సమీక్ష: గువ్వ గోరింక
రేటింగ్: 2/5
బ్యానర్: అకర్ మూవీస్
తారాగణం: సత్యదేవ్ కంచరానా, ప్రియ లాల్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
కూర్పు: ప్రణవ్ మిస్త్రీ
ఛాయాగ్రహణం: మైల్స్ రంగస్వామి
నిర్మాతలు: దాము రెడ్డి కొసనం, ‘దళం’ జీవన్ రెడ్డి
రచన, దర్శకత్వం: మోహన్ బమ్మిడి
విడుదల తేదీ: డిసెంబరు 17, 2020
వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
సినిమా థియేటర్లు మళ్లీ నడుస్తున్నా కానీ చిన్న సినిమాలకు ఇకపై ప్రత్యామ్నాయ వేదిక ఓటిటి అనే దానిపై ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. లాక్‍డౌన్‍లో విడుదలైన తెలుగు సినిమాలలో సత్యదేవ్ హీరోగా నటించినవే ఎక్కువ. తాజాగా అతను నటించిన మరో చిత్రం ‘గువ్వ గోరింక’ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది.
ఒకే గూట్లోని గువ్వ గోరింకకు ఇష్టాలు వేరయినా మనసులు ఎలా కలిసాయి, వాటి మధ్య గోడ ఎప్పటికి తొలగి వారిద్దరూ ఒక్కటయ్యారనేది ఈ చిత్ర కథాంశం. దర్శకుడు మోహన్ బమ్మిడి తొంభైలలో వచ్చిన ‘ప్రేమలేఖ’ లాంటి సినిమా కథ స్ఫూర్తిగా ఈ కథ రాసుకున్నట్టున్నాడు.
అందులో మాదిరిగానే ఇక్కడ కూడా హీరో హీరోయిన్లు ఒకర్నొకరు చూసుకోకుండానే ప్రేమలో పడతారు. అయితే కనీసం అపరిచితులగా కూడా ఒకరికి ఒకరు ఎదురు పడకుండా కథనం రాసుకోవడం వల్ల ఈ గువ్వ గోరింకకు రెక్కలు విరిచి ఒక గోడకి అటు, ఇటు పడేసినట్టయింది.
దాంతో కథ ముందుకు సాగక, హీరో హీరోయిన్ల నడుమ గోడ చాటు సంభాషణలు కా•• మరో సన్నివేశం పెట్టే వీలులేక, కామెడీ ఫిల్లింగ్స్ తో కాలక్షేపం చేయాల్సి వచ్చింది. సబ్‍ప్లాట్స్ గా లివ్-ఇన్ రిలేషన్‍లో వున్న మరో జంట మధ్య వచ్చే అభిప్రాయబేధాలు, ప్రేమంటే శారీరిక సుఖమే అనుకునే వ్యక్తి తన వైఖరి మార్చుకోవడం వగైరా పెట్టుకుని కథను ముందుకి నడిపించడానికి ప్రయాస పడాల్సి వచ్చింది. హీరోకు సౌండ్ అంటే పడదని, హీరోయిన్‍కి మ్యూజిక్ అంటే ఇష్టమని వారి అభీష్టాలు వేరంటూ కాన్‍ఫ్లిక్ట్ పెట్టుకున్నా కానీ అదేమీ ఈ కథకు ఆసక్తిని జోడించే అంశం అవలేకపోయింది.
పాత కాలం ప్రేమకథ అనిపించకుండా హీరో స్నేహితుడిని ప్లేబాయ్‍గా, హీరోయిన్ ఫ్రెండ్‍కేమో లివ్-ఆన్ రిలేషన్‍షిప్‍లో వున్నట్టుగా చూపించి కాంటెంపరరీ అనిపించడానికి చేసిన కృషి ఫలించలేదు. ఆ సబ్‍ప్లాట్స్ రెండూ కూడా ఆసక్తిని కలిగించే సన్నివేశాల్లేక, కనీసం వినోదానికి కూడా కలిసి రాక బోర్ కొట్టిస్తాయి.
