రివ్యూ: రోగ్
రేటింగ్: 1.5/5
బ్యానర్: తన్వి ఫిలింస్
తారాగణం: ఇషాన్, మన్నర చోప్రా, అనూప్ సింగ్ ఠాకూర్, ఏంజెలా, సుబ్బరాజు, అలీ, అవినాష్, తులసి తదితరులు
కూర్పు: జునైద్ సిద్ధికి
సంగీతం: సునీల్ కశ్యప్
ఛాయాగ్రహణం: ముకేష్ జి.
నిర్మాత: సి.ఆర్. మనోహర్, సి.ఆర్. గోపి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్
విడుదల తేదీ: మార్చి 31, 2017
'మరో చంటిగాడి ప్రేమకథ' అంటూ పూరి జగన్నాథ్ క్యాప్షన్ పెట్టేసరికి 'ఇడియట్' తరహా ఫ్రెష్‌నెస్‌ని మళ్లీ చూపిస్తున్నాడేమో అనే ఆశ కలగడం సహజం. కానీ ఈ 'రోగ్'కి పూరి ఫామ్ కోల్పోయినప్పుడు తీసిన 'లోఫర్'తో సారూప్యం వుందేమో కానీ, తను అద్భుతమైన ఫామ్‌లో వున్నప్పుడు చేసిన 'ఇడియట్' దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఈమధ్య ఏ పూరి జగన్నాథ్ సినిమా చూసినా హీరో మాటతీరు, చూపు, ప్రవర్తన, అలవాట్లు అన్నీ ఒకే తీరున వుంటున్నాయి. చివరకు స్టయిలింగ్ పరంగా కూడా సిమిలారిటీ ఫాలో అవుతోన్న పూరి జగన్నాథ్ 'రోగ్'పై అణువణువునా తన ముద్ర వేసాడు. కెరీర్ డౌన్ స్వింగ్‌లో వున్నప్పుడే ఒక పోకిరి, ఒక బిజినెస్‌మేన్‌లాంటివి ఇచ్చిన పూరి జగన్నాథ్ నుంచి మళ్లీ అలాంటి సర్‌ప్రైజ్ రోగ్‌తో దొరుకుతుందేమోనని సినీ ప్రియులు ఎదురు చూసారు. అయితే పూరి ఈ రోగ్‌ని కూడా ఇటీవల తను తీసిన చిత్రాల మాదిరిగానే తల, తోక లేకుండా నడిపిస్తూ, కేవలం కొన్ని అలరించే డైలాగులతో మమ అనిపించేసాడు.
చిత్ర విచిత్రంగా అనిపించే తన లవ్‌స్టోరీతో చంటిగాడి పరిచయం జరుగుతుంది. తనని ప్రేమించి, తనకంటే మంచి ఆప్షన్ దొరికిందని తెలియగానే తనని వదిలేసిన అమ్మాయిపై కోపంతో మొత్తం ఆడవాళ్లనే ద్వేషిస్తుంటాడు. అమ్మాయిల సైకాలజీపై, వారి పద్ధతులపై పూరి హీరో సెటైర్లు వేయడం కొత్తేమీ కాదు. కాకపోతే ఈసారి అలాంటి ఒక్క సీన్ పెట్టడం కాకుండా మొత్తం సినిమానే దానిపై తీసేసారు. అమ్మాయిల స్వార్ధం పట్ల పూరి జగన్నాథ్ వేసే సెటైర్లు ఖచ్చితంగా యువకులని మెప్పిస్తాయి, మరీ ముఖ్యంగా భగ్న ప్రేమికులని. అలిగి వెళ్లిపోతున్న అమ్మాయి వెంట పడుతోన్న వాడిని ఆపి 'దరిద్రం అలిగి వెళ్లిపోతుంటే ఆపకండిరా' అని చెప్తాడు చంటి. ఇలాంటి చిన్న చిన్న చమక్కులు ఒక వర్గాన్ని మెప్పిస్తాయి.
కథని ముందుకి నడిపించడానికి ఒక ఫైట్ సీన్‌ని కూడా వాడేసుకోవచ్చునని పూరి ఈ చిత్రం ద్వారా చూపించాడు. ప్రేమించిన అమ్మాయి కోసం పోలీసులని కొట్టిన సందర్భంలో తనవల్ల ఒక కానిస్టేబుల్ కుటుంబం రోడ్డున పడిందని తెలుసుకుని, వాళ్లకి మంచి చేయడం కోసమే వారి దగ్గరకి వెళ్లిపోతాడు చంటి. వాళ్లు అతడిని చేరదీయకపోతే, ఎదురుగా ఉంటోన్న బిచ్చగాళ్ల బ్యాచ్‌తో చేరిపోయి అక్కడే బతికేస్తుంటాడు. వాళ్లకున్న అప్పులు తీర్చడం కోసం రికవరీ ఏజెంట్ అవుతాడు.
ఈ రికవరీ ఏజెంట్‌గా మారే ఘట్టం, మొండి బాకీలు వసూలు చేసే పద్ధతి అచ్చమైన పూరి మార్కుతో సరదాగా అనిపిస్తుంది. ఆ పోలీస్ చెల్లెలి పాత్ర ద్వారా మరో హీరోయిన్ ఎంటర్ అవుతుంది. ఆమెని కన్విన్స్ చేసే ప్రయత్నాలతో అదో రకమైన వినోదంతో సాగిపోతున్న చిత్రం విలన్ ఎంట్రీతో టోటల్‌గా ట్రాక్ తప్పుతుంది. ఒక సైకో జైల్లోంచి తప్పించుకోవడం, అతడికి అనుకోకుండా హీరోనే సాయపడడం, ఆ సైకో వచ్చింది ఈ కానిస్టేబుల్ చెల్లెలి కోసమని తెలియడంతో కథ విరామానికి చేరుతుంది.
