బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై విచారణకు రంగంలోకి దిగిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్ల రూపాయల వరకూ మాయం అయినట్టుగా ఆయన కుటుంబీకులు ఆరోపించి, పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంలోకి ఈడీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. సుశాంత్ సన్నిహితులను పిలిచి ఈడీ విచారణ ప్రారంభించింది.
సుశాంత్ అకౌంట్ నుంచి నటి రియా చక్రబర్తి, ఆమె కుటుంబీకులు భారీగా డబ్బును బదిలీ చేసుకున్నారని సుశాంత్ కుటుంబీకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రియాను ఆమె కుటుంబీకులను పిలిచి ఈడీ విచారణ చేపట్టింది. ఈ విచారణకు సంబంధించి ఈడీ ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తూ.. సుశాంత్ అకౌంట్ నుంచి రియా అకౌంట్ కు కానీ, ఆమె కుటుంబీకుల అకౌంట్లకు కానీ ఎలాంటి డబ్బూ బదిలీ కాలేదని పేర్కొనట్టుగా తెలుస్తోంది.
ఇదీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ప్రాథమిక సమాచార పత్రం. సుశాంత్ అకౌంట్ నుంచి రియా అకౌంట్ కు భారీగా డబ్బులు బదిలీ అయ్యిందని ఆ నటుడి కుటుంబీకులు ఆరోపించడంతో ఈ కేసు సంచలన మలుపు తీసుకుంది. అప్పటి వరకూ సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ గా ఈ కేసులో రియా పేరు నానుతూ వచ్చింది. అలాంటిది ఆమె అతడి డబ్బును వాడుకుందనే ఆరోపణలు రావడంతో సంచలన మలుపు తిరిగినట్టుగా అయ్యింది.
అదే సమయంలో సుశాంత్ దగ్గర పని చేసిన వాళ్లు కొందరు రియాపై సంచలన కామెంట్స్ చేశారు. ఆమె అతడికి డ్రగ్స్ కూడా ఇచ్చేదంటూ కొందరు వ్యాఖ్యానించారు. రియాకు ఉన్న ఆస్తుల విలువ అంటూ మీడియా కూడా ఈ కేసులను సంచలనంగా అభివర్ణించింది. అయితే ఈడీనేమో సుశాంత్ అకౌంట్ నుంచి రియా, ఆమె కుటుంబీకుల అకౌంట్లకు డబ్బులేవీ ట్రాన్స్ ఫర్ కాలేదంటూ ప్రాథమిక విచారణలో పేర్కొంది! అయితే సుశాంత్ అకౌంట్ నుంచి డబ్బు లావాదేవీల గురించి విచారణ కొనసాగుతుందని ఈడీ పేర్కొంది. మరి అంతిమంగా ఈడీ ఏం తేలుస్తుందో!