cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

Happy Birthday Review: మూవీ రివ్యూ: హ్యాపీ బర్త్ డే

Happy Birthday Review: మూవీ రివ్యూ: హ్యాపీ బర్త్ డే

చిత్రం: హ్యాపీ బర్త్ డే
రేటింగ్: 1.5/5
బ్యానర్: క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్
తారాగణం: లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, వైవా హర్ష, గుండు సుదర్శన్ తదితరులు
సంగీతం: కాళభైరవ
కెమెరా: సురేష్ శరంగం
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్
నిర్మాత: చెర్రీ, హేమలత
దర్శకత్వం: రితేష్ రాణా
విడుదల తేదీ: జూలై 8, 2022

ఒక్కోసారి చిన్న సినిమా మీద పెద్ద బ్యానర్ స్టాంపేస్తే అది పెద్ద సినిమాలాగానే కనపడుతుంది. దానికి తోడు అంచనాలు కూడా పెరుగుతాయి. ఈ సినిమా మీద మైత్రీ మూవీస్ స్టాంప్ పడడం, పైగా రాజమౌళి ఈ సినిమా ట్రైలర్ ని పొగడడంతో అంచనాలు పైకి లేచాయి.

ఇంతకీ ఇందులో విషయమెంతుంతో చూద్దాం.

కథగా చెప్పడానికి కూడా వీలు కాని ఒకానొక అధివాస్తవిక కథనమిది. ఒక మంత్రి పార్లమెంటులో తుపాకి చట్టాన్ని ప్రవేశపెట్టడంతో కథ మొదలవుతుంది. ఇది చూసి ఏదో ఔటాఫ్ ది బాక్స్ కథ చూడబోతున్నామనిపిస్తుంది. కానీ కాసేపట్లోనే లింకు లేని సన్నివేశాలతో, ఏ పాత్రతో ప్రయాణించాలో తెలియని సందిగ్ధావస్థలోకి నెట్టేసి ఇక మళ్లీ తేరుకోకుండా చేస్తుందీ చిత్రం.

అసలీ కథని దర్శకుడు ఎలా చెప్పి నిర్మాతని ఒప్పించాడో, ఎలా పెద్ద బ్యానర్ ని దీనికి తగిలించగలిగాడో తెలుసుకుంటే అదొక మంచి సేల్స్ మెన్ పాఠమవుతుందేమో. 

అక్కడక్కడ ఫస్టాఫులో ఒకటి రెండు కామెడీ సన్నివేశాలైతే ఉన్నాయి. మండుటెండలో చెప్పుల్లేకుండా నడుస్తున్నప్పుడు నిలబడడనికి కాస్త నీడ కనిపిస్తే ఒక్క క్షణం రిలీఫుంటుంది తప్ప చిరాకైతే పోదు. ఈ కామెడీ సీన్స్ కూడా అంతే. అనుభవిస్తున్న టార్చర్ ని దూరం చేయలేవు గానీ కాస్త నవ్వించి మనమింకా బతికే ఉన్నామని గుర్తుచేస్తాయంతే. 

ఇక సెకండాఫుకొచ్చే సరికి గ్రౌండ్ సిగ్నల్ తెగిపోయిన ప్లేనుని ఎలా నడపాలో ఎక్కడ దింపాలో తెలియని పరిస్థితైపోయింది డైరెక్టర్ కి. ఆ తెలియని తనాన్నే అధివాస్తవికత అని సరిపెట్టుకోవాలి. 

"మత్తు వదలరా" అనే సినిమా తీసిన ఇదే దర్శకుడు తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎంతవరకూ ప్రేక్షకుల్ని హుక్ చేయగలుగుతున్నాడనేది తెలుసుకోవాలి. ఆడియన్స్ కి ఎప్పుడూ మెదడుకి పని చెప్పే పరీక్షపెట్టకూడదు. దర్శకుడి అతి తెలివిని ప్రేక్షకులు అస్సలు భరించలేరు. కథనంతో ప్రేక్షకుల్ని అన్నీ మరిచిపోయేలా చేయగలగాలి. అంతే గానీ ఇంటర్వెల్ ఎప్పుడౌతుందా, శుభం కార్డు పడడానికి ఇంకా ఎంత టైముంది అని లెక్కలేసుకునేలా ఉండకూడదు.

ఈ సినిమాకి ఆరేడు అధ్యాయాలుగా చూపించాడు దర్శకుడు. అర్థం కాని సబ్జెక్ట్ ని అంతే అర్థం కాని విధంగా తన మానాన తాను చెప్పుకుంటూ పోయే మ్యాస్టారి క్లాసులో కూర్చున్నట్టుంటుంది సగటు ప్రేక్షకుడి పరిస్థితి.

లాజిక్ లేని ఫార్స్ కామెడీ అయినా జాతిరత్నాలు, డీజే టిల్లు జనం పల్స్ ని పట్టుకోగలిగాయి. కానీ ఈ హ్యాపీ బర్త్ డే ఆ మ్యాజిక్ చెయ్యలేకపోయింది. ప్రేక్షకుల్ని మరీ ఇంతిలా తక్కువ అంచనా వేసినందుకు మేకర్స్ మీద కోపం కూడా వస్తుంది.

ప్రొడక్షన్ వేల్యూస్, సాంకేతిక అంశాలు బాగానే ఉన్నా ఫలితం దక్కలేదు.

డబుల్ రోల్ లో లావణ్య తన ప్రతిభ కనబరిచింది. వెన్నెల కిషోర్ సత్య ల కామెడీ కొన్ని చోట్ల వర్కౌటయ్యింది. వైవా హర్ష ఎందుకున్నాడో అర్థం కాదు. రాహుల్ రామకృష్ణ పాత్ర ఎండింగ్ సరిగా లేదు. 

ఎలా చూసుకున్నా ఇది హ్యాపీ కానే కాదు. పైగా బాధించే సినిమా. సినిమా అంటే ఎలా పడితే అలా తీయొచ్చు అనే పొగరుతో తీసినట్టుంది తప్ప హోం వర్క్  చేసినట్టే లేదు. 

బాటం లైన్: అన్ హ్యాపీ డే

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి