అమ్మయినా, చిన్నమ్మయినా ఇదే భక్తి ఫోజు…!

తమిళనాడులో అన్నాడీఎంకే నాయకులు 'అమ్మ' జయలలితను అప్పుడే మర్చిపోయారా? గుర్తుంచుకున్నారా? ఆమె కోసం ఆవేదన చెందుతున్నారా? చెప్పలేం. రాజకీయ నాయకులు లోపల అన్నీ మర్చిపోయి లేదా వదిలేసి పైకి మాత్రం అందరికీ కనబడేలా ఆవేదన…

తమిళనాడులో అన్నాడీఎంకే నాయకులు 'అమ్మ' జయలలితను అప్పుడే మర్చిపోయారా? గుర్తుంచుకున్నారా? ఆమె కోసం ఆవేదన చెందుతున్నారా? చెప్పలేం. రాజకీయ నాయకులు లోపల అన్నీ మర్చిపోయి లేదా వదిలేసి పైకి మాత్రం అందరికీ కనబడేలా ఆవేదన చెందడం, కన్నీళ్లు పెట్టుకోవడం విచిత్రం కాదు. రాజకీయ నాయకులకు నటన అనేది వెన్నతో పెట్టిన విద్య అనేది అందరికీ తెలిసిందే.

'అమ్మ' జయలలిత కన్నుమూసి ఎన్నో రోజులు కాలేదు. కాని అప్పుడే ఆమెను మరిపించేలా ఈ నాయకులకు 'చిన్నమ్మ' దొరికింది. ఆమె జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ నటరాజన్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం పార్టీ రాజ్యాంగాన్ని కూడా సవరిస్తామంటున్నారు.

సామాన్య ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో ఎక్కువమంది శశికళను 'అమ్మ' స్థానంలో ఊహించుకోలేకపోతున్నారని, ఆ స్థాయి ఆమెకు లేదని అభిప్రాయపడుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి, మంత్రులు ఆమెను ప్రధాన కార్యదర్శిని చేయాలని కంకణం కట్టుకున్న నేపథ్యంలోనే కొందరు ఆమెపై పోరాటం ప్రారంభించారు. జయలలిత మరణానికి ఆమె కారణమని ఆరోపిస్తున్నారు. శవికళే ఉద్దేశపూర్వకంగా జయను చంపిందనే అభిప్ర్రాయం బలపడుతోంది.

జయ మేనకోడలు దీపా జయకుమార్‌, సినీ నటి గౌతమి, అన్నాడీఎంకే నుంచి జయలలిత బహిష్కరించిన రాజ్యసభ ఎంపీ శశికళ పుష్ప….ఇలా ఎందరెందరో జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జయలలిత మరణానికి సంబంధించి అన్ని విషయాలు బహిర్గతం చేయాలని, శ్వేతపత్రం విడుదల చేయాలని డీఎంకే నాయకుడు స్టాలిన్‌, పీఎంకే అధినేత డాక్టర్‌ రాందాస్‌ డిమాండ్‌ చేశారు.

జయ మరణంపై ఒక్క తమిళులకే కాదు, అక్కడ స్థిరపడిన తెలుగువారికీ అనుమానాలున్నాయి. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జదీశ్వరరెడ్డి న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. ప్రముఖ సంఘ సేవకుడు ట్రాఫిక్‌ రామస్వామి ఇదే పని చేశారు. జయకు వైద్యం చేసిన అపోలో ఆస్పత్రి ఛైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, దాని ఎండీ ప్రీతా రెడ్డితో పాటు శశికళకు నిజనిర్ధారణ పరీక్షలు చేయాలనే డిమాండ్‌ కూడా వచ్చింది. ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన 'జయలలితకు తప్పుడు ఔషధాలు ఇచ్చారు' అనే సమాచారం చాలా ముఖ్యమైంది. ఈ అనుమానం వ్యక్తం చేసింది  మామూలు వ్యక్తి కాదు. 

ప్రముఖ జర్నలిస్టు, ఎన్‌డీటీవీ ఛానెల్‌ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ బర్ఖాదత్‌. జయకు మధుమేహానికి ఇవ్వాల్సిన మందులు కాకుండా వేరే ఔషధాలు ఇచ్చినట్లు బర్ఖాదత్‌ తన యాజమాన్యానికి పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. ఓ ప్రముఖ జర్నలిస్టు తగిన ఆధారం లేకుండా ఈ సమాచారం పంపుతారా? జయ ఆస్పత్రిలో చేరినప్పటినుంచి జరిగిన పరిణామాలన్నింటినీ విశ్లేషించుకుంటే ఏదో జరిగిందని అనిపిస్తోంది. కాని అదేమిటనేది బయటకు వస్తుందా? అని ప్రశ్నించుకుంటే దానికి జవాబు దొరకడం కష్టం.

జయ అనారోగ్యం, చేసిన వైద్యం వివరాలు తొక్కిపెట్టే విషయంలో అనేకమంది హస్తం ఉంది. మరి ఏ ప్రయోజనాల కోసం ఈ పని చేశారో తెలియదు. 'మన్నార్‌గుడి మాఫియా'గా పేరున్న  శశికళే ప్రధాన సూత్రధారనే అనుమానాలు జనంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే, వ్యక్తి పూజకు, స్వామి భక్తికి, అతి వినయానికి బాగా అలవాటుపడిపోయిన అన్నా డీఎంకే నాయకులు జయలలితకు ఎలా సాగిలపడ్డారో శశికళకు అలాగే సాగిలపడుతున్నారు. అదే అతి వినయం ప్రదర్శిస్తున్నారు. వంగివంగి దండాలు పెడుతున్నారు. చేతులు నలుపుకుటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, నాయకులు, అధికారులు ఆమె ఉంటున్న పోయస్‌ గార్డెన్‌ ఇంటికి (జయ ఇల్లు) క్యూ కడుతున్నారు.

జయలలిత ఉన్నప్పుడూ ఇదే పని చేశారు. అంటే వ్యక్తి పూజ, అతి వినయం అనేవి అన్నాడీఎంకే నాయకుల రక్తంలోనే ఉందేమో….! వాస్తవానికి శశికళకు ఏం పదవి ఉంది? జయలలిత ఫ్రెండ్‌ అనే ఒక్క అర్హత తప్ప. ఈమెను మరో 'అమ్మ'ను చేసేందుకు నాయకులు తహతహలాడిపోతున్నారు. ఈ చిన్నమ్మ క్రమంగా 'పెద్దమ్మ'గా (ముఖ్యమంత్రిగా) అవతారం ఎత్తుతుందేమో చెప్పలేం. ఆమె లక్ష్యం అదే కదా. నాయకులు ఇప్పుడు ఆమెను ప్రధాన కార్యదర్శిగా చేసినా జయ నియోజకవర్గమైన ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నికలో శశికళ గెలుస్తుందా? అనేది అనుమానమే. ప్రస్తుతం రాష్ట్రంలో కుల రాజకీయాలు జడలు విప్పాయి. దీంతో శశికళ సామాజికవర్గాన్ని వ్యతిరేకిస్తున్న కమ్యూనిటీ దీపా జయకుమార్‌కు మద్దతు ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. శశికళ నాయకులకు అమ్మ అవుతుందేమోగాని ప్రజలకు 'అమ్మ' అవుతుందా?