సమీక్ష: జోహార్
రేటింగ్: 2/5
బ్యానర్: ధర్మసూర్య పిక్చర్స్
తారాగణం: అంకిత్ కొయ్య, ఎస్తేర్ అనిల్, శుభలేఖ సుధాకర్, చైతన్య కృష్ణ, నైనా గంగూలి, ఈశ్వరి రావు తదితరులు
రచన: రామ్ వంశీకృష్ణ
సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యన్
కూర్పు: సిద్ధార్థ్ తాతోలు, అన్వర్ అలీ
ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి
రచన: నిఖిల్ మెహోత్రా, శరణ్ శర్మ
నిర్మాతలు: సందీప్ మార్ని, రత్నాజీరావు మార్ని
కథ, కథనం, దర్శకత్వం: తేజ మార్ని
విడుదల తేదీ: ఆగస్ట్ 14, 2020
వేదిక: ఆహా
‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ (ఐక్యతా ప్రతిమ) పేరిట నిలబెట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం స్ఫూర్తితో ‘జోహార్’ కథ రాసుకున్నట్టున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ప్రతిష్టించడానికి సంకల్పించినపుడు ప్రజాధనం వృధా అవుతుందని, ఆ డబ్బుని పేదల కోసం, విద్యార్థుల కోసం ఖర్చు చేస్తే ఉపయోగ పడుతుందని వాఖ్యానించిన వారున్నారు. దర్శకుడు తేజ మార్ని ఆ కోణాన్ని ‘జోహార్’ కథకు స్ఫూర్తిగా పెట్టుకుని… దేశానికి సంబంధించిన అంశాన్ని రాష్ట్రానికి మరల్చి… ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన తండ్రిని జనం కలకాలం దేవుడిగా కొలిచేందుకు భారీ విగ్రహం నెలకొల్పాలని తలపెడితే… అందువల్ల పలు వర్గాలకు చెందిన పేద జనం ఎలా ఇబ్బందులు పడి, జీవితాలు కోల్పోయారనేది చూపించాడు.
వేదం, చందమామ కథలు తరహాలో కథాసంకలనం పద్ధతిలో వేరు వేరు పాత్రలు ఒకే సంఘటన కారణంగా ఎలా ప్రభావితమయ్యాయనేది ‘జోహార్’లో చూపించాడు యువ దర్శకుడు. పాత్రలుగా పరిచయం అయినపుడు ఆసక్తికరంగా అనిపించేవి, ఆ ‘పరిచయం’ దాటి ముందుకి వెళ్లలేకపోతాయి. ఆ పాత్రలతో ప్రయాణం చేయాలని కానీ, లేదా వారి ప్రస్థానం ఎక్కడికో తెలుసుకోవాలనే ఇచ్ఛ కానీ కలిగించలేకపోతాయి.
ఉద్ధానం కాలేయ సమస్య వల్ల భర్తను పోగొట్టుకున్న మంగ (ఈశ్వరిరావు) తన కూతురికి కూడా అదే జబ్బు చేయడంతో వైద్యం చేయించడానికి డబ్బులు సంపాదించడం కోసం పొలం కౌలుకు తీసుకుంటుంది.
వారణాసిలో ఒక టీ కొట్టులో పనిచేసే కుర్రాడు (అంకిత్), వేశ్యావాటికలో జీవిస్తున్న అమ్మాయిని (ఎస్తేర్) ప్రేమిస్తాడు. ఆమె తల్లి తనను కూడా అదే వృత్తిలో దించేందుకు చూస్తోంటే… ఆమె ఇంట్లోంచి పారిపోయి ఈ కుర్రాడితో మరో ఊరు చేరుకుంటుంది. స్కాలర్‍షిప్ సాధించి పై చదువుల కోసం ఆశ పడుతుంది.