ఇక అక్కడ్నుంచీ రోగ్‌కి సైకోసిస్ అనే రోగం సోకుతుంది. సమయం గడపడానికి తగ్గ కంటెంట్ లేకపోవడంతో ఆ సైకో పాత్ర ఫ్లాష్‌బ్యాక్, అతని ఎక్స్‌ట్రీమ్ క్యారెక్టర్ మీద ఫోకస్ పెరుగుతుంది. అంతెందుకు అతడిపై ఒక పాటనే చిత్రీకరించాడు పూరి జగన్నాథ్! హీరో హీరోయిన్ల రొమాన్స్‌కి బీజం పడిన సమయంలో వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో విలన్ తన గ్యాంగ్‌తో పాట పాడుకుంటూ డాన్స్‌లు చేస్తుంటాడు. తనకి కావాల్సిన అమ్మాయిని పోలీసులు దొరకన్విడం లేదని, ఊళ్లో ఆ పేరున్న ఆడవాళ్లు అందరినీ కిడ్నాప్ చేసేస్తాడు. ఈలోగా కానిస్టేబుల్‌కి కాళ్లు తిరిగి రప్పించడానికి చేసే ఆపరేషన్ కోసం పది లక్షలు కావాల్సి వస్తే, అదే సైకోతో హీరో డీల్ మాట్లాడుకుంటాడు. 'పదిచ్చుకో పొడిచేసుకో' అంటూ విచిత్రమైన సెంటిమెంట్‌ని పండించేందుకు విఫలయత్నం చేస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఆ సైకో అప్పటికప్పుడు దోపిడీలు చేస్తాడు.
అసలు ఈ తతంగమంతా ఎంత అస్తవ్యస్తంగా, ఇంకెంత కంగాళీగా వుంటుందంటే, దానంతటికీ విసుగు రాకపోగా, ఆ గందరగోళానికి నవ్వొస్తుంది. ఇదంతా నిజంగా కోట్ల రూపాయల ఖర్చుతో సినిమాగా తెరకెక్కేసిందా అనే నమ్మశక్యం కాని నిజం కలవర పరుస్తుంది. సగటు పూరి మార్కు పొగరుబోతు హీరోగా ఇషాన్ నటన బాగానే వుంది. కుర్రాడు చూడ్డానికి బాగున్నాడు, కాన్ఫిడెంట్‌గా వున్నాడు. మంచి సినిమాలతో నిలదొక్కుకోగలడు. మన్నర చోప్రా మునుపటి సినిమాల కంటే బెటర్ అనిపిస్తుంది. ఏంజెలా ముఖంలో ఎక్స్‌ప్రెషన్ పట్టుకున్న వాళ్లకి పది లక్షలు ప్రకటించవచ్చు. అనూప్ సింగ్ సైకోగా విపరీతంగా ఇరిటేట్ చేస్తాడు. సుబ్బరాజు ఓవర్ ప్లే చేస్తుంటే, ఏంజెలా అన్నయ్యగా కమీషనర్ క్యారెక్టర్ చేసినతను అండర్ ప్లే చేయడానికి ట్రై చేసాడు. అలీ ముష్టి కామెడీ 'పోకిరి'లోని ట్రాక్‌కి ఎక్స్‌టెన్షన్‌లా వుంది.
సినిమా ఎంత లౌడ్‌గా వుందో సంగీతం అంతకంటే లౌడ్‌గా తయారైంది. నేపథ్య సంగీతానికి చెవులు చిల్లులు పడిపోతాయి. సైకో క్యారెక్టర్‌కి కంపోజ్ చేసిన ఆ సైకో మంత్రానికి చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది. విజువల్స్ రిచ్‌గా వున్నాయి. భారీగా ఖర్చు పెట్టారనేది తెలుస్తూనే వుంటుంది. ఒకటీ అరా మాటల్లో తప్ప పూరిలో మునుపటి స్పార్కు కనిపించిన దాఖలాలు లేవు. అదే కథని తిప్పి తిప్పి తీస్తోన్న పూరి ప్రతిసారీ దానినే కొత్త కథ అని ఫీలవుతూ వుండడం విడ్డూరమనిపిస్తుంది. టెంపర్ మాదిరిగా ఇతరుల కథలని తనకి తగ్గట్టుగా మలచుకోవడంపై దృష్టి పెడితే పూరీ నుంచి ఈ రోగ్‌లు, లోఫర్‌లు రావనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంతకాలం తన సినిమాలెలా వున్నా హీరోల సాయంతో ఓపెనింగ్స్ రాబట్టుకున్న పూరికి ఈసారి ఆ అడ్వాంటేజ్ కూడా లేకపోయే సరికి 'రోగ్'కి పూర్తిగా ఆకర్షణ కరవైంది. దానికి తోడు వచ్చిన ఆ అరకొర ప్రేక్షకులతో కూడా అక్షింతలు వేయించుకునేలా ఈ సినిమా తయారైంది.
బాటమ్ లైన్: మిస్‌ఫైర్!
గణేష్ రావూరి