చిత్రం: మీటర్
రేటింగ్: 1.5/5
తారాగణం: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, ధనుష్ పవన్, పోసాని, సప్తగిరి తదితరులు
ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్ ఆర్
కెమెరా: వెంకట్ సి దిలీప్
నిర్మాత: చెర్రీ, హేమలత పెదమల్లు
దర్శకత్వం: రమేష్ కాడూరి
విడుదల తేదీ: 7 ఏప్రిల్ 2023
యూత్ కి ప్రామిసింగ్ నటుడిగా కనిపిస్తూ వచ్చిన కిరణ్ అబ్బవరం ఈ మధ్యన మాస్ హీరోగా నిలబడే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగమే ఈ “మీటర్” కూడా.
కథలోకి వెళ్తే..సిన్సియర్ గా పోలీసు ఉద్యోగం చేసుకునే హీరో తండ్రి తరచూ ట్రాన్స్ఫర్స్ కి గురౌతుంటాడు. లంచగొండులైన తన సీనియర్ ఆఫీసర్స్ లా కాకుండా అతని కొడుకుని ఒక నిఖార్సైన ఎస్సైగా చూడాలనుకుంటాడు. కానీ కొడుకుకి ఎస్సై అవ్వాలని ఉండదు. అయినా అనూహ్యంగా అతనికి ఎస్సై ఉద్యోగమొస్తుంది. ఆ ఉద్యోగం ఎలా వచ్చింది? అతను చేసిన ఘనకార్యాలు ఏవిటి అనేది ఒక పార్శ్వం. తర్వాత అతనికి ఉద్యోగం పోతుంది. అయినా కూడా విలనైన హోం మినిస్టర్ తో ఎలా ఆడుకున్నాడు, అన్యాయం కాబడ్డ వేలమందికి ఎలా న్యాయం చేసాడు. ఇది ఇంకొక పార్శ్వం. ఉండాలి కాబట్టి ఒక హీరోయిన్, ఆమెతో పాటలు ఉన్నాయి.
ఇలాంటి కథలు చాలానే చూసాం. అదే కోవలో ఇంకొకటి.
డిపార్ట్మెంటులో లేకపోయినా పోలీసుల పరువు కాపేడయడం, హీరో తండిని విలన్ కిడ్నాప్ చేస్తే ఆ తండ్రి చావుకి భయపడకుండా తన కొడుకు గురించి గొప్పగా చెప్పడం, హీరోయిన్ ని తొలి చూపు చూసి మనసు పారేసుకుంటూ సముల్టేనియస్ గా ఫైటింగ్ చేయడం వంటివన్నీ రేసుగుర్రం, పోకిరి, బాహుబలి సినిమాల్లో చూసేసాం కదా అనిపిస్తుంది. పైగా ఆ సినిమాల్లో సీన్స్ ఇందులో చూస్తుంటే ఏదో స్పూఫ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప హీరోయిజం కనపడదు.
పెద్ద స్టార్ హీరోలు చేసే లాంటి సినిమాలు చేయడమొక్కటే తన కెరీర్ కి మార్గమని గట్టిగా నమ్ముతున్నట్టున్నాడు కిరణ్ అబ్బవరం. తనకి తాను అల్లు అర్జున్ కి, మహేష్ బాబుకి, ప్రభాస్ కి తీసిపోను అన్నట్టుగా ఆ తరహా కథల్ని, ట్రీట్మెంట్ ని కోరుకుంటున్నాడు.
అతని అంచనా ఎంత తప్పో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. స్టార్డం ఉన్న హీరో అయ్యుండి, టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టులతో తెర నిండిపోయి, అద్భుతమైన కథా కథనాలు, పంచ్ డైలాగులు ఉంటే అది మాస్ హిట్టయ్యే అవకాశముంటుంది. “స్టార్లెందుకు? నటీనటులు ప్రతిభావంతులైతే సరిపోదా” అని అమాయకంగా అనుకోవచ్చు. కానీ జనాదరణకి స్టార్డం ఉన్న నటులు మాత్రమే చెయ్యాల్సిన సినిమాలు కొన్నుంటాయి. అలాంటి వాటికి బడ్డింగ్ హీరోలు, ఇంకా ముఖపరిచయమవ్వని క్యారెక్టర్ ఆర్టిస్టులు దూరంగా ఉంటే శ్రేయస్కరం. లేకపోతే నిర్మాత జేబుకి చిల్లు, చూసే కొద్దిమంది ప్రేక్షకుల నుంచి వెటకారాల జల్లు తప్పదు. మైత్రీ మూవీ మేకర్స్ బ్రాండుతో విడుదలైనా కూడా కంటెంట్ కి సరిపడా కటౌట్ ఉన్న హీరో, ఇతర ప్రధాన పాత్రలు లేక డీలా పడ్డ చిత్రమిది.
సాధారణంగా మాస్ సినిమాల్లో లాజిక్ లేని తనం ఆయా హీరోల ఫ్యాన్స్ చేసే హడావిడి మధ్య, ఈలల మధ్య కొట్టుకుపోతుంది. అది చిన్న హీరోలతో వర్కౌట్ కాదు. ఈ సూత్రాన్ని మైత్రీ మేకర్స్ కూడా మరిచినట్టున్నారు.
ఇక్కడ కథ, కథనం, దర్శకత్వం అన్నీ అరువు తెచ్చుకున్నట్టున్నాయి తప్ప ఒరిజినాలిటీ కనపడలేదు. సంగీతం ఆకట్టుకోలేదు.
కిరణ్ అబ్బవరం టాలెంటున్న నటుడే కాదు, రచయిత, దర్శకుడు కూడా. తన పర్సనాలిటీకి, ఇమేజ్ కి తగ్గ కథలు తెలివిగా రాసుకుంటూ, ఔటాఫ్ ది బాక్స్ సబ్జెక్ట్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకోవచ్చు. అలా కాకుండా తాను కూడా మూస ధోరణిలో కొట్టుకుపోతానంటే ఫలితం అంత ఆశాజనకంగా ఉండదు.
హీరోయిన్ గా అతుల్య రవి కి చేయడానికి పెద్ద పాత్రేమీ లేదు.
ధనుష్ పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే ఉంది.
హీరోకి తండ్రిగా చేసిన నటుడు సింగిల్ ఎక్స్ప్రెషన్ తో సినిమా మొత్తం లాగించేసాడు.
పోసానిది రొటీన్ పాత్ర. అయితే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి ఆ పాత్రకి తగ్గట్టు కాకుండా తనకి తగ్గట్టు వెకిలిగా చేసుకుంటూ పోయాడు.
ఇదే సినిమాని పెద్ద హీరోలతో, పెద్ద తారాగణంతో చేస్తే అద్భుతమనిపించేదా అంటే..కాదు. ఎందుకంటే ఇలాంటి కథా కథనాలు పదేళ్ల క్రితమే తెలుగు తెర మీద వచ్చేసాయి. కాబట్టి స్క్రిప్ట్ లో కూడా ఫ్రెష్నెస్ మిస్సయ్యిందనే చెప్పాలి.
మూడడుగుల చిన్న పిల్లాడికి నాలుగు మీటర్ల బట్టతో ప్యాంటు కుడితే లూజైపోయి ఎంత దారుణంగా ఉంటుందో అలా ఉంది ఇది. ఇది కిరణ్ అబ్బవరం సైజుకి మించిన కథ, కథనం.
బాటం లైన్: మీటర్ ఎక్కువయ్యింది