cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: మోసగాళ్లు

మూవీ రివ్యూ: మోసగాళ్లు

చిత్రం: మోసగాళ్లు 
రేటింగ్:2/5
నటీనటులు: విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, రూహి సింగ్, నవదీప్, నవీన్ చంద్ర 
కెమెరా: షెల్డన్ చావ్ 
సంగీతం: శాం. సి.ఎస్
ఎడిటింగ్: గౌతం రాజు 
నిర్మాతలు: మంచు విష్ణు 
దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్ 
విడుదల తేదీ: 19 మార్చ్ 2021

విజయ్ మాల్యా, నీరవ్ మోడి లాంటి ఆర్థిక నేరస్థుల కేసులకొచ్చినంత పాపులారిటీ అన్నింటికీ రాదు. అలాగని ఆ పాపులర్ కాని నేరాలు చిన్నవని కాదు. 

క్రైం న్యూస్ ఫాలో అయ్యేవాళ్లకి 2016 లో ముంబాయ్ (థానే) కేంద్రంగా జరిగిన కాల్ సెంటర్ స్కాం సుపరిచితమే. 24 ఏళ్ల కుర్రాడు ఆ స్కాం కి సూత్రధారిగా అరెస్టయ్యి 14 నెలల తర్వాత బెయిల్ పొంది బయటికొచ్చేసాడు. అతను, అతని అక్క కలిసి చేసిన ఆ రూ. 2000 కోట్ల పైచిలుకు కుంభకోణం కథే ఈ "మోసగాళ్లు" కి స్ఫూర్తి. 

ఇక సినిమా విషయనికొస్తే మొదటి నుంచి హడావిడి అయితే బాగానే చేసారు. డబ్బు చుట్టూ తిరిగే కథ అని విడుదల చేసిన పాటల ద్వారా తెలియజేసారు. రూ. 50 కోట్ల పెట్టుబడితో హాలీవుడ్ దర్శకుడి సారధ్యంలో తెరకెక్కించామని స్వయంగా నిర్మాత, నటుడు మంచు విష్ణు ప్రకటించారు. కాజల్ తనకి అక్కగా నటించిందన్న విషయం బయట పెట్టారు. అన్ని రకాల పబ్లిసిటీ మార్గాల ద్వారా ఈ సినిమాపై ఆసక్తిని ఉన్నంతలో పెంచగలిగేలా చేసారు. 

అయితే ఈ కథ ఆడియన్స్ ని ఏ మాత్రం కదిలించిందో చూద్దాం. 

ఇలాంటి తెలివైన మోసాల నేపథ్యంలో వచ్చిన సినిమా ఏదైనా ఉందా అంటే చప్పున గుర్తొచ్చేది "స్వామి రారా" అలాగే ఈ మధ్యన వచ్చిన "కనులు కనులను దోచాయంటే". ఆద్యంతం ఒక మేజిక్ లాగ కట్టిపారేసిన సినిమాలవి. ఇంటిలిజెన్స్, ఫన్, టెన్షన్, థ్రిల్ ..ఇలా అన్ని కలగలిపి ఆ జానర్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ గా నిలిచాయవి.  

ఆ స్థాయి కథనబలం ఈ "మోసగాళ్లు" లో ఉందా అంటే లేదనే చెప్పాలి. ఈ కాల్ సెంటర్ క్రైం గురించి ఎంత విపులంగా వివరించినా, ఆ రంగం గురించి తెలిసిన వాళ్లకి తప్ప అందరికీ ఈజీగా అర్థమయ్యేది కాదు. అర్థమయినా ఎంగేజ్ అవ్వాలంటే స్క్రీన్ ప్లే మ్యాజిక్ అద్బుతంగా ఉండాలి. లేకపోతే డాక్యుమెంటరీకి ఎక్కువ, సినిమాకి తక్కువ అన్నట్టుంటుంది. 

అర్జున్ (విష్ణు), అను (కాజల్) అక్కాతమ్ముళ్లు. చిన్నప్పుడే పేదరికం చూసారు. ఊహ తెలుస్తున్నప్పుడే మోసం చూసారు. పేదరికం నుంచి దూరంగా పారిపోవాలని అర్జున్ కోరిక. దానికోసం తప్పుదారులు తొక్కడం ఒక్కటే మార్గమని నమ్ముతాడు. అతనికి అక్క కూడా తోడవుతుంది. ఇద్దరూ కలిసి విజయ్ (నవదీప్) సాయంతో ఒక కాల్ సెంటర్ పెట్టి అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ ని ఎలా బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొట్టారనేదే కథ. ఉన్నదున్నట్టుగా జరిగిన కథని వాడుకున్నారు. 

ఇండియాలో ఆదాయపు పన్ను శాఖలాంటి అమెరికాలోని ఐ.ఆర్.ఎస్ (ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్) పక్షాన మట్లాడుతున్నామంటూ.. ఈ కాల్ సెంటర్ నుంచి అమెరికాలోని ట్యాక్స్ పేయర్స్ ని భయపెట్టి, దొంగతనంగా డబ్బుని కొల్లగొట్టిన స్కామే ఈ కథంతా. చివరికి ఆ అక్కాతమ్ముళ్లు ఏమయ్యారు? శిక్ష పడిందా? తప్పించుకున్నారా? అది క్లైమాక్స్. 

విష్ణు మంచు- కాజల్ పాత్రలైతే బాగున్నాయి కానీ, ఇద్దరి మధ్యన బాండింగ్ బలంగా తెరకెక్కలేదు. తమ్ముడు అక్కతో ఎందుకు గొడవపడతాడో, మళ్లీ తర్వాత సీన్లో ఏమీ జరగనట్టు అలా ఎలా కలిసిపోతారో అర్థం కాదు. ఫిజిక్ విషయంలో విష్ణు కష్టం కనపడింది. అదే కష్టం ఒక నిర్మాతగా తను స్రిప్ట్ రాసిన వాళ్లని కూడా పెట్టుండాల్సింది. 

కాజల్ నటించడం వల్ల ఈ సినిమా గ్రాఫ్ పెరిగింది. సునీల్ శెట్టి శరీరం చూడడానికి బలంగా ఉన్నా పాత్రపరంగా బలంగా లేదు. నవదీప్ ఓకే. నవీన్ చంద్ర ఎప్పుడూ అరుస్తూ విసిగిస్తాడు. కానిస్టేబుల్ గా రాజారవీంద్ర పాత్రని కూడా ఇంకా బెటర్ గా మలిచుండొచ్చు. సాంకేతికంగా చూస్తే శాం.సి.ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కెమెరా, ఎడిటింగ్ కూడా పర్వాలేదు. స్క్రీన్ ప్లే లోనే లోపాలున్నాయి. 

ఎంత ప్రేక్షకుల సౌలభ్యం కోసం అని అనుకున్నా ఇంగ్లీషువాళ్లు తెలుగులో మాట్లాడడం లాంటివి నాన్-సింక్ గా అనిపించాయి. పైగా డబుల్ వాయిస్ లో డయలాగ్స్ వస్తుంటే డాక్యుమెంటరీ ఫీల్ వచ్చింది. 

ఇండియానుంచి అమెరికాకి చుట్టం చూపుగా వెళ్లిన ఒక పెద్దాయనకి తన కొడుకు మొబైల్ నెంబర్ కి ట్యాక్స్ విషయంలో ఫోన్ వస్తే, టెన్షన్ పడి అటు ఇటు పరుగెత్తి గుండాగి చనిపోవడం మరీ కృతకంగానూ, విడ్డూరంగానూ ఉంది. ఒకవేళ ఇలాంటిది నిజంగా జరిగిందని ఏదైనా ఆధారం ఉన్నా తెర మీద సినిమాగా చూస్తున్నప్పుడు సీరియస్ సీన్ కాస్తా కామెడీ అవుతుందని గ్రహించి ఉండాల్సింది.  

పూర్తిగా ఒరిజినల్ కథకి కట్టుబడి తీసారు కానీ, కాస్త ఫిక్షన్ జోడించి మరింత ఎంటెర్టైనింగ్ గా తీసుంటే ఫైనాన్షియల్ క్రైం జానర్లో మంచి మూవీ అయ్యుండేది. 

బాటం లైన్: టూ టెక్నికల్

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×