స్వాతంత్య్ర సమరయోధుడు (శుభలేఖ సుధాకర్) విలువలకు లోబడి ఆశ్రమం నడుపుతూ… అది శిధిలావస్థలో వుండడంతో నిధుల కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటాడు. రోడ్డు మీద సర్కస్ ఫీట్లు చేసి జీవనం సాగించే యువతి (నైనా గంగూలి) అథ్లెట్ కావాలనుకుంటుంది. ఆమెకి అకాడమీలో స్థానం దక్కుతుంది కానీ అవసరమయిన పోషకాహరం లభించక ఆశయం సాధించలేకపోతుంది.
తండ్రి మరణం తర్వాత ముఖ్యమంత్రి అయిన కొడుకు (చైతన్య కృష్ణ) తన తండ్రిని జనం ఎప్పటికీ దేవుడిగా గుర్తుంచుకోవాలని ఒక భారీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని భావిస్తాడు. అయితే అందుకోసం నిధులు లేక రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ నుంచి తలా కొంత తీసి విగ్రహ ప్రతిష్టాపన చేయిస్తాడు. అతని కోరిక వల్ల పైన చెప్పుకున్న వారి జీవితాలు ఎలా ఛిద్రమవుతాయి… ఆ విగ్రహం నిలబెట్టడం కోసం అలాంటి ఎందరి బ్రతుకులు నేలరాలాయి అన్నది ‘జోహార్’ కథాంశం.
ఈ చిత్రం ఉద్దేశం గొప్పదే కానీ అది విగ్రహం చుట్టూ కాకుండా మరో లాజికల్ ఇష్యూ కారణంగా ప్రభుత్వాలు తలపెట్టే కొన్ని పథకాలు, చేసే ఓటు బ్యాంకు రాజకీయాలు పేద ప్రజలను ఎలా చిదిమేస్తున్నాయనేది చెప్పి ఉండాల్సింది. అలా మాన్యుమెంట్‍లా మిగిలిపోయే విగ్రహాలు లేదా స్థూపాల వల్ల టూరిజం సంబంధిత ఆదాయం పెరుగుతుందే తప్ప ప్రగతికి వచ్చే అటంకం ఏముండదు. ప్రభుత్వం ఏది చేసినా ‘ఇది అవసరమా? వేరే ఏదైనా చేసి ఉండొచ్చుగా’ అనేది ఎప్పుడూ డిబేటబుల్ అవుతుంది. ఎందుకంటే ప్రతిదానికీ ఫర్‍గా, యాంటీగా ఎప్పుడూ రెండు వర్గాలుంటాయి కాబట్టి. సరే… ఈ విగ్రహ ప్రతిష్టాపన నిజంగానే ఈ చిత్రంలో చూపించినంతగా పేద ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుందనేది అంగీకరించినా కానీ… సదరు పాత్రల తాలూకు గమనం, వారికి ఎదురయ్యే పరిస్థితులు మాత్రం ఎఫెక్టివ్‍గా చూపించలేకపోయారు.
