్రకాశ్‌రాజ్ నిలిచారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌ను మెగా బ్రదర్ నాగబాబు ప్రోత్సహించారు. ఆ ప్యానల్ గెలుపు కోసం కృషి చేశారు. ఈ సందర్భంగా ఇరువైపుల నుంచి మాటల తూటాలు పేలిన సంగతి తెలిసిందే.
నాగబాబు, మంచు విష్ణు మధ్య ‘మా’ ఎన్నికలు గ్యాప్ పెంచాయి. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ బాక్సర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. వరుణ్ సినిమా విజయవంతం కావాలని హృదయపూర్వకంగా మంచు విష్ణు కోరుకోలేదనేది మెగా అభిమానుల ఆరోపణ. గని సినిమా పోవాలని కోరుకున్నావు కదా అని మంచు విష్ణు ట్వీట్‌పై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌పై మంచు విష్ణు అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. తాను మంచి జరిగాలని కోరుకుంటే, నెగెటివ్‌గా చూడడం ఏంటని ప్రశ్నించారు.