ఎమ్బీయస్‌ : ఫలితాల విశ్లేషణ – మణిపూర్‌, గోవా

60 సీట్ల మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసుకు 46% సీట్లు వస్తే బిజెపికి దాని కంటె 11% తక్కువగా 35% సీట్లు వచ్చాయి. అయినా బిజెపియే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బిజెపి తరఫున మణిపూర్‌…

60 సీట్ల మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసుకు 46% సీట్లు వస్తే బిజెపికి దాని కంటె 11% తక్కువగా 35% సీట్లు వచ్చాయి. అయినా బిజెపియే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బిజెపి తరఫున మణిపూర్‌ ఎన్నికల పరిశీలకుడిగా వున్న అసాం ఆర్థికమంత్రి హిమాంత బిశ్వాస్‌ శర్మ ''ఇండియా టుడే''తో ముందే చెప్పాడట – ''మాకు 15 సీట్లు వచ్చినా చాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తాం'' అని. వాళ్ల ధైర్యానికి కారణం ఏమిటంటే నాగా పార్టీలతో వారికి రహస్య ఒప్పందం వుంది. కానీ ఒప్పందాన్ని బహిర్గతం చేయడానికి బిజెపికి ధైర్యం చాలలేదు. ఎందుకంటే వాళ్లతో కలిసి ఊరేగుతోందంటే లోయ ప్రాంతంలోని మెయితియులకు కోపం వస్తుందని దడిసింది. అది అలుసుగా తీసుకుని కాంగ్రెసు ముఖ్యమంత్రి ఇబోబి సింగ్‌ నాగాలతో కేంద్రం కుదుర్చుకున్న ఒప్పందాన్ని బయటపెట్టమని మాటిమాటికీ ఛాలెంజ్‌ చేశాడు. కాంగ్రెసు, బిజెపి తలా 60 సీట్లలో పోటీ చేశాయి. నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ 16టిలో, తృణమూల్‌ 24టిలో, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ 9టిలో, లోక జనశక్తి పార్టీ 1 స్థానంలో పోటీ చేశాయి. ఫైనల్‌గా చూస్తే లోయలోని 40 సీట్లలో కాంగ్రెసుకు 19 వచ్చాయి, బిజెపికి 16 వచ్చాయి. తృణమూల్‌కి 1, లోక్‌ జనశక్తి పార్టీకి 1, ఎన్‌పిపికి 2, స్వతంత్రుడికి 1 వచ్చాయి. ఇక పర్వత ప్రాంతాల్లో వున్న 20 సీట్లలో కాంగ్రెసుకు 9, బిజెపికి 5, ఎన్‌పిఎఫ్‌కు 4, ఎన్‌పిపికి 2 వచ్చాయి. 

కాంగ్రెసు ముఖ్యమంత్రిగా మూడు దఫాలుగా వున్న ఇబోబి సింగ్‌ నాలుగోసారి కూడా గెలిచాడు. అతనితో బాటు ఉపముఖ్యమంత్రి కూడా. 2012లో 42.8% ఓట్లు 42 సీట్లు తెచ్చుకున్న కాంగ్రెసు యీసారి 35.1% ఓట్లు 28 సీట్లు మాత్రమే తెచ్చుకుంది. పదిహేనేళ్లగా ప్రభుత్వంలో వుండి ప్రభుత్వ వ్యతిరేకత మూట గట్టుకున్నా, ఓట్ల సంఖ్యగా చూస్తే 2012లో 5.93 లక్షల ఓట్లు వస్తే యీసారి 5.82 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెసు ఏడు జిల్లాలు కొత్తగా ఏర్పరచి లబ్ధి పొందుదామని చూసింది కానీ వాటిలో వున్న 11 నియోజకవర్గాల్లో గతంలో 9 గెలిస్తే యీసారి ఆరే గెలిచింది. మూడు బిజెపికి, ఒకటి ఎన్‌పిఎఫ్‌కు, స్వతంత్రుడికి 1 వెళ్లాయి. ఈ విధంగా చూస్తే ఉత్తరాఖండ్‌ అంత అన్యాయంగా కాంగ్రెసు ఓడిపోలేదు. కానీ యీ ఐదేళ్లలో బిజెపి బ్రహ్మాండంగా పుంజుకుంది. 2012లో 19 సీట్లలో పోటీ చేసిన బిజెపి 2.12% ఓట్లు తెచ్చుకుంది కానీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కొంతకాలానికి తృణమూల్‌ ఎమ్మెల్యే పార్టీలో చేరి, రాజీనామా చేసి ఉపయెన్నికలో నెగ్గి ఏకైక బిజెపి ఎమ్మెల్యేగా అవతరించాడు. మరి యీసారి బిజెపి కాంగ్రెసు కంటె 1.2% ఎక్కువగా 36.3% ఓట్లు తెచ్చుకుని 21 సీట్లు గెలిచింది. బిజెపికి 35% ఎక్కువ ఎలా వచ్చాయన్న సందేహం రావచ్చు. కాంగ్రెసు నుంచి 7%, తృణమూల్‌ నుంచి 15.5% (గతంలో 17%, యిప్పుడు 1.4%) ఇతరుల నుంచి 12% (గతంలో 27% యిప్పుడు 15%) లలో సింహభాగం లాక్కోగలిగింది. కాంగ్రెసు ఎన్ని ఛాలెంజ్‌లు విసిరినా బిజెపి బదులు చెప్పకుండా మణిపూర్‌ ప్రయోజనాలపై రాజీ పడలేదని మాత్రమే చెప్పింది. చివరకు నాగా పార్టీల మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

