Advertisement

Advertisement


Home > Movies - Reviews

మహేష్‌ కెరీర్‌ గో సౌత్తేనా?

మహేష్‌ కెరీర్‌ గో సౌత్తేనా?

ఇంగ్లీషులో– గో సౌత్‌ అనే ఒక ఫ్రేజ్‌ ఉంది. పరిస్థితులు మన చేతిలో లేకుండా జారిపోతున్నప్పుడు దీనిని వాడతారు. మహేష్‌ స్పైడర్‌ విడుదలయ్యే ముందు ఒక ఇంగ్లీషు వెబ్‌సైట్‌లో– మహేష్‌ గో(యింగ్‌) సౌత్‌ అని హెడ్డింగ్‌ పెట్టారు. స్పైడర్‌ సినిమా తమిళనాడులో కూడా ఎక్కువ థియేటర్‌లలో విడుదలవుతోందని ఆ శీర్షిక పరమార్థం. కానీ స్పైడర్‌ సినిమా చూసిన తర్వాత– మహేష్‌ కెరీర్‌కు సంబంధించే అలాంటి హెడ్డింగ్‌ పెట్టారా? అనిపిస్తుంది.

ఇంగ్లీషులో– గో సౌత్‌ అనే ఒక ఫ్రేజ్‌ ఉంది. పరిస్థితులు మన చేతిలో లేకుండా జారిపోతున్నప్పుడు దీనిని వాడతారు. మహేష్‌ స్పైడర్‌ విడుదలయ్యే ముందు ఒక ఇంగ్లీషు వెబ్‌సైట్‌లో– మహేష్‌ గో(యింగ్‌) సౌత్‌ అని హెడ్డింగ్‌ పెట్టారు. స్పైడర్‌ సినిమా తమిళనాడులో కూడా ఎక్కువ థియేటర్‌లలో విడుదలవుతోందని ఆ శీర్షిక పరమార్థం. కానీ స్పైడర్‌ సినిమా చూసిన తర్వాత– మహేష్‌ కెరీర్‌కు సంబంధించే అలాంటి హెడ్డింగ్‌ పెట్టారా? అనిపిస్తుంది.

మహేష్‌ కెరీర్‌ గురించి మాట్లాడుకొనేముందు– సినిమా వైపు కూడా ఒక సారి దృష్టి సారిద్దాం. ఇంటిలిజెన్స్‌ బ్యూరోలో పనిచేసే ఒక టెక్నికల్‌ ఆఫీసర్‌ కథ ఇవి. తెలుగు సినిమా సంప్రదాయం ప్రకారం హీరో సకల శుభలక్షణాల శ్రీమంతుడు. షూటింగ్‌లో ఫస్ట్‌.. కోడింగ్‌లో ఫస్ట్‌.. కానీ ఎందుకో స్ట్రాటజీలో మాత్రం వీక్‌ అనిపిస్తుంది. సాధారణంగా విలన్‌ వేసే ఎత్తులకు హీరో చెక్‌ పెట్టాలని నాలాంటి సామాన్య ప్రేక్షకులు ఆశిస్తూ ఉంటారు.

కానీ దీనికి హీరో విరుద్ధం. తన ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో పరిస్థితులను పాడు చేసేసుకుంటుంటాడు. ఉదాహరణకు ఎవరికైనా విలన్‌ తమ్ముడు చేతికి చిక్కితే అతని ద్వారా వీలైనంత సమాచారం సేకరించాలని ప్రయత్నిస్తారు. కానీ మన హీరో మాత్రం విలన్‌కు వార్నింగ్‌ ఇవ్వటానికి కాల్చి చంపేస్తాడు. విలన్‌ దీంతో చెలరేగిపోతాడు. అనేక మందిని చంపుతూ ఉంటాడు.

ఇక్కడ సమస్య ఏమిటంటే– విలన్‌ సూర్య– రెండు సార్లు తప్ప– మిగిలిన సమయాల్లో తాను అనుకున్న పనిచేసి తీరుతాడు. (బండరాయి పడిపోయి మనుషులను చంపేస్తుంది.. హాస్పటల్‌లో బాంబు పేలి మనుషులు చనిపోతారు). ఒక సైకో కిల్లర్‌ వందల మందిని ఒక అరగంటలో చంపేయబోతున్నాడంటే– ఎవరైనా తమకున్న వనరులన్నింటినీ వాడతారు. మహేష్‌ మాత్రం– ‘నేనే డీల్‌ చేస్తాను సార్‌..’ అని ధైర్యంగా వెళ్లి ఫెయిల్‌ అవుతాడు. దీనికి ఫలితం వందల మంది పేషెంట్ల మరణం.

