సినిమా రివ్యూ: నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌

రివ్యూ: నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌ రేటింగ్‌: 2.25/5 బ్యానర్‌: లక్కీ మీడియా తారాగణం: హెబా పటేల్‌, రావు రమేష్‌, అశ్విన్‌, నోయల్‌ షాన్‌, పార్వతీశం, సన, కృష్ణభగవాన్‌, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర,…

రివ్యూ: నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌
రేటింగ్‌: 2.25/5
బ్యానర్‌:
లక్కీ మీడియా
తారాగణం: హెబా పటేల్‌, రావు రమేష్‌, అశ్విన్‌, నోయల్‌ షాన్‌, పార్వతీశం, సన, కృష్ణభగవాన్‌, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, ధన్‌రాజ్‌, రాజ్‌ తరుణ్‌ (అతిథి పాత్రలో) తదితరులు
కథ: సాయికృష్ణ బి.
కథనం, మాటలు: ప్రసన్నకుమార్‌ బెజవాడ
సంగీతం: శేఖర్‌చంద్ర
కూర్పు: చోటా కె. ప్రసాద్‌
ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్‌
దర్శకత్వం: భాస్కర్‌ బండి
విడుదల తేదీ: డిసెంబరు 16, 2016

ఒక హీరో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లతో ప్రేమలో పడడం అనేది చాలా సినిమాల్లో చూసినదే. వెరైటీగా ఒక హీరోయిన్‌ ముగ్గురితో ప్రేమలో పడితే ఎలాగుంటుంది అనే కాన్సెప్ట్‌తో 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌' తెరకెక్కించారు. ఐడియా విప్లవాత్మకంగానే వుంది. సరిగ్గా తీస్తే యువత గంగవెర్రులెత్తి చూసే సినిమానే అయి వుండేది. కానీ ఐడియాకి తగ్గ ఎగ్జిక్యూషన్‌ కొరవడింది. ముగ్గురిని ఎంచుకోవడానికి గల కారణం కానీ, ఆ ముగ్గురితో ప్రేమలో పడడం కానీ, చివరకు ఆ ముగ్గురి నుంచి విడిపోవడం కానీ ఏదీ కన్విన్సింగ్‌గా లేదు. హీరోయిన్‌ లక్కీ నంబర్‌ మూడు కనుక అన్నిట్లో మూడు ఉండేట్టు చూసుకుంటుందట. దీనికి సంబంధించి కథలో ఉపోద్ఘాతం బాగానే ఇచ్చుకుంటూ వచ్చారు. తనకి కాబోయే బాయ్‌ఫ్రెండ్‌ని ఎంచుకోవడానికి ఆమె ముగ్గురిని సెలక్ట్‌ చేసుకోవడం వెనుక లాజిక్‌ ఇదేనని మనం సరిపెట్టుకోవాలి.

ఇక ఇలాంటి ఐడియాలున్న కూతురిని తండ్రి మందలించడానికి లేదా బుద్ధి చెప్పడానికి వీలు లేకుండా ఆ పాత్రకీ ఒక లాక్‌ వేసి పారేసారు కన్వీనియంట్‌గా. నీకు, నీ కూతురికీ మధ్య సఖ్యత ఉండదు, మీరిద్దరూ శత్రువులు అయిపోతారని జ్యోతిష్యుడు చెప్తే, ఆమె ఇష్టాన్ని ఏ విషయంలోను కాదనకూడదని ఆ తండ్రి కూతురు పుట్టినప్పుడే ఫిక్స్‌ అయిపోతాడు. దీని వల్ల ఆమె ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్‌ని మెయింటైన్‌ చేసినా అతనేం అనడని, కూతురిపై అతనికి అంతులేని ప్రేమ అని మనకి మనమే సర్ది చెప్పుకోవాలి. 

బాయ్‌ఫ్రెండ్‌ కోసం ముగ్గురిని ఎంచుకుంటుంది హీరోయిన్‌. వారిలో ఒకడు బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌, మరొకరు కాబోయే పోలీస్‌. మరొకరు గుడిలో పూజారి. 

వీరిలో ఒకరిని ఇంప్రెస్‌ చేయడానికి తనమీద రేప్‌ అటెంప్ట్‌ జరుగుతున్నట్టు హీరోయిన్‌ సీన్‌ క్రియేట్‌ చేస్తుంది (గ్రేట్‌ ఐడియా కదూ). ఉమనైజర్‌, ఫ్లర్ట్‌ అయిన మరొకడ్ని పడేయడానికి అతని బెడ్‌రూమ్‌ వరకు వెళుతుంది (వారెవ్వా అనిపిస్తోంది కదూ). గుడి పూజారి ప్రేమలో పడిపోవడానికి పెద్దగా కారణాలు అక్కర్లేదని అనుకున్నారో ఏమో అతనికి పెద్ద సీన్‌ ఇవ్వలేదులెండి. ఈ మూడు ప్రేమలు పుట్టడానికి, పెరగడానికి ఎలాంటి బలమైన కారణాలుండవు. ముగ్గురిలో ఒకరినే సెలక్ట్‌ చేసుకోవడం కోసం పెట్టే పరీక్షలు కూడా కాలయాపనకి తప్ప కాలక్షేపానికి పనికి రావు. 

