సినిమా రివ్యూ: నగరం

రివ్యూ: నగరం Advertisement రేటింగ్‌: 3/5 బ్యానర్‌: పొటెన్షియల్‌ స్టూడియోస్‌ తారాగణం: సందీప్‌ కిషన్‌, శ్రీ, రెజీనా, చార్లీ, మధుసూదన్‌, మునీష్‌కాంత్‌ తదితరులు కూర్పు: ఫిలోమిన్‌ సంగీతం: జావెద్‌ రియాజ్‌ ఛాయాగ్రహణం: సెల్వకుమార్‌ ఎస్‌కె…

రివ్యూ: నగరం

రేటింగ్‌: 3/5

బ్యానర్‌: పొటెన్షియల్‌ స్టూడియోస్‌

తారాగణం: సందీప్‌ కిషన్‌, శ్రీ, రెజీనా, చార్లీ, మధుసూదన్‌, మునీష్‌కాంత్‌ తదితరులు

కూర్పు: ఫిలోమిన్‌

సంగీతం: జావెద్‌ రియాజ్‌

ఛాయాగ్రహణం: సెల్వకుమార్‌ ఎస్‌కె

నిర్మాణం: పొటెన్షియల్‌ స్టూడియోస్‌

రచన, దర్శకత్వం: లోకేష్‌ కనకరాజ్‌

విడుదల తేదీ: మార్చి 10, 2017

    'ఎవరికైనా సాయపడితే మనకి ఇంకొకరు సాయం చేస్తారు' అనే సందేశాన్ని సునిశితంగా చెబుతుంది 'నగరం'. ఎవరి జీవితాలతో వాళ్లు బిజీగా వుండే మహా నగరంలో ఎవరికి ఎవరు ఏమీ కాని ఓ నలుగురి కథ. అయితే ఈ కథలన్నీ వారి ప్రమేయం లేకుండానే ముడి పడతాయి. సమాంతరంగా సాగే నలుగురి కథలు ఒకచోటికి ఎలా చేరతాయి, ఎలాగ ముగుస్తాయి అన్నది ఈ చిత్రం ఇతివృత్తం. 'యువ', 'వేదం' తదితర చిత్రాల్లో చూసిన తరహా కథనమే కానీ ఇది చెన్నయ్‌ క్రైమ్‌ వరల్డ్‌ నేపథ్యంలో సాగుతుంది.  

    కథనం కొత్తగా సాగినా కానీ, ప్రధానంగా 'నగరం' మంచి, చెడు మధ్య జరిగే పోరాటం. అంతిమంగా చెడుపై మంచి ఎలా విజయం సాధించిందనే సగటు థియరీనే ఫాలో అవుతుంది నగరం. చాలా తమిళ చిత్రాల్లో కనిపించినట్టే పాత్రల్ని అత్యంత సహజంగా చూపించడం ఇందులోని ప్రత్యేకత. కథలో హీరోలంటూ ఎవరూ వుండరు. వాళ్లకంటూ ఐడెంటిటీ వుండదు. అందుకే ఆ పాత్రలకి పేర్లు కూడా పెట్టలేదు. 

    ఆ ఊరిలో అందరికీ తెలిసినవాడంటూ వుంటే పికె ప్రసాద్‌ (మధుసూదన్‌) అనే పెద్ద రౌడీ. ఎవరి పిల్లాడినో కిడ్నాప్‌ చేయబోయి అనుకోకుండా పికెపి కొడుకుని ఎత్తుకొచ్చేస్తారో గ్యాంగ్‌. తప్పయిపోయిందని చెప్పినా తమని చంపేస్తాడు కనుక పొరపాటున జరిగిన కిడ్నాప్‌నే నిజం చేసి కోటి రూపాయలు డిమాండ్‌ చేస్తారు. ఈ క్రైమ్‌కి తమ ప్రమేయం లేకుండానే వచ్చి కనక్ట్‌ అవుతారు ముగ్గురు సగటు మనుషులు. 

    అప్పుడే ఉద్యోగం కోసం వచ్చిన యువకుడిని (శ్రీ) ఎవరో అనుకుని కొట్టి పారేసి, అతని దగ్గరున్న సర్టిఫికెట్ల బ్యాగ్‌ ఎత్తుకుపోతారు. తను ప్రేమించిన అమ్మాయిపై (రెజీనా) యాసిడ్‌ పోస్తానని బెదిరించిన వాడి మీదే యాసిడ్‌ దాడి చేస్తాడో కుర్రాడు (సందీప్‌ కిషన్‌). ఆ యాసిడ్‌ ఎటాక్‌కి ప్రత్యక్ష సాక్షి అయిన శ్రీ వల్ల సందీప్‌ పోలీసులకి చిక్కుతాడు. కారు నడుపుకోవడానికి వచ్చిన ఒక డ్రైవర్‌కి (చార్లి) శ్రీ సర్టిఫికెట్లు దొరుకుతాయి. అది తీసుకెళ్లి పోలీసులకి ఇస్తాడు. ఆ ఎస్‌ఐతో ఆల్రెడీ ఒకసారి వాగ్వాదానికి దిగడం వల్ల శ్రీ సర్టిఫికెట్లని అతను అందజేయడు. సందీప్‌కి ఆ ఎస్‌ఐ బాబాయ్‌ అవుతాడు. ఇలా అన్నీ ఇంటర్‌లింక్‌ అయి సాగే ఈ కథనం క్రైమ్‌, గ్యాంగ్‌స్టర్స్‌, బ్యాడ్‌ పోలీస్‌ లాంటి అంశాల వల్ల థ్రిల్‌ ఇస్తుంది. 

