వెంట్రుక కూడా పీకలేరు.. తగ్గేదేలే అంటున్న జగన్

బాక్సులు బద్దలవుతాయంటూ ఇప్పటికే తనలో మాస్ యాంగిల్ ను చూపించిన జగన్, ఇప్పుడు మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు. నిన్నటికి నిన్న బాక్సులు బద్దలవుతాయంటూ పంచ్ వేసిన జగన్, ఈరోజు…

బాక్సులు బద్దలవుతాయంటూ ఇప్పటికే తనలో మాస్ యాంగిల్ ను చూపించిన జగన్, ఇప్పుడు మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు. నిన్నటికి నిన్న బాక్సులు బద్దలవుతాయంటూ పంచ్ వేసిన జగన్, ఈరోజు వెంట్రుక కూడా పీకలేరంటూ మాటల తూటాలు పేల్చారు. ప్రతిపక్షాల ఆరోపణలకు సరైన కౌంటర్ ఇచ్చారు. ఇలా వరుసగా రెండో రోజు కూడా జగన్ ఎన్ కౌంటర్ కొనసాగింది.

“సంక్షేమ పథకాలు చక్కగా అమలవుతుంటే ఎల్లో మీడియాకు, చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి ఇవేం కనిపించడం లేదు. పైగా రోజుకో కట్టుకథ, రోజుకొక వక్రీకరణ చేస్తున్నారు. ఇక్కడ సరిపోదని, ఈ అల్లరి, వక్రీకరణ, అబద్ధాల్ని పార్లమెంట్ కు కూడా తీసుకెళ్లారు. ఏ రాష్ట్రంలో ప్రతిపక్షమైనా మరో ప్రాంతానికి వెళ్లినప్పుడు తమ రాష్ట్ర ప్రతిష్టను పెంచాలనుకుంటారు. కానీ ఏపీలో మాత్రం మనకు దౌర్భాగ్య ప్రతిపక్షం, ఓ దౌర్భాగ్య ఎల్లో మీడియా, ఓ దౌర్భాగ్య దత్తపుత్రుడు ఉన్నారు. ఇది మన రాష్ట్రం చేస్తున్న ఖర్మ. ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు వీళ్లెవరూ నన్ను కదిలించలేరు. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలు ఉన్నంతవరకు వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు.”

నంద్యాల జిల్లాలో జగనన్న వసతి దీవెన రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన జగన్.. మరోసారి ఎల్లో మీడియా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై తన మార్కు పంచులతో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా అసూయ తగ్గించుకోకపోతే బీపీ వస్తుందని హెచ్చరించారు.

“ఎల్లో మీడియా, చంద్రబాబు, చంద్రబాబు దత్తపుత్రుడు కడుపు మంటకు మందు లేదు. ఈ అసూయ, కడుపుమంట ఎక్కువైతే కచ్చితంగా వీళ్లందరికీ బీపీ వస్తుంది. కచ్చితంగా ఏదో ఒక రోజు గుండెపోటు వచ్చి టికెట్ తీసుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా అసూయ తగ్గించుకోకపోతే, వాళ్ల ఆరోగ్యానికి చేటు అని ఈ సందర్భంగా వాళ్లందరికీ సలహా ఇస్తున్నాను.”

ఈ సందర్భంగా ఇంగ్లిష్ మీడియంపై మరోసారి స్పందించిన ముఖ్యమంత్రి.. బైలింగ్వల్ బుక్స్ ద్వారా క్రమక్రమంగా పిల్లల్ని ఇంగ్లిష్ మీడియం వైపు తీసుకొస్తున్నామని ప్రకటించారు. పిల్లలు బాగా చదువుకోవాలని, ఎన్ని కష్టాలు ఎదురైనా, అడ్డంకులు వచ్చినా సంక్షేమ పథకాలు ఆపనని ఈ సందర్భంగా స్పష్టంచేశారు జగన్.