సంగీతానికి కథలో భాగం వుంది కనుక బ్యాక్‍గ్రౌండ్ స్కోర్‍తో అక్కడక్కడా పొయెటిక్ టచ్ వచ్చినా కానీ ప్రిడిక్టబుల్ ఎండింగ్ కావడంతో ఏ దశలోను ఆసక్తి రేకెత్తించలేదు. కనీసం చివర్లో అయినా ఏదైనా ఊహించని పరిణామం కథలోకి చొప్పించడం కానీ, అర్జన్సీ క్రియేట్ చేయడానికి చేసిన ప్రయత్నం కానీ లేకపోవడం ‘గువ్వ గోరింక’ బ్రేక్ తీసుకోకుండా ఎట్ ఏ స్ట్రెచ్ చూడ్డానికి ఇబ్బంది పెట్టారు.
హీరోయిన్ తాలూకు సంగీతాభిరుచికి కారణం అర్థమవుతుంది కానీ హీరో తాలూకు సౌండ్ అలర్జీకి కారణం సిల్లీగా అనిపిస్తుంది. ఫిల్లర్స్గా పెట్టుకున్న కామెడీ సీన్లు పేలవంగా వుండడంతో అమెజాన్ ప్రైమ్ సాఫ్ట్వేర్‍లోని టెన్ సెకండ్స్ ఫార్వర్డ్ ఆప్షన్ మీదకు పదే పదే దృష్టి పోతుంటుంది. సినిమాలో సింహభాగం రెండే లొకేషన్స్ కి పరిమితం చేయడం వల్ల బడ్జెట్‍లో తీయడానికి దోహద పడివుంటుంది కానీ దాని వల్ల సీన్ల పరంగా కాస్తయినా వైవిధ్యం చూపించే వీల్లేకపోయింది.
సత్యదేవ్ ఎప్పటిలానే ఈజీగా పర్‍ఫార్మ్ చేసాడు. మంచి నటుడయినా కానీ తనను ఛాలెంజ్ చేసే పాత్రలను కానీ, నటుడిగా తనను ముందుకు తీసుకెళ్లగలిగే కథలను కానీ అతను ఎంచుకోలేకపోతున్నాడు.
ఈ చిత్రంలో అతడి పాత్రతో తెలంగాణ మాండలికంలో మాట్లాడించారు కానీ అది తెచ్చి పెట్టుకున్నట్టే వుంది తప్ప అథెంటిక్ అనిపించదు. ప్రియ పాల్ అన్ని విధాలుగా బిలో యావరేజ్ అనిపిస్తుంది. ప్రియదర్శి ఎంత ప్రయత్నించినా కామెడీ పండించలేకపోయాడు. అలాగే రాహుల్ రామకృష్ణ కూడా ఈ చిత్రంలో వేస్ట్ అయ్యాడు.
నేపథ్య సంగీతం మినహా సాంకేతిక విభాగాల పరంగా గుర్తించదగ్గ అవుట్‍పుట్ ఎవరినుంచీ లేదు. దర్శకుడు మోహన్ బమ్మిడి ఎమోషనల్‍గా టచ్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా కానీ మూస కథ, కథనాలు, నాసిరకం సన్నివేశాలు ఈ ప్రేమకథకు ఎక్కడా కనక్ట్ కానివ్వలేదు. ఓటిటి ద్వారా వచ్చిన అనేక నిరాశాజనక చిత్రాల సరసన ఈ గువ్వ గోరింక కూడా చేరిపోతుంది.
థియేటర్‍కు వెళ్లినపుడు అక్కడ ప్రదర్శించేది ఒకే ఒక్క సినిమా కనుక ప్రేక్షకులు పక్క చూపులు చూసే వీలుండదు… వాకౌట్ చేయడం తప్ప. రిమోట్ బటన్ నొక్కితే వేల కొద్దీ ఆప్షన్స్ దొరికే ఓటిటిలో అటెన్షన్ పక్కకు పోకుండా చూసుకోవడం తప్పనిసరి. దురదృష్టవశాత్తూ ఆ తరహా సినిమాలు కరవైపోయాయి. బహుశా ఈ ట్రెండుకి, ఈ ఆడియన్స్ అభిరుచికి తగ్గ సినిమాలు లాక్‍డౌన్ తర్వాత సెట్స్ మీదకు వెళ్లుంటాయి కనుక అప్పుడే ఈ ప్లాట్‍ఫామ్‍పై ఆశలు వదిలేసుకోనక్కర్లేదు.
బాటమ్ లైన్: గువ్వ గోరింక… మనతో ఆటాడుకుంటాయిలే!