Pareshan Review: మూవీ రివ్యూ: పరేషాన్

చిత్రం: పరేషాన్ రేటింగ్: 1.75/5 తారాగణం: తిరువీర్, పావని కరణం, బన్నీ అభీరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శృతి రియాన్, రాజు బడిగెల, రవి తదితరులు సంగీతం: యశ్వంత్ నాగ్ కెమెరా: వాసు…

చిత్రం: పరేషాన్
రేటింగ్: 1.75/5
తారాగణం: తిరువీర్, పావని కరణం, బన్నీ అభీరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శృతి రియాన్, రాజు బడిగెల, రవి తదితరులు
సంగీతం: యశ్వంత్ నాగ్
కెమెరా: వాసు పందెం
ఎడిటర్: హరి శంకర్
నిర్మాతలు: సిద్ధార్థ్ రాళ్లపల్లి
దర్శకత్వం: రూపక్ రొనాల్డ్సన్
విడుదల: 2 జూన్ 2023

కొత్త నటీనటులైనా, చిన్న బడ్జెట్ సినిమా అయినా ప్రచారం కొత్తగా ఉంటే యూత్ ఆడియన్స్ కనెక్ట్ అవుతుతున్నారు, ఓపెనింగ్స్ ఇస్తున్నారు. ఈ కోవలో “పరేషాన్” అనే సినిమా యువప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రానా దగ్గుబాటి పనిగట్టుకుని ఈ చిత్రానికి ప్రచారం చేయడం అంచనాలు పెంచింది. ఇంతకీ విషయమేంటో చూద్దాం. 

తన కొడుకు ఇస్సాక్ (తిరువీర్) చదువులో వెనకబడి ఫ్రెండ్స్ తో సమయం వృధా చేస్తున్నందుకు తండ్రి చివాట్లు పెడతాడు. అయినా తన పద్ధతిలో పెద్ద తేడా ఉండదు. తన స్నేహితుడొకడు పోలీస్ కేసులో ఇరుక్కుంటే తండ్రి తనకిచ్చిన యాభైవేల రూపాయలిస్తాడు. 

ఆ డబ్బు వెనక్కి రాక పరేషాన్ అవుతుంటాడు ఇస్సాక్. మరో పక్క తన లవర్ ప్రెగ్నంట్ అని చెప్తుంది. ఆమెకి అబార్షన్ చేయించడానికి డబ్బు కావాలి. మొత్తానికి నానా పరేషాన్ పడి డబ్బు పోగుచేస్తాడు. అది కాస్తా చోరీకి గురౌతుంది. అలా మరొక పరేషాన్. ఇలా మన హీరో పరేషాన్ మీద పరేషాన్ పడడమే ఈ సినిమా. 

తెలంగాణా బ్యాక్డ్రాపులో సినిమాలు మరీ ఎక్కువైపోయి ఎక్కడా కొత్తదనం లేని స్థితికి చేరుకున్నాయి. తెలంగాణా పల్లెటూరు నేపథ్యం, బాధ్యతారహితమైన యువత, తప్ప తాగి మటన్ తింటూ కాలక్షేపం చేయడం..ఇదే తెలంగాణా సంస్కృతి అన్నట్టుగా చూపిస్తున్నారు. ఏవో నాలుగు జోకులు పెట్టి జనం నవ్వారు కాబట్టి అదే గొప్ప సినిమా అనుకోమంటే ఎలా? కథ, కథనం మొదలైనవి ఏవీ లేకుండా ఏవో సన్నివేశాల్ని కుప్పగా పోసేసి తెలంగాణా నేపథ్యంలో యూత్ ఎంటెర్టైనర్ అనుకోమని తీసినట్టుగా ఉంది ఈ చిత్రం. 

పెళ్లి ఊరేగింపులో హీరోని తన తండ్రి పట్టుకోవడం, చర్చ్ ఫాదర్ మీద సన్నివేసాలు, కొన్ని జోకులు తప్పకుండా నవ్విస్తాయి. తక్కినదంతా ప్రేక్షకులకి పరేషానే. 

టెక్నికల్ గా ఈ సినిమా చాలా నీరసంగా ఉంది. సంగీతం, పాటలు పరేషాన్ చేస్తాయి. నిర్మాణ విలువలు కూడా అంతంతమాత్రమే. 

తిరువీర్ నటన మాత్రం బాగుంది. తొలి సినిమా మసూద తోనే తన ట్యాలెంట్ నిరూపించుకున్నాడు. పావని కరణం హీరోయిన్ గా ఓకే. హీరో తండ్రిగా మురళిగౌడ్ బాగా చేసాడు. మిగిలిన వాళ్లల్లో చాలామంది కెమెరా ముందు ఒక్కసారైనా నిలబడాలన్న ఔత్సాహిక నటశూన్యల్లా ఉన్నారు. 

హీరోయిన్ కి ప్రెగ్నెన్సీ ఏమో అని అనుమానం. ఆ డౌట్ తీర్చుకోవడానికి మందుల షాపుకెళ్తే ప్రెగ్నెన్సీ కిట్ ఇస్తారు కదా! అది కూడా తెలియనంత దయనీయమైన స్థితిలో ఈ స్క్రిప్ట్ తయారు చేసుకున్నారంటే ప్రేక్షకుల్ని బాగా తక్కువ అంచనా అయినా వేసుండాలి, లేదా తీసినవాళ్లు నిజయంగానే విషయశూన్యతలో ఉండుండాలి. అయినా కలిసిన రెండో రోజే అబార్షన్ కోసం వెంపర్లాడే జంట ఏ కాలంలో బతుకుతున్న అవివేకులనుకోవాలి! 

డబ్బుల్లేవన్న బాధతో మిత్రులంతా కూర్చుని రోజూ తాగుతుంటారు. దానికి డబ్బెక్కడిదో! అనందానికి, బాధకి అన్నిటికీ తాగుడే పరిష్కారం అన్నట్టుగా పెడుతున్న సీన్స్ ముందు ఎన్ని చట్టబద్ధమైన హెచ్చరికలు చేసినా వృధాయే. 

సినిమాలో విషయం లేనప్పుడు ఇలాంటి లాజిక్కులే పరేషాన్ చేస్తుంటాయి. 

తెలంగాణా యాసలో సినిమా అయితే చాలనుకుని ఏది పడితే అది తీసే చిత్రాల మీద ఇకనుంచి ఒక కన్నేసి ఉంచడం మంచిది. లేకపోతే తెలంగాణా సంస్కృతి ఇంత వరకే అని ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నవాళ్లు అనుకోవచ్చు. 

అందుకే ఈ సినిమాని ప్రొమోట్ చేసిన రానా దగ్గుబాటికి ఒక దణ్ణం పెట్టి ఇంట్లోనే కూర్చోవడం మంచిది. 

బాటం లైన్: ప్రేక్షకులకి పరేషాన్