రివ్యూ: నేను లోకల్
రేటింగ్: 3/5
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
తారాగణం: నాని, కీర్తి సురేష్, సచిన్ ఖేడేకర్, నవీన్ చంద్ర, పోసాని కృష్ణమురళి, తులసి, ఈశ్వరి రావు తదితరులు
కథ, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ
కూర్పు: ప్రవీణ్ పూడి
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఛాయాగ్రహణం: నిజర్ షఫి
నిర్మాత: దిల్ రాజు
కథనం, దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
విడుదల తేదీ: ఫిబ్రవరి 3, 2017
కూతుర్ని ప్రాణంగా చూసుకునే తండ్రి, తండ్రి మాట జవదాటని కూతురు… వీళ్లిద్దరి మధ్యలోకి ఎంటర్ అయి, వాళ్ల జీవితాల్ని మార్చేసే ఒక ఆకతాయి క్యారెక్టర్. అయిష్టంగానే ఆ ఆకతాయితో అమ్మాయి ప్రేమలో పడడం, ఆమె తండ్రి అడ్డు చెప్పడం, యోగ్యుడనుకున్న మరొకడితో పెళ్లి ఫిక్స్ చేయడం, ఆమె తండ్రిని మెప్పించడానికి ఈ ఆకతాయి కుర్రోడు ఒక పరీక్ష ఎదుర్కోవడం. తెలుగు సినిమా ప్రేమకథలకి ఇష్టమైన టెంప్లేట్ ఇది. ఈ ఫార్ములాతో వచ్చిన చాలా సినిమాలు సక్సెస్ అవడంతో ఇప్పటికీ దీనిని ఫాలో అవుతున్నారు. త్రినాధరావు నక్కిన గత చిత్రం 'సినిమా చూపిస్త మావా' కూడా ఈ ఫార్ములాతో బాక్సాఫీస్‌ని గెలిచినదే.
ఆ చిత్రానికి అన్నీ బడ్జెట్‌లో చేసుకోవాల్సి వస్తే, ఈసారి అతనికి దిల్ రాజు దొరికాడు. దాంతో తెరపైన, తెర వెనుక కూడా రేంజ్ ఉన్న వాళ్లు కుదిరారు. సినిమా చూపిస్త మావా ట్రీట్‌మెంట్ మరీ నాటుగా అనిపిస్తే, ఈసారి మాత్రం ఆ పాయింట్‌ని నీట్‌గా డీల్ చేసారు. 'నేను లోకల్' చూస్తుంటే ప్రతి సీన్‌లోను ఏదో ఒక సినిమా గుర్తుకొస్తుంది. హీరో ఆటిట్యూడ్, అతని ఫ్యామిలీ 'ఇడియట్'ని గుర్తు చేస్తే, హీరోయిన్ క్యారెక్టరైజేషన్, ఆమెకున్న కాన్‌ఫ్లిక్ట్ 'నువ్వే నువ్వే'ని తలపిస్తుంది. హీరోయిన్‌కి మరొకరితో పెళ్లి సెటిల్ అవడం, ఇరవై అయిదు రోజుల్లోగా హీరోయిన్ తండ్రి మనసుని హీరో గెలుచుకోవాల్సి రావడం లాంటివి చాలా చిత్రాల్లో చూసిన అంశాలే. ఇక 'సినిమా చూపిస్త మావా' ఛాయలైతే చాలానే వున్నాయి.
ఇన్ని సినిమాల కలబోత అయినపుడు ఫ్రెష్‌నెస్‌కి స్కోప్ లేదు. కాకపోతే ఆద్యంత వినోదాత్మకంగా మలచడంలో దర్శక, రచయితలు సక్సెస్ అయ్యారు. హీరో పరీక్షల ఎపిసోడ్ నుంచి, హీరోయిన్‌కి పెళ్లి చీర సెలక్ట్ చేసే ఘట్టం వరకు చాలా సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. కొన్ని సీన్లకి ఎక్స్‌పెక్ట్ చేసిన ఇంపాక్ట్ లేకపోయినా కానీ విసుగైతే పుట్టించవు. నాని టాప్ గేర్‌లో ఉండడంతో కథనం బలహీనపడ్డ ప్రతిసారీ తన నటనతో లాక్కొచ్చేసాడు. యాక్టింగ్ చేయడం ఇంత ఈజీనా అనిపించేంత తేలిగ్గా అన్ని పాత్రల్లోకి అవలీలగా ఇమిడిపోతున్న నాని కామెడీ టైమింగ్ ప్రతి సినిమాకీ ఇంకా ఇంకా బెటర్ అవుతోంది. డాన్సులు, ఫైట్లు కూడా స్టార్ హీరోలకి తీసిపోని విధంగా చేయగలనని చూపించాడు. మాస్‌ని ఆకట్టుకునే మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో నాని ఇందులో సరికొత్తగా కనిపిస్తాడు. తను ఉన్నాడనే నమ్మకంతో వెళ్లిన వాళ్లని అస్సలు డిజప్పాయింట్ చెయ్యడు.
