Advertisement

Advertisement


Home > Politics - Opinion

నేత‌లంద‌రి ఆస్తులూ పెరిగాయి.. దేశం పురోగ‌మిస్తోంది!

నేత‌లంద‌రి ఆస్తులూ పెరిగాయి.. దేశం పురోగ‌మిస్తోంది!

భార‌త‌దేశం నిజంగానే పురోగ‌మ‌నిస్తూ ఉంది. ఇందుకు ఆధారాలు కావాలా.. దేశంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను గ‌మ‌నిస్తే చాలు, భార‌త‌దేశం ఆర్థికంగా ఎంత పురోగ‌మిస్తోందో అర్థం చేసుకోవ‌చ్చు! విశేషం ఏమిటంటే.. అధికారం, ప్ర‌తిప‌క్షం వంటి హోదాల‌తో నిమిత్తం లేకుండా దేశంలో రాజ‌కీయ నేతంద‌రి ఆస్తులూ పెరిగాయి గ‌త ఐదు సంవ‌త్స‌రాల్లో! ఎన్నిక‌ల వేళ పోటీకి వారు దాఖ‌లు చేస్తున్న ఆస్తుల అఫిడ‌విట్ లే ఇందుకు సాక్ష్యం! 

2019 ఎన్నిక‌ల్లో ఈ నేత‌లు దాఖ‌లు చేసిన ఆస్తుల అఫిడ‌విట్ కూ 2024 ఎన్నిక‌ల సంద‌ర్భంగా వీరు దాఖ‌లు చేస్తున్న ఆస్తుల అఫిడ‌విట్ కు మ‌ధ్య వ్య‌త్యాసం భారీగా ఉంది! ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేసి, నేటి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న ప్ర‌తి ఒక్క ఎంపీ అభ్య‌ర్థి, ప్ర‌తి ఎమ్మెల్యే అభ్య‌ర్థి ఆస్తులూ భారీ స్థాయిలోనే పెరిగాయి! ఈ విష‌యంలో ఏ పార్టీ అభిమానులూ నొచ్చుకోన‌క్క‌ర్లేదు! అంద‌రి ఆస్తులూ పెరిగాయి! ఎవ్వ‌రూ బాధ‌ప‌డ‌న‌క్క‌ర్లేదు, త‌మ అభిమాన పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టం వ‌ల్ల త‌మ వారు సంపాదించుకోలేక‌పోయారేమో అని!   

అధికారంలో ఉన్నా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. నేత‌లంద‌రి ఆస్తులూ స‌మ‌స్థాయిలో పెరిగాయి. అధికారికంగా వారు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కార‌మే.. ప్ర‌తి ఒక్క‌రి గ్రోత్ భారీ స్థాయిలో ఉంది! అధికారంలో లేని వాళ్లు ఐదేళ్లుగా గ‌గ్గోలు పెట్టారు. త‌మ పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌ని, త‌మ ను అన్ని ర‌కాలుగానూ దెబ్బ‌తీయాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూ ఉన్నారంటూ అధికారంలో ఉన్న వారిపై ప్ర‌తిప‌క్షంలో ని వారు గ‌గ్గోలు పెట్టారు. అయితే వారి వ్య‌క్తిగ‌త ఆస్తుల వర‌కూ వ‌స్తే.. ఎలాంటి క్షీణ‌తా లేదు! పైపెచ్చూ భారీగా ఆస్తులు పెరిగాయి కూడా! దేశంలో అనేక మంది లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థులు త‌మ ఆస్తుల‌ను వేల కోట్ల రూపాయ‌ల్లో చూపించారు. 

ప్ర‌ధానంగా న‌గ‌రాలు, న‌గ‌ర స‌మీపాల్లోని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల ఆస్తులు అయితే.. ఆయా శివారు ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెరిగిన‌ట్టుగా పెరిగిపోయాయి! బెంగ‌ళూరు సిటీలో భాగ‌మైన ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న డీకే సురేష్, హైద‌రాబాద్ కు ఒక‌వైపు ఆవ‌రించి ఉన్న చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గంలోని అభ్య‌ర్థుల ఆస్తులు క‌ళ్లు చెదిరే స్థాయిలో న‌మోద‌య్యాయి. వీరిలో కొంద‌రు ఐదేళ్ల నుంచి ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. త‌మ ఆస్తుల్లో మంచి గ్రోత్ నే న‌మోదు చేశారు! ఈ ఎన్నిక‌లు ఇస్తున్న క్లారిటీ ఏమిటంటే.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నంత మాత్రానా రాజ‌కీయ నేత‌ల ఆస్తుల‌కు వ‌చ్చిన లోటేమీ లేదు అని! 