లెక్కకు మించిన పవన్‌కళ్యాణ్‌ రిఫరెన్సులు, అత్యంత పేలవమైన అంత్యాక్షరి కామెడీ సీను, పేలీ పేలని జోకులు, వెన్నెముక, వ్యక్తిత్వం లేని క్యారెక్టర్లతో పుణ్యకాలం మొత్తం గడిపేసి అవసరం కోసం ముందే రాసి పెట్టుకున్న నాన్నని ప్రీ క్లయిమాక్స్‌లో ఎదుటకి తీసుకొచ్చి నిలబెడతారు. కూతురిపై అపారమైన, వల్లమాలిన ప్రేమ కురిపించే ఈ తండ్రి ఆమె ఏం చేసినా కరెక్టేనంటాడు. ఆమె ముగ్గురిని ఎంచుకుంటే, వారిలో ఎవరిని చేసుకుంటుందో, ఏమిటోననే ఆదుర్దాతో వారందరూ కోరుకుంటోన్న ఉద్యోగాలు కూడా ఈయనే వేయించేస్తాడు (తండ్రి పాత్రల్లోనే మణిపూస కదూ). ముగ్గురిని ప్రేమించడం తప్పు కాదని, పొరపాటని ఏదో తోటకూర లాజిక్‌ కూడా చెప్తాడు. ప్రేమించిన వాళ్లు పొరపాటు చేస్తే ఆ పొరపాటు మీద కోపం రావాలి కానీ ప్రేమించిన వాళ్లమీద రాకూడదని లెక్చర్‌ ఇస్తాడు. 

ముగ్గురిని ప్రేమించడాన్ని సమర్ధించుకుంటూ హీరోయిన్‌ కూడా ఏకపాత్రాభినయం సీనొకటి చేస్తుంది. అంతమందిని పెళ్లి చూపులు చూసి ఒకరిని చేసుకోవడం లేదా, జీవితంలో ఆయా దశల్లో ఒక్కొక్కర్ని ప్రేమించడం తప్పు కానప్పుడు ఒకే టైమ్‌లో ముగ్గురిని ప్రేమించడం తప్పేంటన్నట్టు మాట్లాడుతుంది. ఇక ఆమె ప్రేమించిన ముగ్గురు బకరాలని మించిన బకరాని నేనేనంటూ చివర్లో మరో క్యారెక్టర్‌ ఎంట్రీ ఇస్తుంది. ఆమె ముగ్గుర్ని ప్రేమించడం చాలా రీజనబుల్‌ అన్నట్టు మాట్లాడుతుంది. ఈ తంతు చూసి, వీరందరి వితండం విని 'రేసు గుర్రం'లో అల్లు అర్జున్‌లా 'దా..వుడా' అనుకోవడం మినహా మనం చేయగలిగిందేమీ ఉండదు మరి. ఇలాంటి సినిమాలతో యువతకి, ముఖ్యంగా అమ్మాయిలకి ఎలాంటి ఐడియాలు ఇద్దామనుకుంటున్నారో తీసినోళ్లకే తెలియాలి.

ఇందులో చెప్పుకోతగ్గ అంశమేమిటంటే గీత దాటేయడానికి, బూతు సినిమా అనిపించడానికి స్కోప్‌ ఉన్న సబ్జెక్ట్‌ని అటువైపుగా మళ్లించకుండా నీట్‌గా తెరకెక్కించారు. నవ్వడం తప్ప మరో ఎక్స్‌ప్రెషన్‌ చేతకాని హెబా పటేల్‌, ఆమె ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్‌ ఈ చిత్రానికి ఎలాంటి బలం కాలేకపోయారు. లీడ్‌ యాక్టర్స్‌ బాగున్నట్టయితే, బాగా చేసినట్టయితే కొన్ని పేలవమైన సీన్లు కూడా పాస్‌ అయిపోతాయి. అందుకు చక్కని ఉదాహరణ రావు రమేష్‌. తన పాత్ర మాట్లాడేది, చేసేది అంతా నాన్సెన్స్‌ అన్నది తెలుస్తున్నా ఆయన కన్విన్సింగ్‌ పర్‌ఫార్మెన్స్‌తో చాలా వరకు సీన్లు పాస్‌ అయిపోయాయి. ఈ చిత్రానికి ప్లస్‌ పాయింట్స్‌ అంటూ ఉంటే అది రావు రమేష్‌ నటన, చోటా సినిమాటోగ్రఫీనే. 

సిద్ధార్థ్‌, ఏఎన్నార్‌ చేసిన 'చుక్కల్లో చంద్రుడు' కథనే ఇందులో హీరోయిన్‌ కోణంలో చెప్పారు. పలు సినిమాల్లో చూసిన ఉదాత్తమైన తండ్రి పాత్రని జోడించి అదే కథని మరో రకంగా చెప్పుకొచ్చారు. ఆరంభంలో కాస్త సరదాగానే అనిపించినా తర్వాత్తర్వాత చిరాకు పెడుతుంది. తాము చేస్తోన్న నాన్సెన్స్‌నే నోబుల్‌ కాన్సెప్ట్‌ అనుకోమన్నట్టు దానిని సమర్ధించుకోవాలని చూడడంతో పతాక సన్నివేశాలు పూర్తిగా పట్టాలు తప్పేసాయి. ఆకట్టుకునే టైటిల్‌, కలర్‌ఫుల్‌ ప్రమోషన్స్‌, కుమారి 21 ఎఫ్‌ ఫ్యాక్టర్‌ వల్ల ఈ చిత్రం యువతని థియేటర్లకి రాబట్టడంలో సక్సెస్‌ కావచ్చు కానీ వచ్చిన వారిలో మెజారిటీ ప్రేక్షకులని నిరాశ పరుస్తుంది. 

బాటమ్‌ లైన్‌: త్రీ మచ్‌!

గణేష్‌ రావూరి