ఫస్ట్ హాఫ్ టోటల్‌గా శాటిస్‌ఫై చేసింది కానీ ఇంటర్వెల్‌కి వచ్చిన ట్విస్ట్‌తోనే స్క్రీన్‌ప్లేకి బ్రేక్స్ పడ్డ ఫీలింగ్ వస్తుంది. అంత రొటీన్ కాన్‌ఫ్లిక్ట్ కాకుండా కనీసం ఏదైనా కొత్త పాయింట్‌తో రావాల్సింది. ఎప్పుడయితే హీరోయిన్ 'డిస్టర్బ్' అయి హీరోకి తన ఫీలింగ్స్ కన్వే చేసిందో అక్కడ్నుంచీ వినోదం కూడా తగ్గుముఖం పడుతుంది. ఆ టైమ్‌లో కామెడీ ఎపిసోడ్లు, నవ్వించే సంభాషణలతో ట్రాక్ తప్పకుండా కాపాడుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇరవై అయిదు రోజుల్లో హీరోయిన్ తండ్రిని ఇంప్రెస్ చేయడానికి ఒక్కటైనా మూమెంట్ దొరకదా అంటూ హీరో కాలక్షేపం చేస్తోంటే, ఇలా రాసుకుంటూ పోతుంటే క్లయిమాక్స్ టైమ్‌కి ఏదైనా ఒక ఐడియా రాదా అన్నట్టు రచయిత ఈ కథ రాసేసుకున్నాడనే భావన కలుగుతుంది.
పోలీస్‌గా నవీన్ చంద్ర ట్రాక్ ఏమంత ఎక్సయిటింగ్‌గా లేదు. హీరోని జైల్లో వేసినప్పుడు అతడికి ఇచ్చే రిటార్ట్ కూడా కన్విన్సింగ్‌గా అనిపించదు. ఒక్కసారి కనిపించి మాయమైన రావు రమేష్ మళ్లీ క్లయిమాక్స్‌లో వస్తాడని ముందే ఊహించవచ్చు. తన తండ్రి నోటితోనే 'నిన్ను పెళ్లిచేసుకోమని చెప్పించు' అని నానికి కీర్తి టార్గెట్ పెట్టినపుడు ఆ సీన్ బలంగా వుంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ పేలవమైన తీరులో దానిని ముగించారు. ఫక్తు టైమ్‌పాస్ చిత్రం కావడంతో ఒకటీ అరా బలహీనతలని పట్టించుకోనవసరం లేదు. నటీనటుల్లో సచిన్ ఖేడేకర్ ఓకే అనిపిస్తాడు. ఈ పాత్రలో ప్రకాష్‌రాజ్, రావు రమేష్‌లాంటి యాక్టర్‌ని మిస్ అవుతాం. నవీన్ చంద్ర ఉన్నంతలో బాగానే చేసాడు. కీర్తి సురేష్‌ది ఎక్స్‌ప్రెసివ్ ఫేస్. హావభావాలు ఈజీగా పలుకుతాయి. పోసాని తనదైన శైలిలో నవ్వించాడు.
తెర వెనుక దేవిశ్రీప్రసాద్ అండదండలతో ఈ చిత్రానికి మంచి సపోర్ట్ దొరికింది. నెక్స్‌ట్ ఏంటి, సైడ్ ప్లీజ్, అరెరె ఎక్కడ పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ అయింది. ప్రసన్నకుమార్ సంభాషణలు ఆకట్టుకుంటాయి. కామెడీ పంచ్‌లు బ్రహ్మాండంగా పేలాయి. సాంకేతికంగా చిత్రం ఉన్నతంగా వుంది. దిల్ రాజు నిర్మాణం కనుక క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. కథ కొత్తగా లేకపోయినా త్రినాధరావు నక్కిన ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా మలచిన తీరు అతని టాలెంట్‌కి అద్దం పడుతుంది. కామెడీపై ఉన్న గ్రిప్‌తో సాధారణ చిత్రాలతోనే ఫుల్ టైమ్‌పాస్ ఇవ్వగలుగుతున్నారు.
ముందే చెప్పినట్టు అనేక సినిమాల నుంచి కాపీ చేసిన సీన్లతో, క్యారెక్టర్లతో చేసిన సేఫ్ అటెంప్ట్‌లా అనిపించే ఈ చిత్రానికి నాని నటన, దేవిశ్రీప్రసాద్ పాటలు పెద్ద అడ్వాంటేజ్. యూత్‌కి కనక్ట్ అయ్యే క్యారెక్టర్లు, ఎపిసోడ్లు చాలానే ఉన్నాయి కనుక బాక్సాఫీస్ పరంగా దీనికి లోటేమీ జరగకపోవచ్చు. ప్రతి సినిమాతోను ఇంప్రెస్ చేస్తూ వస్తోన్న నాని నుంచి ఇది మరో డీసెంట్ ఎంటర్‌టైనర్.
బాటమ్ లైన్: నాని కేకల్!
గణేష్ రావూరి