నిజానికి నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పిఎఫ్‌)కి 2012లో నాలుగు సీట్లు వచ్చాయి. ఈ సారి ఇంకో నాలుగు ఎక్కువ వస్తాయనుకుంటూ 16 సీట్లకు పోటీ చేసింది. కానీ బిజెపి 5 సీట్లు పట్టుకుపోవడంతో మళ్లీ నాలుగే వచ్చాయి. 4 సీట్లు గెలిచిన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పిపి) పార్టీని చాలాకాలం కాంగ్రెసులో వున్న మేఘాలయా నాయకుడు పిఏ సంగ్మా స్థాపించాడు. ఇప్పుడు అతని కొడుకు కాన్రాడ్‌ సంగ్మా దానికి అధినేత. అది ఈశాన్య రాష్ట్రాల కాంగ్రెసేతర పక్షాలతో ఏర్పడిన నార్త్‌-ఈస్ట్‌ డెమోక్రాటిక్‌ ఎలయన్స్‌లో భాగం. బిజెపి నాయకుడు హిమాంత శర్మ దానికి కన్వీనరు. ఎన్‌పిఎఫ్‌, ఎన్‌పిపిలతో బాటు ఎన్‌డిఏలో భాగస్వామి ఐన లోక జనశక్తి పార్టీ ఎమ్మెల్యేను పోగేశారు. అలా అయినా 30 మాత్రమే అయ్యారు. మెజారిటీ కావాలంటే యితర పార్టీలవైపు చూడక తప్పలేదు. తృణమూల్‌ ఏకైక ఎమ్మెల్యే కరన్‌ శ్యామ్‌ను, మరొక స్వతంత్ర సభ్యుణ్ని పోగేశారు. కాంగ్రెసు ఎమ్మెల్యే శ్యామ్‌ కుమార్‌ పార్టీ ఫిరాయించడంతో 33కి చేరింది. 44 కాంగ్రెసు ఎమ్మెల్యేలలో 43 మందిని ఫిరాయింపుకు ప్రోత్సహించి అరుణాచల్‌ ప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పరచిన బిజెపి యిక్కడా అదే పద్ధతిని నమ్ముకుంది. గవర్నరు మెజారిటీ పార్టీని కాకుండా బిజెపిని పిలిచారు. ముఖ్యమంత్రితో బాటు 12 మంది మంత్రులకు ఛాన్సుండగా మొదటి విడత, రెండవ విడత కలిపి యిప్పటివరకు 11 మందిని తీసుకున్నారు. వారిలో బిజెపికి 4, ఎన్‌పిపికి 4, (అంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ మంత్రులే) ఎన్‌పిఎఫ్‌కి 1, ఎల్‌జెపికి 1, కాంగ్రెసు నుంచి వచ్చినతనికి మంత్రి పదవులు 1 దక్కాయి. కాంగ్రెసునుంచి వచ్చినతని వ్యవహారం మన తలసాని లాగానే వుంటుంది కాబోలు. ఉపయెన్నికకు ఎదుర్కోకుండా స్పీకరు వద్ద రాజీనామా లేఖ పడేసి వుంచుతారు. స్పీకరు ఎన్నాళ్లయినా దానిపై చర్య తీసుకోడు. ఈ అతుకుల బొంతను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కొత్త ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌పై వుంది. 

ఇక గోవాకు వస్తే – ఇక్కడా కాంగ్రెసుకు 43% సీట్లు వస్తే బిజెపికి దాని కంటె 10% తక్కువగా 33% సీట్లు వచ్చాయి. అయినా అంతిమంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. మణిపూర్‌లో బిజెపి విపక్షమైతే, యిక్కడ అధికారపక్షం. అక్కడి కంటె ప్రభుత్వ వ్యతిరేకత యిక్కడ బలంగా వుండటం చేత ముఖ్యమంత్రి, అతనితో బాటు 6 గురు మంత్రులు ఓడిపోయారు. అయితే రాష్ట్రం మొత్తం మీద ఓట్ల శాతం చూసుకుంటే బిజెపి పరిస్థితి మరీ అంత చేటుగా లేదు. 2012లో 21 సీట్లు, 35% ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీ యిప్పుడు 33% తెచ్చుకుంది. మధ్యలో 2014లో 54% తెచ్చుకుంది. ఆ లెక్కనైతే 33 సీట్లు గెలవాలి. కానీ యిప్పుడు 13 మాత్రమే గెలిచింది. అంటే మోదీ హవా యిక్కడ పని చేయలేదనే చెప్పాలి. కాంగ్రెసు 30% ఓట్లతో 2012లో 9 తెచ్చుకుంటే యిప్పుడు 28% ఓట్లతో 17 తెచ్చుకుని అతి పెద్ద పార్టీగా నిలిచింది. గోవా చిన్న రాష్ట్రం. రాజకీయ అస్థిరత ఎక్కువ కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకై చిన్నా, చితకా పార్టీలపై ఆధారపడవలసి వస్తూంటుంది. అది తెలిసి ఆ పార్టీలు ఎన్నికలకు ముందు ఒప్పందాలు కుదుర్చుకోవు. నెగ్గాక తమ చేతిలో వున్న ఒకటి, రెండు సీట్లూ చూపించి బేరాలాడుతూ వుంటాయి. మహారాష్ట్ర గోమంతక్‌ పార్టీ (ఎంజిపి) బిజెపికి సన్నిహితమైన పార్టీ. అయినా 2016లో దూరమైంది. ఎన్నికలకు ముందు బిజెపితో పొత్తు పెట్టుకోలేదు.  ఈసారి ఓట్లు 4% పెరిగాయి కానీ సీట్లు పెరగలేదు. 34 సీట్లలో పోటీ చేసి 3 గెలిచి యిప్పుడు కొత్త కాబినెట్‌లో 2 మంత్రి పదవులు సంపాదించుకుంది. విజయ్‌ సర్దేశాయి స్థాపించిన గోవా ఫార్వర్డ్‌ పార్టీకి (జిఎఫ్‌పి) దక్షిణ గోవాలో పలుకుబడి వుంది. అది కాంగ్రెసుతో బేరాలాడుకుంది. వాళ్ల నియోజకవర్గాలలో పోటీ పెట్టనని మాట యిచ్చిన కాంగ్రెసు చివరి నిమిషంలో మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టింది కానీ గెలిపించుకోలేక పోయింది. 4 స్థానాల్లో పోటీ చేసి 3 గెలిచిన జిఎఫ్‌పి బిజెపి వైపు మరలిపోయి రెండు మంత్రి పదవులు సంపాదించుకుంది. నేషనలిస్ట్‌ కాంగ్రెసు పార్టీ (ఎన్‌సిపి) 18 సీట్లలో పోటీ చేసి ఒకటే గెలుచుకుంది. 

