Advertisement

Advertisement


Home > Movies - Reviews

Om Bheem Bush Review: మూవీ రివ్యూ: ఓం బీమ్ బుష్

Om Bheem Bush Review: మూవీ రివ్యూ: ఓం బీమ్ బుష్

చిత్రం: ఓం బీమ్ బుష్
రేటింగ్: 2.75/5
తారాగాణం:
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్యా మీనన్, రచ్చ రవి తదితరులు 
సంగీతం: సన్నీ ఎమ్మార్ 
కెమెరా: రాజ్ తోట
ఎడిటింగ్: విజయ్ వర్ధన్ కావూరి 
నిర్మాత: సునీల్ బలుసు
కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హర్ష కొనుగంటి
విడుదల: 22 మార్చి, 2024

శ్రీవిష్ణు సినిమాలంటే బోర్ కొట్టించకుండా కూర్చోపెడతాయని, ఉన్నంతలో నవ్విస్తాయని ప్రేక్షకులకి ఒక నమ్మకం. దానికి తోడు ట్రైలర్ ఏమాత్రం ఆకట్టుకున్నా ఇదేదో పైసావసూల్ చిత్రమే అనే అంచనా ఏర్పడుతుంది. " ఓం బీమ్ బుష్" టైటిల్ గానూ, ట్రైలరుగానూ కూడా ఆకట్టుకుంది. ట్రైలర్లో వినిపించిన కొన్ని మాటల్ని బట్టి కాస్త అడల్ట్ డోస్ ఉందని తెలుస్తుంది. కానీ దీనికి "ఎ"సర్టిఫికేట్ కాకుండా "యు/ఎ" ఇవ్వడంతో కాస్తంత అభిప్రాయం మారడం సహజం. ఇంతకీ చిత్రంలో ఏముందో, ఏం లేదో, అంచనాలను ఎంతవరకూ అందుకుందో తెలుసుకుందాం. 

భైరవపురం అనే ఊరిలో రాత్రిపూట ఎవరో మాంత్రికుడు సంస్కృతంలో మంత్రాలు చదువుతూ క్షుద్రపూజ చేయడంతో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే హైదరాబాద్‌లోని ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ (శ్రీకాంత్ అయ్యంగార్) మీద సీన్ ఓపెనౌతుంది. 

కృష్ణ కాంత్ (శ్రీ విష్ణు), వినయ్ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) అనే ముగ్గురు స్టూడెంట్స్ అతని దగ్గర పీ.హెచ్.డి చేయడానికి వస్తారు. కానీ ఆ కాలేజీలో నానా రచ్చ చేసి అక్కడి నుంచి గెంటివేయబడి అనుకోకుండా భైరవపురం చేరతారు. 

అక్కడ "బ్యాంగ్ బ్రోస్" పేరుతో ఒక సైంటిస్ట్ షాప్ తెరవడం...సైన్సుని వాడుకుని నానా రకాల కామెడీ వైద్యాలు గట్రా చేసి ఆ ఊరి జనం నుంచి డబ్బులు సంపాదించడం వంటివి చేస్తుంటారు. ఆ ఊరి పెద్ద (ఆదిత్య మీనన్) కూతురు జలజ (ప్రీతి ముకుందన్) ప్రేమలో పడతాడు కృష్ణకాంత్. 

ఇదిలా ఉండగా తమ వ్యాపారానికి అడ్డొస్తున్నారని ఈ ముగ్గురు కుహనా సైంటిష్టులకి పబ్లిక్ గా ఒక చాలెంజ్ విసురుతాడు ఆ ఊరి క్షుద్రమాంత్రికుడు. ఆ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న సంపంగి అనే దెయ్యం ఉన్న కోటలోకి వెళ్లి అక్కడున్న గుప్తనిథులు తేవాలన్నది ఆ చాలెంజ్. అక్కడి నుంచి అసలు కథ మొదలు. ఎవరా సంపంగి? ఏమిటా కథ? చివరికి ఏమౌతుంది? 

టైటిల్ కింద ఆల్రెడీ "నో లాజిక్- ఓన్లీ మ్యాజిక్" అని క్యాప్షన్ వేసారు కనుక లాజిక్ వెతికే పని అస్సలు పెట్టుకోకూడదు. మ్యాజిక్ కోసమే చూడాలంతే. అయితే ఆ మ్యాజిక్ ఫస్టాఫులో గంట వరకు కనపడదు. ఏవో ఒకటి రెండు డైలాగులు, సీన్లు తప్ప తక్కినదంతా అతిగానో, అతకనట్టుగానో అనిపిస్తుంటుంది. తెర మీద ఏవో కామెడీ సీన్లు అనబడేవి కదులుతున్నా నవ్వు కూడా రాదు. సినిమా తేడా కొట్టేస్తున్నట్టుందనే ఫీలింగ్ బలపడుతున్న సమయంలో నెమ్మదిగా కథ గాడిన పడడం మొదలుపెడుతుంది. ఈ ముగ్గురు భైరవపురంలో చాలెంజ్ ఎదుర్కొని సంపంగి కోటలో ప్రవేశించినప్పటి నుంచి అసలు కామెడీ- హారర్ మొదలవుతుంది. 