అధికారంలో ఉన్న వారి ఆస్తులూ అధికారికంగా పెరిగాయి, ప్ర‌తిప‌క్షంలో ఉన్న వారి ఆస్తులూ ఏ మాత్రం లోటు లేకుండా అధికారికంగా భారీ స్థాయికే చేరాయి! మ‌రి ప్ర‌తిప‌క్షంలో ఉన్న వారు అధికార ప‌క్షంలో ఉన్న వారిపై దుమ్మెత్తి పోస్తూ.. అస‌లు దేశం నాశ‌నం అయిపోయింద‌ని, రాష్ట్రం నాశ‌నం అయిపోయింద‌ని, సామాన్యులు బ‌తికే ప‌రిస్థితి లేద‌ని, వ్యాపార‌స్తులు వ్యాపారం చేసుకునే ప‌రిస్థితి లేద‌ని, ఎలాంటి అభివృద్ధి లేద‌ని.. దీని వ‌ల్ల ఎలాంటి గ్రోత్ లేకుండా పోయింద‌ని, ఫ‌లితంగా కొత్త‌గా ఉద్యోగాలు క‌ల్పించే ప‌రిస్థితి లేకుండా పోతోంద‌ని, అధికారంలో ఉన్న వారి వ‌ల్ల ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ వ్య‌వ‌స్థ‌లు నిర్వీర్యం అయిపోయాయ‌ని, ఫ‌లితంగా రాష్ట్ర ప్ర‌గ‌తి, దేశ ప్ర‌గ‌తి కుంటుబాటులో సాగుతోంద‌నే ఆవేధ‌న వ్య‌క్తం చేస్తూ ఉన్నారు! అయితే ఎన్నిక‌ల వేళ వారి వ్య‌క్తిగ‌త ఆస్తుల‌ను వెల్ల‌డిస్తూ మాత్రం.. భారీ గ్రోత్ ను న‌మోదు చేశారు! 

మ‌రి దేశం కుంటుబాటున సాగుతూ ఉంటే, రాష్ట్రాలు మంద‌గ‌మ‌నంలో ప‌డిపోతే.. ప్ర‌తిప‌క్షంలోని నేత‌ల ఆస్తులు మాత్రం ఎలా పెరిగాయో వారే చెప్పాల్సి ఉంది! మ‌ళ్లీ మ‌న రాజ‌కీయ నేత‌ల కుటుంబ వ్యాపారాలు ఏమిటంటే.. పాల‌మ్మినాం, పూల‌మ్మినాం.. అంటారు కానీ, ఒక్కోరి ఆస్తులు మాత్రం వంద‌లు, వేల కోట్ల రూపాయ‌ల స్థాయిలో ఉన్నాయి! పార్టీల వారీగా చూస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కూ వివిధ ద‌శ‌ల ఎన్నిక‌ల కోసం నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేసిన ఎంపీ అభ్య‌ర్థుల్లో బీజేపీ త‌ర‌ఫు వారిలో ఏకంగా 90 శాతం మంది కోటీశ్వ‌రులే! కాంగ్రెస్ పార్టీ ఏమీ తీసిపోలేదు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున కూడా దాదాపు ఇదే స్థాయిలో కోటీశ్వ‌రులు ఎంపీ అభ్య‌ర్థులుగా పోటీలో ఉన్నారు. ఎంపీల ఆస్తుల్లో వంద‌ల కోట్లు అనేది పెద్ద విష‌యం కాకుండా పోయింది.

కొంద‌రు ఎంపీ అభ్య‌ర్థులు త‌మ ఆస్తులు నాలుగు వంద‌ల కోట్లు, ఐదొంద‌ల కోట్లు అని ప్ర‌క‌టిస్తే... అంతేనా అని సామాన్య జ‌నం అనుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. చాలామంది త‌మ ఆస్తుల‌ను వేల కోట్ల రూపాయ‌లని చెబుతూ ఉంటే, వంద‌ల కోట్లు చిన్న నంబ‌ర్లుగా అయిపోయాయి. ఇక త‌మ ఆస్తులు ప‌దుల కోట్ల రూపాయ‌లే అని చెబుతున్న వారిని చూసి, అయ్యోపాపం అని సానుభూతి వ్య‌క్తం చేసే ప‌రిస్థితి దేశంలో క‌నిపిస్తూ ఉంది! ఇక దేశంలో య‌థారీతిన ఎన్నిక‌ల ఖ‌ర్చులు కూడా ఈ సారి భారీగా పెరుగుతున్నాయి. 

అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలోనే భారీగా ఎన్నిక‌ల ఖ‌ర్చు ఉంటోంది. లోక్ స‌భ ఎన్నిక‌లు మాత్ర‌మే జ‌రుగుతున్న రాష్ట్రాల్లో ఓటుకు ఇచ్చే నోటు కాస్త చిన్న‌దే అనే మాట వినిపిస్తోంది. అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌లు క‌లిసి జ‌రుగుతున్న ఏపీ వంటి చోట‌.. ప్ర‌ధాన పార్టీల త‌ర‌ఫున బ‌రిలో దిగుతున్న ఒక్కో ఎమ్మెల్యే అభ్య‌ర్థి క‌నీస ఖ‌ర్చు 40 కోట్ల రూపాయ‌ల నుంచి 50 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతూ ఉన్నాయి! ఇలా దేశం త‌న ఆర్థిక శ‌క్తిని చాటుకుంటూ ఉంది!   

-హిమ‌ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?