తనకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా ప్రకటించారు లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం. పాజిటివ్ వచ్చిన వెంటనే ఆయన హాస్పిటల్ లో చేరారు. అలా కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశాయి.
ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు వైద్యులు. ఆయన శరీరానికి తగినంత ఆక్సిజన్ అందుతోందని, ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని స్పష్టంచేశారు. ఇదే ఆరోగ్య స్థితి మరికొన్ని రోజులు కొనసాగితే.. త్వరలోనే ఆయన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. చెన్నైలోని చూళైమేడు ప్రాంతంలో ఉన్న ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు బాలసుబ్రమణ్యం
మరోవైపు కోలీవుడ్ కు చెందిన మరో హీరోయిన్ కరోనా బారిన పడింది. నటి నిక్కీ గల్రానీకి కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు గత వారమే కరోనా సోకిందని, ప్రస్తుతం ఆ వైరస్ నుంచి తను త్వరగా కోలుకుంటున్నానని స్పష్టంచేసింది నిక్కీ.
ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో పాటు యంగేజ్ లో ఉన్న కారణంగా కరోనా నుంచి త్వరగా కోలుకుంటాననే నమ్మకం తనకు ఉందని.. కానీ తన తల్లిదండ్రులు, పెద్దలు గురించి ఆలోచించినప్పుడు మాత్రం భయం వేస్తోందని అంటోంది నిక్కీ. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ పెట్టుకోవాలని కోరుతోంది.