"చంద్రముఖి"కి స్పూఫ్ లా అనిపించే ట్రాక్ తో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు నవ్వించారు. ముఖ్యంగా ప్రియదర్శి మొదటిసారి దెయ్యాన్ని చూసే సీనైతే అప్పటివరకు ప్రేక్షకుల్లో ఏర్పడ్డ నీరసాన్ని పటాపంచలు చేస్తుంది. అంత భయంకర పరిస్థితుల్లో కూడా రాహుల్ రామకృష్ణ సైంటిఫిక్ ఏటిట్యూడ్ మరింత నవ్విస్తుంది. సినిమా మొత్తానికి ఈ ముగ్గురే ఆయువుపట్టు. 

కథ చివరికొచ్చేసరికి సెంటిమెంట్ ఫ్లావర్ వచ్చినా, ఎక్కడా హెవీ అవ్వకుండా కామెడీ లిమిట్స్ లోనే ఉంచడం వల్ల పెద్దగా గ్రాఫ్ డౌనవ్వదు. ఆ క్లైమాక్స్ కూడా "అరుంధతి"కి స్పూఫ్ యాంగిల్లా అనిపిస్తుంది. 

పైన చెప్పుకున్నట్టు ఈ సినిమాని ఏ యాంగిల్లో చూడాలో క్యాప్షన్లోనే చెప్పేసారు కనుక దీనిని ఆబ్సర్డ్ హారర్‌ కామెడీ జానర్లో చూసేసి ఎంజాయ్ చేయొచ్చు. 

ఫస్టాఫ్ ని ఇంకొంచెం బలంగా రాసుకుని, అక్కడ కూడా ఏదో విధంగా మంచి కామెడీ ట్రాక్ పడుంటే ఇది ఫుల్ డోస్ వినోదాన్ని అందించిన చిత్రమయ్యుండేది. ప్రస్తుతానికి మాత్రం సగం మాత్రమే వినోదం, సగం సహనపరీక్ష అన్నట్టుంది. 

టెక్నికల్ గా సినిమా ఓకే. కెమెరా వర్క్, గ్రాఫిక్స్ బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లేలో తొలిసగాన్ని ట్రిం చేసుకుని ఉండుంటే బాగుండేది. 

పాటలు మాత్రం వీక్ గా ఉన్నాయి. "స్వామి రారా" తర్వాత ఆ స్థాయి సంగీతం అందించలేకపోతున్నాడు సన్నీ. పాటల్లో స్పార్క్ లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది. ఈ రకం సినిమాలకి నేపథ్యసంగీతం కూడా ఇంకా చాలా బాగుండాల్సిన అవసరముంది. 

డైలాగ్స్ లో బూతులు బాగా దొర్లాయి. ఆ బూతులకైనా "ఎ" ఇచ్చేయాలి! "యు/ఎ" ఏమిటో! 

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు సినిమాని నిలబెట్టేసారు వాళ్ల టైమింగ్ సెన్స్ తో. శ్రీవిష్ణు తన హీరోయిజం వగైరాలని పక్కనపెట్టి కథకి అనుగుణంగా సెకండాఫులోని దెయ్యం ట్రాకులో నటించి మెప్పించాడు. 

ప్రీతి ముకుందన్ పాత్ర నిడివి, ఇంపాక్ట్ పెద్దగా లేదు. పియదర్శికి జంటగా చేసిన అయేషా ఖాన్ మాత్రం చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. మిగిలిన పాత్రధారులంతా ఓకే. 

అంచనాలు తక్కువగా పెట్టుకుని హల్లోకి వెళ్తే ఇంటర్వల్ ముందు ఒకటి రెండు సార్లు మాత్రమే నవ్వుకుని, ఇంటర్వల్ తర్వాత చాలాసేపు నవ్వుకోవచ్చు. ఇదొక ఫార్స్ హారర్ కామెడీ. ఏదీ వాస్తవానికి దగ్గర్లో అనిపించదు. అలా అవకతవకతనంగా రాసుకుని తీయడమే ఈ జానర్. అందులో సగానికి పైగా మార్కులు సాధించిన చిత్రమిది. 

బాటం లైన్: లాజిక్ నాస్తి- నవ్వులు జాస్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?