సినిమా రివ్యూ: నెక్స్‌ట్‌ నువ్వే

రివ్యూ: నెక్స్‌ట్‌ నువ్వే రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: వి4 మూవీస్‌ తారాగణం: ఆది, బ్రహ్మాజీ, వైభవి, రష్మి, హిమజ, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, రఘు కారుమంచి, ఎల్బీ శ్రీరామ్‌, అవసరాల శ్రీనివాస్‌, పోసాని కృష్ణమురళి, పృధ్వీ…

రివ్యూ: నెక్స్‌ట్‌ నువ్వే
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: వి4 మూవీస్‌
తారాగణం: ఆది, బ్రహ్మాజీ, వైభవి, రష్మి, హిమజ, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, రఘు కారుమంచి, ఎల్బీ శ్రీరామ్‌, అవసరాల శ్రీనివాస్‌, పోసాని కృష్ణమురళి, పృధ్వీ తదితరులు
కూర్పు: ఉద్ధవ్‌
సంగీతం: సాయి కార్తీక్‌
ఛాయాగ్రహణం: కార్తీక్‌ పళని
నిర్మాత: బన్నీ వాస్‌
కథనం, దర్శకత్వం: ప్రభాకర్‌
విడుదల తేదీ: నవంబర్‌ 3, 2017

కనీసం వారం విడిచి వారానికొకటి అన్నట్టుగా తెలుగు చిత్ర పరిశ్రమ హారర్‌ కామెడీ సినిమాలని వెండితెరపై వడ్డిస్తూనే వుంది. ఇప్పటికే పీల్చి పిప్పి చేసేసిన ఈ జోనర్‌ నుంచి కొత్తగా ఏదైనా ఆశించడం అత్యాశే అవుతుంది. రెగ్యులర్‌ హారర్‌ కామెడీ సెటప్‌కి చిన్నపాటి ట్విస్ట్‌ ఇచ్చి నవ్వించిన 'ఆనందో బ్రహ్మ' తర్వాత 'రాజుగారి గది 2'లో రొటీన్‌ హారర్‌ కామెడీ సెటప్‌కి స్టార్స్‌ని జోడిస్తే అది బెడిసికొట్టింది. ఈ నేపథ్యంలో వచ్చిన మరో హారర్‌ కామెడీ 'నెక్స్‌ట్‌ నువ్వే'… మనకి బాగా తెలిసిన సెటప్‌కి ఎలాంటి కొత్తదనాన్ని ఇవ్వకపోగా, దెయ్యాలని చూసి కేకలు పెట్టే వారిని చూసి ఇంకోసారి నవ్వుకోండని అదే కామెడీని నెత్తిన రుద్దుతుంది.

'నెక్స్‌ట్‌ నువ్వే' ఒరిజినల్‌ స్టోరీ కూడా కాదు. 'యామిరుక్క బయమే' అనే తమిళ చిత్రానికి రీమేక్‌. ఆ తమిళ చిత్రాన్ని 'ది క్వయిట్‌ ఫ్యామిలీ' అనే కొరియన్‌ చిత్రం నుంచి కాపీ చేసారు. నాలుగయిదేళ్ల క్రితం వచ్చినట్టయితే ఈ 'నెక్స్‌ట్‌ నువ్వే' అలరించి వుండేదేమో కానీ, అదే పనిగా వచ్చి పడుతోన్న హారర్‌ కామెడీ చిత్రాల మధ్య ఇదీ ఒకటి అనిపిస్తుందే తప్ప ఎలాంటి ప్రత్యేకత లేదు. హారర్‌ చిత్రాల్లో కామెడీకి ఎక్కువ స్కోప్‌ ఇచ్చి క్యాష్‌ చేసుకునే ట్రెండ్‌లో భాగంగా దీనిని కూడా హ్యూమర్‌తో నింపాలని గట్టిగా ప్రయత్నించారు.

కానీ క్వాలిటీ కామెడీ కొరవడడంతో ఆ పరంగా ఎక్కువ స్కోర్‌ చేయలేకపోయింది. ఇక హారర్‌ ఎలిమెంట్స్‌తో భయపెట్టేంత సీన్‌ కూడా లేకపోయేసరికి ఏ దశలోను ఆకట్టుకోలేకపోయింది. పోస్టర్లలోనే 'లిటిల్‌ హారర్‌' అంటూ పేర్కొని ఆ ఎలిమెంట్‌కి వున్న స్కోప్‌ ఏంటనేది తేల్చేసారు కనుక అటునుంచి ఆశించడానికేం లేకపోయింది.

ఒక రౌడీ దగ్గర అప్పు చేసిన టీవీ సీరియల్‌ డైరెక్టర్‌ కిరణ్‌కి (ఆది) తన తండ్రి నుంచి తనకో ప్యాలెస్‌ సంక్రమించిందని తెలుస్తుంది. ఆ ప్యాలెస్‌ని రినవేట్‌ చేసి హోటల్‌ స్టార్ట్‌ చేస్తాడు. కానీ అక్కడికి వచ్చిన గెస్ట్‌లు వచ్చినట్టే చనిపోతూ వుంటారు. ఆ ప్యాలెస్‌కి ఓనర్‌ అయిన ఎవరూ బతకరని, ఆ ప్రకారం చనిపోయేది నెక్స్‌ట్‌ నువ్వే అని కిరణ్‌కి తెలిసినా కానీ తప్పించుకోలేడు. మరి ఆ సమస్య నుంచి అతను, అతనితో వున్న వారు ఎలా బయటపడతారనేది కథ.

