Advertisement

Advertisement


Home > Movies - Reviews

Mark Antony Review: మూవీ రివ్యూ: మార్క్ ఆంటోనీ

Mark Antony Review: మూవీ రివ్యూ: మార్క్ ఆంటోనీ

చిత్రం: మార్క్ ఆంటోనీ
రేటింగ్: 2/5
తారాగణం:
విశాల్, ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వరాఘవన్, రీతు వర్మ, అభినయ, వైజి మహేంద్రన్, రెడిన్ కింగ్స్లే తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ 
నిర్మాత: వినోద్ కుమార్ 
దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్ 
విడుదల: 15 సెప్టెంబర్ 2023 

కాలంలో ప్రయాణించే టైం మెషీన్లు, ఒక కాలం నుంచి మరొక కాలానికి మాట్లాడే ఫోన్లు చాలా సినిమాల్లో వచ్చాయి. మొన్నామధ్యన తెలుగులో వచ్చిన "ప్లేబ్యాక్" చిత్రంలో ఈ తరహా ఫోన్ నేపథ్యంలోనే కథ సాగుతుంది. ఇప్పుడు అదే కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. 

కథ 1975లో మొదలవుతుంది. ఒక సైంటిస్ట్ (సెల్వ రాఘవన్) టైం ఫోన్ ని కనిపెడుతుంటాడు. దాంతో గతంలో ఉన్నవాళ్లకి ఫోన్ చేసి మాట్లాడి కొన్ని పొరపాట్లు జరక్కుండా చూడాలని, తద్వారా తన వర్తమాన వ్యక్తిగత జీవితం మెరుగ్గా ఉండాలని అతని ప్రయత్నం. అదలా ఉంటే ఆంటోనీ (విశాల్), జాకీ (ఎస్. జె. సూర్య) లు స్నేహితులు. వీళ్ల శత్రువు ఏకాంబరం (సునీల్). వీళ్ల మధ్యలో గ్యాంగ్ వార్ గట్రా జరుగుతుంటాయి. అయితే ఆంటోనీ, జాకీల మధ్యలో గొడవ జరిగి ఇద్దరూ విడిపోతారు. వాళ్లకి కొడుకులుంటారు (వాళ్లూ విశాల్, ఎస్.జె.సూర్యాలే). వీళ్ల కథ 1995లో ఉంటుంది. 

మొత్తానికి 1975కి, 1995 కి మధ్యన ఆ సైంటిస్ట్ తయారు చేసిన టైం ఫోన్ ఎటువంటి పాత్ర పోషించింది? ఆంటొనీ, జాకీల గొడవలో టైం ఫోన్ పాత్ర ఏమిటి? చివరికి ఏమౌతుంది? ఇదే కథాంశం. 

వినడానికి ఇదేదో సరదాగా నడిచే సినిమాగా అనిపించినా ట్రీట్మెంట్ విషయంలో చాలా చిరాకుపెట్టాడు దర్శకుడు. ఓపెనింగులో చాలా మెచ్యూర్డ్ గా ఉండబోయే సినిమాయేమోనని అనిపిస్తుంది. కానీ రాను రాను ఫార్స్ కామెడీ కంటే హీనంగా నడుస్తూ ఓర్పుని పరీక్షిస్తుంది. 

1995లో ఉన్న విశాల్, సూర్యల్లో ఒకడు కారు మెకానిక్, ఇంకొకడు డాన్. టైం ఫోన్ ప్రమేయం వల్ల వీళ్లు తారుమారవుతుంటారు. 

1995 జంటకి రీతూ వర్మ. 1975 హీరోలకి అభినయ. 

ఇక్కడ హీరో ఎవరు, విలన్ ఎవరు అంటే...1975లో జరిగే ఫ్లాష్ బ్యాక్ లో విశాల్ విలన్, 1995 కథలో సూర్య విలన్ అనుకోవాలి. 

అసలీ సినిమా కాన్సెప్ట్ అర్ధం కావడానికే సామాన్యులకి గందరగోళంగా ఉంటుంది. గతంలోకి వెళ్లి అక్కడొక సంఘటనని ప్రభావితం చేస్తే దాని పర్యవసానం వర్తమానంలో మారుతుందనేది సింక్ అయ్యే పద్ధతిలో చెప్పాలంటే కాస్త సీరియస్ టోన్లో ఎమోషనల్ గా చెప్పాలి. ఎక్కడా ఎమోషన్ లేకుండా మొత్తం సో-కాల్డ్ కామెడీ మొమెంట్స్ తో నింపేసి కథనం నడిపితే అయోమయంగా అనిపిస్తుంది. 

