అత్యధిక రోజుల పాటు భారతదేశానికి ప్రధాని హోదాలో కొనసాగిన నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ గా రికార్డు స్థాపించారు నరేంద్రమోడీ. ఇప్పటి వరకూ ఈ రికార్డు బీజేపీకే చెందిన అటల్ బిహారీ వాజ్ పేయి పేరు మీద ఉండేది. ఆ రికార్డును ఇప్పుడు మోడీ సొంతం చేసుకున్నారు. వరసగా 13 నెలల పాటు ఒక టర్మ్ ఆ తర్వాత ఒక నాలుగున్నరేళ్ల టర్మ్ తో వాజ్ పేయి అత్యధిక కాలం పీఎంగా కొనసాగిన నాన్ కాంగ్రెస్ నేతగా నిలిచారు.
అప్పట్లో వాజ్ పేయికి ఇంకా నాలుగైదు నెలల కాలం పదవీయోగం ఉండేదేమో. అయితే చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలు అంటూ బీజేపీని కూడా తీసుకెళ్లి వాళ్లనూ ముంచేశారు! తనపై అలిపిరిలో జరిగిన దాడితో సానుభూతి పొందడానికి చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. తను వెళ్లడమే కాకుండా.. బీజేపీ వాళ్లనూ జాతీయ స్థాయిలో ఎన్నికలకు తీసుకెళ్లి వారి చేతి నుంచి అధికారం ఊడగొట్టిన ఘన చరిత్ర చంద్రబాబుదే.
ఇలాంటి చరిత్ర చంద్రబాబు సొంతం. అయితే ఆయన చెప్పుకోరు, అనుకూల మీడియా, కుల విశ్లేషకులు వాటిని దాచేస్తూ ఉంటారు. ఆయనను ఒక చాణుక్యుడిగా, రాజకీయ మేధావిగా మాత్రమే చూపడం వారి పని.
ఆ సంగతలా ఉంటే.. ఆ మధ్య నెహ్రూ తర్వాత వరసగా రెండు టర్మ్ ల ప్రధాని పదవిలో పూర్తిగా కొనసాగిన రికార్డును సొంతం చేసుకున్నారు మన్మోహన్ సింగ్. బహుశా మోడీకి కూడా ఆ యోగం ఉంది. ఈయన గనుక ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోతే.. నెహ్రూ, మన్మోహన్ ల తర్వాత వరసగా రెండు టర్మ్ ల పదవీ కాలాన్ని పూర్తిగా పొందిన నేతగా నిలుస్తారు. ఒకవేళ మోడీ ముందస్తు ఎన్నికలకు వెళితే మాత్రం ఆ రికార్డు అందదు. ఒకవేళ మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి, మరోసారి ఎన్నికైతే అది వేరే రికార్డు కిందకు రావొచ్చు. ఇటీవలే ఇండియాటుడే తన సర్వేలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే బీజేపీకి 283 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.