నాలుగు కథలు సమాంతరంగా నడుస్తున్నా ఏ కథా ముందుకు సాగుతున్నట్టు అనిపించదు. ఎవరి ప్రయాణం ఆసక్తి కలిగించదు. ఇలాంటి ‘ఆంథాలజీ ఫిలిం’లో (సంకలనం) ఎప్పుడయినా ఒక కథను వీడి మరో కథలోకి వెళుతున్నపుడు అక్కడేమవుతుందో తెలుసుకోవాలనే ఆరాటం కలిగించాలి. ‘జోహార్’లో ఏ పాత్ర తెర మీదకు వస్తే ఆ సన్నివేశం చూస్తుంటామే తప్ప ‘అయ్యో అక్కడ వాళ్లేమయ్యారో’ అనే భావన ఎక్కడా కలగదు. ఈ పాత్రలకు టిపికల్ ట్రాజిక్ ఎండ్ వుంటుందనేది కూడా ఆదినుంచీ అర్థమవుతూనే వుంటుంది. అయితే ఆ ముగింపు వైపు వాళ్లు సాగుతున్న కొద్దీ ఆసక్తి లేదా ఆందోళన కలగవు. ఇంకా చెప్పాలంటే పలు ఎండింగ్స్ ఫోర్స్డ్‍గా, కన్వీనియంట్‍గా అనిపిస్తాయి. కూతురు బాధలో విలవిలలాడుతుంటే తల్లి డబ్బు సాయం కోసం తెలిసిన వారందరి చుట్టూ పరిగెడుతున్నా ఆ సన్నివేశం చివుక్కుమనిపించదు. అనాధాశ్రమం నడవడం కోసం పెద్దాయన ఒక విపరీత నిర్ణయం తీసుకున్నా అయ్యో అనిపించదు. అలానే ఆ ప్రేమ జంట, సర్కస్ పిల్ల కథల ముగింపు సన్నివేశాలు కూడా ‘ఓకే ఇలా ముగించారన్నమాట’ అన్నట్టుంటాయే తప్ప కంటతడి పెట్టించవు. సన్నివేశ బలం లేకపోవడం ఒక కారణమయితే, ఆ పాత్రలతో కనక్ట్ ఏర్పరచలేక పోవడం మరో కారణం.
ఈ ఎమోషనల్ కోర్ వర్కవుట్ అయితే ఆ విగ్రహం బ్యాక్‍డ్రాప్‍ని, సదరు లాజిస్టిక్స్ ని పెద్దగా ఖాతరు చేయాల్సిన పని లేదు. కానీ ఇవి ఏమాత్రం ఎఫెక్టివ్‍గా అనిపించకపోవడంతో అసలు నేపథ్యం మరింత డొల్లగా అనిపిస్తుంది. నటన పరంగా ఈశ్వరీ రావు, శుభలేఖ సుధాకర్, చైతన్యకృష్ణ మెప్పించగా, విజువల్‍గా ఈ చిత్రాన్ని ఇంప్రెసివ్‍గా తెరకెక్కించాడు దర్శకుడు. లో బడ్జెట్ సినిమా అయినా కానీ క్వాలిటీ పరంగా రాజీ పడిన ఫీల్ ఎక్కడా రాలేదు. ఛాయాగ్రహణం బాగుంది. అన్ని కథల మధ్య గందరగోళం లేకుండా ఎడిటింగ్ చక్కగా కుదిరింది. కానీ పాటలే సినిమా జోన్రాకి తగ్గట్టు లేవు. ఒక్కోసారి మూడ్ స్పాయిలర్స్ లా కూడా మారాయి. నేపథ్య సంగీతం ఎమోషనల్ సీన్స్ ని ఎలివేట్ చేయలేకపోయింది. కొన్ని సంభాషణలు బాగున్నాయి.
మొత్తమ్మీద ఈ చిత్రం ఒక న్యూస్ పేపర్ చదివిన భావన కలిగిస్తుంది. మెయిన్ పేజ్‍లో ముఖ్యమంత్రి ఆశయం వుంటే… మధ్య పేజీల్లో దాని ప్రభావం వల్ల చితికిపోయిన బ్రతుకుల గురించి చదివినట్టుంటుంది తప్ప ఏదీ గుర్తుండిపోయేలా ముద్ర పడదు. ఇలా ఎందుకు జరుగుతోంది అని గొంతెత్తి ప్రశ్నించకపోయినా, కనీసం ఓ క్షణమయినా ఆలోచనలో పడేట్టు చేయదు. ఓవరాల్‍గా ‘జోహార్’ ఒక సిన్సియర్ అటెంప్ట్ అనేట్టుంది కానీ అంతకంటే స్కోర్ చేయలేదు.
బాటమ్ లైన్: ప్రయత్నం మంచిదే… కానీ ప్రయాణమే ప్చ్!
గణేష్ రావూరి