తెలంగాణ గవర్నర్‌తో కేసీఆర్ విభేదాలనే తేనెతుట్టె కదిలింది. గవర్నర్‌తో కేసీఆర్ విభేదాలకు గల కారణాలు, తెలంగాణ ముఖ్యనేతలు ఉగాది వేడుకలకు హాజరు కాకపోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరిన్ని ఆసక్తికర కథనాలు చెప్పు కొచ్చారు. అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించే నేర్పరితనం రేవంత్‌రెడ్డి సొంతం. ఈ నేపథ్యంలో గాంధీభవన్ సాక్షిగా రేవంత్‌రెడ్డి చెప్పిన అంశాల్లో నిజానిజాలేంటో నిగ్గుతేలాల్సి వుంది. ఇంతకూ ఆయన ఏమన్నారంటే…
కుటుంబ సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ గవర్నర్ అంశాన్ని సాకుగా చూపుతున్నారన్నారు. తనను సీఎం చేయాలని కేసీఆర్‌పై తనయుడైన కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారన్నారు. అయితే గవర్నర్‌తో సఖ్యత లేని కారణంగా అది సాధ్యం కావడం లేదని కుటుంబ సభ్యులతో కేసీఆర్ చెబుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో సమస్యల్ని గవర్నర్ గుర్తించారన్నారు.
తెలంగాణలో డ్రగ్స్, పబ్‌ల విచ్చలవిడితనంపై కేంద్రానికి గవర్నర్ ఫిర్యాదు చేశారని రేవంత్‌రెడ్డి తెలిపారు. సెక్షన్ 8 ప్రకారం సమస్యను పరిష్కరించే అధికారం గవర్నర్ తమిళిసైకి ఉందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏ రాష్ట్ర గవర్నర్‌కు లేని ప్రత్యేక అధికారాలు తెలంగాణ గవర్నర్‌కు ఉన్నాయన్నారు.
తమిళిసై భారతీయ జనతాపార్టీ నాయకురాలిలా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని, మరి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు పలికినప్పుడు గుర్తు రాలేదా? అని రేవంత్‌రెడ్డి లాజిక్ తీయడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.
కేసీఆర్‌కు కోపం వస్తుందనే ఉద్దేశంతోనే రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరు కాలేదని రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై కేంద్ర పెద్దలకు గవర్నర్ ఫిర్యాదు చేసి వుంటే, వాళ్ల మధ్య కుమ్మక్కు రాజకీయాలు బయట పడేవన్నారు.
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాల అంశం ప్రతిపక్షాలకు ఆయుధం దొరికినట్టైంది. ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా గవర్నర్ ఇష్యూను మలుచుకుంటున్నాయి.