ఈ సన్నివేశం తర్వాత హీరో ప్రపంచానికి పెద్ద సందేశం ఇచ్చేసి వెళ్లిపోతాడు. ఈ విషయాన్ని పక్కన పెడితే  మహేష్‌ పాత్ర చిత్రీకరణలో ఉన్న మరో సమస్య– సందేశాలతో కూడిన పెద్ద పెద్ద డైలాగులు. ఆగడు (వాగుడు అని కొందరు ఆక్షేపించిన సంగతి గుర్తుందా?) సినిమా తర్వాత మహేష్‌– తనకు సహజసిద్ధంగా నప్పే వన్‌లైనర్లను వదిలేసి ప్రసంగాలను మొదలుపెట్టాడు. ఇదే ఒరవడి ఈ సినిమాలో కూడా కొనసాగింది.

పాటలు విషయానికి వస్తే– మహేష్‌ డ్యాన్సులు ఒకప్పటి సూపర్‌స్టార్‌ కృష్ణను మరిపిస్తాయి. కొన్ని పాటలైతే జుంబా డ్యాన్స్‌ క్లాసులను తలపిస్తాయి. డైరక్టర్‌ విషయానికి వస్తే– కథాబలం లేకుండా హీరో ఇమేజ్‌తో సినిమా తీయటం సరికాదనే విషయం స్పైడర్‌ తర్వాతైనా  మురుగదాస్‌ గ్రహిస్తే మంచిది. క్రెడిట్స్‌ను జాగ్రత్తగా చూసే నాలాంటి వాళ్లకు తెలుగు రాని మురుగుదాస్‌ తెలుగు సినిమాలకు డైలాగ్‌లు ఎలా రాశాడా అనే అనుమానం వస్తుంది.

ఇక రకుల్‌ ప్రీత్‌ పాత్రకు సినిమాలో ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. పోర్నో చూసి కిక్‌ ఎక్కే అమ్మాయి పాత్రలో ఆమె ప్రత్యేకంగా నటించిందీ ఏమి లేదు. ఇన్ని ప్రతికూలాంశాలు చెప్పుకున్న తర్వాత– కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం. విలన్‌గా సూర్య నటన, సంతోష్‌ శివన్‌ ఫొటోగ్రఫి, హరిష్‌జైరాజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌– స్పైడర్‌ను ఈ మాత్రమైనా నిలబెట్టాయి. ఈ సినిమాకు 120కోట్లు ఖర్చు పెట్టడం పూర్తి వృధా అనిపిస్తుంది. తప్పనిసరైతే తప్ప ఈ సినిమాను చూడకపోవటం మంచిది. 

సినిమా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి– మహేష్‌ కెరీర్‌ విశ్లేషిద్దాం. ఆగడు, బ్రహోత్సవం, స్పైడర్‌ సినిమాలను చూస్తే– మహేష్‌ తన కెరీర్‌లో కొన్ని తప్పులు చేస్తున్నాడనిపిస్తుంది. ఏ హీరో అయినా– తన బలాలు, బలహీనతలను బేరీజు వేసుకొని వాటికి తగిన కథలను ఎంపిక చేసుకోవాలి. మహేష్‌ చూడటానికి బావుంటాడు.. వన్‌లైనర్స్‌ టైమింగ్‌ బావుంటుంది. ఇవి మహేష్‌ బలాలు. డ్యాన్స్‌లు, పెద్ద పెద్ద డైలాగ్‌లు అతని వీక్‌నెస్‌లు. బలమైన కథ, మంచి డైరక్టర్‌ ఉంటే– మహేష్‌ నటన ఎలివేట్‌ అవుతుంది.

కేవలం తన నటన ద్వారా సినిమాను ముందుకు తీసుకువెళ్లే బలం మహేష్‌కు లేదు. ఈ విషయాన్ని మహేష్‌, ఆయన సలహాదారులు గుర్తిస్తే మంచిది. ఏ హీరో అయినా తన పాత్రకన్నా గొప్పవాడు కాదు. ఈ పాత్రలను తక్కువ చేసుకుంటే– అసలుకే మోసం వస్తుంది. మహేష్‌ మరో ఐదారేళ్లు హీరో పాత్రలు వేయగలడేమో.. అంటే ప్రస్తుతం ఉన్న స్పీడును బట్టి చూస్తే ఆరేడు  సినిమాలు. ఆ తర్వాత ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. అందువల్ల మహేష్‌ ఇప్పటి నుంచైనా మంచి కథలు ఎంపిక చేసుకుంటే మంచిది. అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవటం ఉత్తముల లక్షణం. మహేష్‌ ఈ కోవకు చెందిన హీరో అని ఆశిద్దాం.

– భావన
-([email protected])

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?