బిజెపి వైఫల్యానికి కారణం మనోహర్‌ పారికర్‌ వారసుడిగా వచ్చిన లక్ష్మీకాంత్‌ పార్శేకర్‌కు నాయకత్వ లక్షణాలు లేకపోవడం అంటున్నారు. దానికి తోడు అభివృద్ధి చేస్తామని బిజెపి చేసిన వాగ్దానాలు చెల్లించుకోలేక పోయింది. గనుల అక్రమ తవ్వకాలు, మాదకద్రవ్యాల సరఫరా, ఎలక్ట్రానిక్‌ సిటీ పేర భూఆక్రమణ యిత్యాది ఆరోపణలు ప్రభుత్వాన్ని దెబ్బ తీశాయి. ఉత్తర గోవాలోని మండోవీ నదిపై వున్న కాసినోలను మూయించేస్తానని, కనీసం వాటి సంఖ్య తగ్గిస్తామన్న వాగ్దానం విఫలమైంది. వాటి సంఖ్య తగ్గించకపోగా కొత్తగా లైసెన్సులు యిచ్చారు. ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెసు నాయకుడు ప్రతాప్‌ సింగ్‌ రాణేకు సమర్థ పాలకుడిగా పేరుంది. అతను 2007 నుంచి రాజకీయాల్లోంచి తప్పుకున్నాడు. అతని తర్వాత వచ్చిన దిగంబర్‌ కామత్‌ కాబినెట్‌లోని మంత్రుల అవినీతి వివాదాల కారణంగా 2012లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు కాంగ్రెసు రాణేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపింది. అది కొంతమేరకు ఫలించింది. అతనితో బాటు కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రులైన రవి నాయక్‌, దిగంబర్‌ కామత్‌, లూయిజిన్‌హో ఫెలీరో కూడా గెలిచి ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. అత్యధిక సీట్లు గెలిచిన పార్టీగా గవర్నరు వద్దకు వెళ్లి తమను పిలవమని అడగాల్సిన తరుణంలో దిగ్విజయ్‌ సింగ్‌ పార్టీ సమావేశం ఏర్పాటు చేసినపుడు యీ నలుగురు నేనంటే నేనని పోటీ పడడంతో, ఎటూ తేల్చుకోలేక కాంగ్రెసు తాత్సారం చేసింది. ఆ అవకాశాన్ని బిజెపి వినియోగించుకుని మనోహర్‌ పారికర్‌ను పంపి జిఎఫ్‌, ఎంజిపిలతో బాటు ముగ్గురు ఇండిపెండెంట్లనూ కూడగట్టుకుని గవర్నరు వద్దకు వెళ్లి  లేఖ యిచ్చేసింది. ఇప్పుడు యిద్దరు యిండిపెండెంట్లకు మంత్రి పదవులు దక్కాయి. 

హంగామా చేసి కూలబడినవారిలో ఆప్‌ ప్రథమస్థానంలో నిలుస్తుంది. కాంగ్రెసు 37 స్థానాల్లో, బిజెపి 36 స్థానాల్లో నిలబడగా, ఆప్‌ మొత్తం 40 స్థానాల్లోనూ నిలబడింది. ఎల్విస్‌ గోమ్స్‌ అనే అతన్ని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అతనితో సహా అందరూ ఓడిపోయారు. 38 చోట్ల డిపాజిట్టు పోయింది. మొత్తం మీద 6% ఓట్లు తెచ్చుకున్నా చాలా చోట్ల నోటా కంటె ఆప్‌ అభ్యర్థికి ఓట్లు తక్కువ వచ్చాయి. 1.2% ఓట్లు నోటాకు పడ్డాయి. సందడి చేసినవారిలో ఆరెస్సెస్‌ తిరుగుబాటుదారు సుభాష్‌ వెలింగ్‌కర్‌ ఒకరు. గోవా సురక్షా మంచ్‌ పేర 6 సీట్లలో పోటీ చేసి, కొన్ని చోట్ల బిజెపి ఓట్లు  చీల్చగలిగాడు కానీ స్వయంగా ఒక్కటీ గెలవలేకపోయాడు. బిజెపికి 2012తో పోలిస్తే 2.2% ఓట్లు తగ్గాయి, కాంగ్రెసుకు 2.4% తగ్గాయి. అయినా సీట్ల విషయానికి వస్తే బిజెపికి 8 తగ్గితే కాంగ్రెసుకు 8 పెరిగాయి. మనోహర్‌ పారికర్‌ వచ్చి ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. చివరకు ఏదోలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అతన్నే ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు.  అతనే ఎంజిపిని, జిఎఫ్‌పిని, స్వతంత్రులను బిజెపివైపు తిప్పాడుట. కాంగ్రెసు నుంచి మరో ఆరుగుర్ని కూడా ఫిరాయింపచేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెసు నుంచి ముగ్గుర్ని తీసుకుని వాళ్లకు టిక్కెట్లిచ్చింది బిజెపి. వాళ్లు గెలిచారు కానీ ముందు నుంచి వున్న బిజెపి కార్యకర్తలకు అసంతృప్తి కలిగింది. కొంకణ ప్రాంతంలోని హిందువులు బిజెపికి ఎప్పుడూ ఓటేస్తూ వచ్చారు. కానీ బిజెపి కొంకణి భాష కంటె ఇంగ్లీషుకే ఎక్కువ ప్రాధాన్యత యిస్తోందని భావించి వాళ్లు ఎంజిపి వైపు మరలిపోయారు. యుపిలో కేవలం హిందూ అభ్యర్థులనే నిలిపిన బిజెపి గోవా వచ్చేసరికి కాథలిక్‌ అభ్యర్థులను కూడా నిలిపింది. అంతిమంగా చూస్తే నెగ్గిన 13 మంది బిజెపి ఎమ్మెల్యేలలో 7 గురు కాథలిక్కులు కాగా హిందువులు ఆరుగురే!

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌
[email protected]