పైగా ఇంతమంది పాత్రలు. ఎవరేంటో కనెక్ట్ చేసుకుని, ఎవరు ఎవర్ని ఏ కారణం చేత ప్రభావితం చేస్తున్నారో అర్ధం కావడానికే టైం పడుతూ ఉంటుంది. ఒక మంచి ఐడియాని చెత్త ట్రీట్మెంటుతో పాడుచేసుకున్న చిత్రమిది. 

ఉన్నంతలో హైలైట్ ఏంటంటే సిల్క్ స్మిత లుక్ అలైక్ ని తీసుకొచ్చి ఇందులో ఒక సీన్లో పెట్టారు. ఆమెతో ఒక పాట పెట్టున్నా పబ్లిసిటీ పీక్స్ లో ఉండేది. ఎందుకో మరి ఆ పని చెయ్యలేదు. 

ఈ డబ్బింగ్ సినిమాలో తెలుగు ఆడియన్స్ ని కనెక్ట్ చేసుకోవాలనే ఆలోచనతో ఒకటి రెండు డైలాగులు పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబుని ఉద్దేశించి పెట్టారు. 

1995 నేపథ్యంలో కథ సాగుతున్నప్పుడు ఒకతను సినిమాల్లో ట్రై చేస్తుంటాడు. మొన్నేదో సినిమా ఇంటర్వ్యూ అన్నావు, ఏమయ్యింది అని అతన్ని అడుగుతాడు ఇంకొకడు. "వేరే అతనికి ఇచ్చేసారు. ఆ సినిమా టైటిల్ "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి". అతని పేరు ఏదో "పి" తో మొదలవుతుంది.. ఆ.. పవన్ కళ్యాణ్ అట" అని ఆలోచిస్తూ చెప్తాడు. 

దానికి బదులుగా సందర్భం కాకపోయినా మరొకడు- "ఈ రోజు నువ్వు ఆలోచించి చెప్పిన పేరు, రేపు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తుంది" అంటాడు. కానీ చప్పట్లు కొట్టడానికి ఇక్కడ హల్లో జనం లేరు. 

ఇంకొక సీన్లో విశాల్ ని పొడవడానికి ఎన్.టి.ఆర్ అభిమాని ఒకడు వెనుక నుంచి వస్తాడు. వాడిని పట్టుకున్న విశాల్, "అన్నగారిని గుండెల్లో పెట్టుకున్న ఎవరికి వెన్నుపోటు పొడిచే అలవాటే లేదురా" అంటాడు. ఇక్కడ "వెన్నుపోటు" అనగానే చంద్రబాబు గుర్తురావడం సహజం. 

ఇక సాంకేతిక అంశాల విషయానికొస్తే ఈ చిత్ర సంగీతం ఘోరంగా ఉంది. పాటలు ఆకట్టుకోవు. కెమెరా వగైరాలు, పీరియడ్ మేకప్పులు, సెట్టింగులు, నిర్మాణ విలువలు ఓకే. 

డబల్ యాక్షన్లో విశాల్, ఎస్.జె.సూర్యలు తమ పని తాము చేసారు. సూర్యా పర్ఫార్మెన్స్ నేచురల్ గా ఉంటే విశాల్ బాడీ లేంగ్వేజ్ మాత్రం చాలా ఆర్టిఫీషియల్ గా ఉంది. 

హీరోయిన్ గా రీతు వర్మ ఏదో ఉండడానికన్నట్టుగా ఉంది. ఈ మధ్యన వచ్చిన "ఒకే ఒక జీవితం"లో కూడా ఇలాగే గతంలోకి వెళ్లి గతాన్ని మార్చే కార్యక్రమం ఉంటుంది. అదేంటో అందులో కూడా హీరోయిన్ రీతూ వర్మే. 

అభినయ పాత్ర కూడా ఉండీ ఉండనట్టుగా ఉంది. ఎంతో సెంటిమెంట్ పండించాల్సిన ఈ పాత్రని హడావిడి చేసేసారు.

వైజి మహేంద్రన్ లాంటి సీనియర్ నటుడి చేత గే టైప్ పాత్ర వేయించి ఎవర్ని నవ్విద్దామనుకున్నారో ఏమిటో!

సైంటిస్టుగా సెల్వ రాఘవన్ ఓకే. 

ఎక్కడా సటిలిటీ లేకుండా బాగా లౌడ్ సినిమాలు ఇష్టపడే వాళ్లకి ఇది ఎక్కుతుందేమో. మిగిలినవాళ్లకి ఏమీ ఊహించుకోకుండా వెళ్లి చూస్తేనే చిరాకు నషాళానికి ఎక్కుతుంది. ఇక ఎంతో కొంత వినోదాన్ని ఆశించి వెళితే పిచ్చెక్కొచ్చు. 

బాటం లైన్: "టైం" బ్యాడ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?