ఏపీలో పొత్తుల రాజకీయం అలా టీవీ సీరియల్ మాదిరిగా సాగుతోంది. మనసులో ఏవో ఆలోచనలు ఉన్నాయి. బయటకు మాత్రం వేరుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ముసుగులో గుద్దులాటగా కొన్ని పార్టీల వ్యవహారం ఉంది. ఇక ఏపీలో బీజేపీ జనసేన మిత్ర పక్షంగా ఉన్నాయి. టీడీపీతో పొత్తులకు జనసేన నుంచి సుముఖం అని వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ అయితే నో చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
అయితే ఏపీ బీజేపీలో అందరూ అదే మాట మీద ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. టీడీపీతో కలసి వెళ్లాలని నుకుంటున్న వర్గం ఉంది. లేదు సొంతంగా ఉండాలని భావించేవారు ఉన్నారు. టీడీపీతో పొత్తు ఉండాలని బాహాటంగా అయితే ఇప్పటిదాకా ఏ బీజేపీ నేత బయటపడలేదు.
కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు మాత్రం ఈ విషయంలో ఓపెన్ అయిపోయారు. ఏపీలో వైసీపీని గద్దె దించందుకు టీడీపీ బీజేపీ జనసేన కలసి పోటీ చేయాలని జనాలు అనుకుంటున్నారు అని గడుసుగానే రాజు గారు చెప్పారు.
అంటే మూడు పార్టీల మధ్య పొత్తు తమ కోరిక కాదు జనాభీష్టం అని ఆయన చెబుతున్నారన్న మాట. వైసీపీతో వేగలేకపోతున్నామని జనాలు భావిస్తున్నారని, మూడు పార్టీలు పొత్తులతో వచ్చి వైసీపీ పీడను పోగొట్టాలని వారు కోరుతున్నారని రాజు గారు కనిపెట్టి ఇలా బయటపెట్టారు.
అసలు జనసేనతో పొత్తు ఉందా లేదా అన్న డౌట్లు ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ ఆ మధ్య అసహనం వ్యక్తం చేశారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు వైఖరి చూస్తే జనసేన బీజేపీల మధ్య పొత్తు తప్ప మూడో పార్టీకి చాన్సే లేదని అంటున్నారు.
కేంద్ర బీజేపీ పెద్దల తీరు చూసినా తెలుగుదేశంతో కలసి ప్రయాణించాలన్న తలంపు లేనట్లుగానే ఉంది అంటున్నారు. ఏపీ బీజేపీలో మాజీ తమ్ముళ్ళు కొందరు సైకిల్ తో కమలాన్ని ముడేయాలని ఆరాటపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నా వారెవరూ ఇంతలా బాహాటం కాలేదు.
రాజు గారు మాత్రం ఆగేట్లు లేదు, ఎంత వేగం పొత్తులు మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిపోతే తాను ఎంచక్కా ఉత్తరం నుంచి టికెట్ తెచ్చుకుని పోటీ చేసి ఎమ్మెల్యే కావాలని ఉత్సాహపడుతున్నట్లుగా ఉందని సెటైర్లు పడుతున్నాయి. రాజు గారి అయితే జనం అడుగుతున్నారని చెప్పి తన మనసులోని మాట చెప్పేశారనే అంటున్నారు. దీని మీద ఏపీ బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో.