ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రధానంగా వాస్తవిక దృక్పథమే కాపాడుతోంది. నేల విడిచి సాము చేసేందుకు ఆయన ఎన్నడూ ప్రయత్నించరు. ఇదే జగన్ స్థానంలో మరో నేత ఉండి ఉంటే హాయిగా రిలాక్స్ అయ్యే వారేమో! కానీ జగన్ అలా ఉండరు, ఉండలేరు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక విషయమై ఆయన ఈ రోజు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జగన్ ఉప ఎన్నిక విషయమై దిశానిర్దేశం చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక విషయంలో అతి విశ్వాసం పనికి రాదని హెచ్చరించారు. అందరూ సమన్వయంతో పనిచేసి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా ఒక మంత్రి, అదనంగా ఒక ఎమ్మెల్యే ఉంటారని వెల్లడించారు.
దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా తిరుపతి ఉప ఎన్నికలో భారీ మెజార్టీ సాధించాలని, అందుకు తగ్గట్టు కార్యాచరణ రూపొందించాలని పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు సీఎం సూచించారు.
ఇటీవల పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయాలను సాధించడంతో పార్టీ నేతలు తిరుపతి ఉప ఎన్నికను లైట్‌గా తీసుకుంటారేమోనని జగన్ ముందస్తు హెచ్చరికలు చెప్పడం గమనార్హం. ప్రతి ఎన్నికను సీరియస్‌గా తీసుకోవాలనే భావన ఆయన హెచ్చరికలో స్పష్టంగా కనిపించింది.
నిజమైన రాజకీయ నాయకులెప్పుడూ ఎన్నికలను జగన్‌లాగే సవాల్‌గా తీసుకుంటారు. అప్పుడు మాత్రమే కోరుకున్న ఫలితాలను సాధించే వీలవుతుంది. అంతెందుకు స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నా చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధించాలనే పట్టుదలతో వ్యూహ రచన చేస్తుండడం తెలిసిందే.
అలా కాకుండా నిన్నటి స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను చావు దెబ్బ తీశామని వైసీపీ ఏ మాత్రం ఏమరుపాటు వహించినా, ఆ నిర్లక్ష్య ఫలితం మరోలా ఉంటుందని చెప్పక తప్పదు. ఈ విషయాన్ని మొదట్లో జగన్ గుర్తెరిగి పార్టీ నేతలను అప్రమత్తం చేయడం ఆయన ముందు చూపునకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో నిన్నటి పరిస్థితి నేడు ఉండదనే గ్రహింపే జగన్‌ను కాపాడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-సొదుం రమణ