    నాలుగు కథలు సమాంతరంగా నడుస్తున్నా, ఒక సీన్‌లోంచి కట్‌ అయి మరో సీన్‌లోకి వెళ్లి, మళ్లీ అక్కడ కట్‌ ఇంకో కథలోకి వెళుతున్నా కానీ ఎక్కడా కన్‌ఫ్యూజన్‌ వుండదు. సంఘటనలు కాకతాళీయంగా జరుగుతున్నప్పటికీ బలవంతంగా ఫ్లో కోసం ఇరికించినట్టు అనిపించవు. స్క్రీన్‌ప్లే వరకు దర్శకుడు చాలా చాకచక్యంగా రాసుకున్నాడు. సినిమాలో 'అండర్‌లైన్‌' చేసిన ప్రతి అంశం (ఉదాహరణకి క్యాబ్‌ డ్రైవర్‌ కారు వెనుక పికెపి పేరు) ఎక్కడో ఒక చోట లింక్‌ అవుతూ ప్రేక్షకులని మరింతగా లీనం చేస్తుంది. 

    పకడ్బందీ కథనం రాసుకున్నప్పటికీ వినోదం కోసం పెట్టిన కామెడీ కిడ్నాపర్‌ క్యారెక్టర్‌ (మునీష్‌కాంత్‌) ఓవర్‌ చేసిన ఫీలింగ్‌ వస్తుంది. బహుశా మరెవరైనా సీజన్డ్‌ యాక్టర్‌ అయితే ఆ క్యారెక్టర్‌కి న్యాయం చేసి వుండేవాడేమో. అలాగే రెజీనా, సందీప్‌ల లవ్‌స్టోరీలోను ఫ్రెష్‌నెస్‌ లేదు. మెయిన్‌ క్యారెక్టర్స్‌లో శ్రీ ఒక్కడే స్ట్రగుల్‌ అవుతుంటాడు కానీ మిగిలిన వాళ్లకి కనక్ట్‌ కాగలిగే, కదిలించే ఎమోషన్స్‌ లేకపోవడం ఒకింత వెలితిగా తోస్తుంది. అలాగే కొన్ని సన్నివేశాలు సుదీర్ఘంగా సాగుతుంటాయి. కథనం బిగి సడలకుండా సాగినప్పటికీ వేగంగా నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. 

    ప్రధాన నటీనటవర్గం అంతా బాగా చేసింది. సందీప్‌ కిషన్‌ షార్ట్‌ హెయిర్‌తో టఫ్‌గా కనిపించాడు. శ్రీ అసహాయ యువకుడి పాత్రకి బాగా సూట్‌ అయ్యాడు. చార్లీ కూడా సహజ నటనతో మెప్పించాడు. రెజీనాకి ఎక్కువ స్కోప్‌ లేదు కానీ వున్నంతలో బాగానే చేసింది. మధుసూదన్‌ తన వంతు సహకారం అందించాడు. మునీష్‌కాంత్‌ ఓవరాక్షన్‌ చేసాడు. టెక్నికల్‌గా ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయిలో తెరకెక్కించారు. వాస్తవ పరిస్థితులకి అద్దం పట్టేలా ప్రొడక్షన్‌ డిజైన్‌, సినిమాటోగ్రఫీ ప్రత్యేక మన్ననలు అందుకుంటాయి. నేపథ్య సంగీతం, ఎడిటింగ్‌ నైపుణ్యం ఈ చిత్రానికి పెద్ద బలాలయ్యాయి. చిన్న సినిమా అనే భావన రానీయకుండా క్వాలిటీ ప్రోడక్ట్‌ని అందించారు. 

    దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌లో టాలెంట్‌ పుష్కలంగా వుందని ఈ చిత్రాన్ని అతను మలిచిన తీరే చెబుతుంది. అయితే అతనిలోని సెన్సిబులిటీస్‌ తెలియజెప్పే సీన్స్‌ కొన్ని స్ట్రయికింగ్‌గా అనిపిస్తాయి. బార్‌లో వుండగా ఒక అపరిచితుడు వచ్చి పర్సు పోయిందంటూ ఒక పది రూపాయలు అడిగితే శ్రీ ఇవ్వబోతాడు. కానీ 

అతని స్నేహితుడు వారించి ఇలాంటి వాళ్లని నమ్మవద్దంటాడు. కట్‌ చేస్తే… శ్రీ దగ్గరున్నవి అన్నీ లాక్కుని రోడ్డుపై కొట్టి పడేస్తారు. ఉదయం లేచేసరికి అతనికి చేతిలో పైసా వుండదు. ఫోన్‌ చేసుకోవడానికి టీ కొట్టు వ్యక్తిని రూపాయి సాయం అడుగుతాడు. ఆ ముందు సీన్‌ని గుర్తు చేసేదంటూ ఏమి వుండదు కానీ, ఆ డబ్బులడిగిన వ్యక్తి కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉండి వుండవచ్చు కదా అనే సటిల్‌ హింట్‌ ఇస్తాడు దర్శకుడు. ఇలాంటి వాటికి తోడు సహజంగా వుండే పాత్రలు, పరిస్థితులతో పాటు ఆకట్టుకునే కథనం, రొటీన్‌కి భిన్నమైన నేపథ్యం నగరంలో ఆడుతున్న చిత్రాల మధ్య దీనిని ప్రత్యేకంగా నిలబెడతాయి. విభిన్నమైన చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులు సందర్శించాల్సిన నగరమిది. 

బాటమ్‌ లైన్‌: వర్త్‌ విజిటింగ్‌!

– గణేష్‌ రావూరి