ఈ తరహా చిత్రాల్లో కథానాయకుడి పాత్ర పోషించిన వారికి పెద్దగా చేయడానికి ఏమీ వుండదు… మిగతావారితో కలిసి భయపడడం తప్ప. కనుక ఆదికి ఈ చిత్రం చేయడం వల్ల నటుడిగా ఎలాంటి అదనపు గుర్తింపు రాదు. కామెడీ భారాన్ని ఎక్కువ శాతం మోసిన బ్రహ్మాజీనే హైలైట్‌ అయ్యాడు. ఇంతవరకు ఈ తరహా చిత్రాల్లో నటించకపోవడం వల్ల బ్రహ్మాజీ కామెడీ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. వైభవి కూడా హాహాకారాలు పెట్టడం మినహా 'హీరోయిన్‌'గా తనకంటూ ఎలాంటి ప్రత్యేకత లేదు. రష్మి గౌతమ్‌ మాత్రం 'సెడక్ట్రస్‌' పాత్రలో మాస్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. హిమజకి దెయ్యంగా మంచి క్యారెక్టర్‌ దక్కింది. అవసరాల శ్రీనివాస్‌, ఎల్బీ శ్రీరామ్‌, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు సపోర్టింగ్‌ రోల్స్‌ పోషించారు.

సాయి కార్తీక్‌ సౌండ్‌ ఎఫెక్ట్స్‌తో మెప్పించాడు కానీ సాంకేతికంగా మరే విధమైన ప్రత్యేకతలు లేవు. సంభాషణలు మరీ నాసిరకంగా, కొన్ని సార్లు నాన్సెన్సికల్‌గా వున్నాయి. ఈటీవీ ప్రభాకర్‌ చాలా మంది కొత్త దర్శకుల్లా హారర్‌ కామెడీ జోనర్‌ని మొదటి సినిమాకి ఎంచుకున్నాడు. అయితే ఈ బండి ఎక్కడం ఆలస్యం కావడంతో అతను చూపించిన హారర్‌ వినోదం అలరించలేకపోయింది. ఒకటీ అరా నవ్వించిన సీన్లున్నాయి కానీ దర్శకుడిగా తనని గుర్తించే అంశం ఏదీ లేకపోయింది. ఇకపై ఈ జోనర్‌ అటెంప్ట్‌ చేయాలనుకునే దర్శకులు ఖచ్చితంగా ఏదైనా కొత్తదనం వుంటేనే ట్రై చేయాలి తప్ప మనమూ ఒక రాయేసి చూద్దాం అన్నట్టుగా వ్యవహరించరాదని ఇది ఇంకోసారి ఎలుగెత్తి చెబుతుంది.

ప్రథమార్ధంలో శవాల కోసం గుంతలు తవ్వే సీన్లు, బ్రహ్మాజీ రియాక్షన్లు కాస్త నవ్వించినప్పటికీ ద్వితియార్థానికి వచ్చేసరికి మరీ రొటీన్‌ వ్యవహారంలా తయారై విసిగిస్తుంది. దెయ్యం తాలూకు ఫ్లాష్‌బ్యాక్‌ ఏదైనా ఎమోషనల్‌గా టచ్‌ చేసేదో లేక ఎంగేజ్‌ చేసేదో వుంటుందని అనుకుంటే అదంతా ఏమీ లేకపోగా, అసలు ఆమె ఎందుకు దెయ్యమయిందనే దానికి వివరణే లేకుండా సినిమా ముగిసిపోయింది. మామూలుగా ఇలాంటి సినిమాలన్నిటిలోను దెయ్యానికి ఆత్మ శాంతి చేసి అంతా హ్యాపీగా వుంటారు. కానీ ఈసారి దెయ్యాన్ని వదిలించేసుకోవడమే ముగింపు అన్నట్టు చూపించారు.

హారర్‌ కామెడీ జోనర్‌కి సంబంధించిన పోటీల్లో మారుతి, లారెన్స్‌, ఓంకార్‌ తదితర దర్శకులంతా తమ టాలెంట్‌ చూపించేయగా, నెక్స్‌ట్‌ నువ్వే అంటూ ప్రభాకర్‌ని స్టేజ్‌ ఎక్కిస్తే తనకి తోచినదేదో తీసాడు కానీ, తనకంటే ముందు పర్‌ఫార్మ్‌ చేసిన వారిలో చాలా మంది చేసినదే తిరిగి చేయడం వల్ల మెప్పించలేకపోయాడు. ట్రెండుని ఫాలో అవడంలో ఆలస్యం చేయడం వల్ల వచ్చే ఇబ్బందులివి. మరీ తీసికట్టు సినిమా అయితే కాదు కానీ థియేటర్‌కెళ్లి చూసేటంత సీన్‌ అయితే ఖచ్చితంగా లేదు. టీవీలోనో, యూట్యూబ్‌లోనో తీరిగ్గా చూస్తే కాస్తో కూస్తో కాలక్షేపం ఇవ్వగలదు. 

బాటమ్‌ లైన్‌: ట్రెండులో ఇంకొకటంతే!

– గణేష్‌ రావూరి