ఓ సినిమా ఇలా రిలీజ్ అవ్వగానే, అలా ట్విట్టర్ చెక్ చేయడం చాలామందికి అలవాటుగా మారింది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ రిపోర్ట్ చూసేందుకు చాలామంది ట్విట్టర్ చెక్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఈరోజు రిలీజైన అహింస సినిమా ఎలా ఉందో తెలుసుకునేందుకు, నెటిజన్లు ట్విట్టర్ ను ఆశ్రయించారు. ఈ క్రమంలో వాళ్లకు షాకింగ్ పోస్టులు కనిపించాయి.
ఏ సినిమా రిలీజైనా, సోషల్ మీడియాలో తమ సినిమాను మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తారు మేకర్స్. ఈ మేరకు కొన్ని సోషల్ మీడియా ఏజెన్సీల్ని సంప్రదిస్తారు. వాళ్లకు కొంత డబ్బులు ముట్టజెప్పి, సినిమాకు పాజిటివ్ గా ప్రచారం చేయించుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు రిలీజైన అహింస సినిమాకు కూడా సోషల్ మీడియాలో అదే జరిగింది. అందులో తప్పులేదు, కాకపోతే ఆ ప్రయత్నం బెడిసికొట్టింది.
అహింస సినిమాపై తెలుగులో పడిన పోస్టులు చూసి చాలామంది నెటిజన్లు నవ్వుకున్నారు. మరికొంతమంది అసహనం వ్యక్తం చేశారు. థియేటర్లలో అహింస నడుస్తుంటే, ట్విట్టర్ లో మాకేంటి ఈ హింస అంటూ పోస్టులు పెడుతున్నారు. సినిమాపై ట్విట్టర్ లో వచ్చిన కొన్ని తెలుగు కామెంట్స్ చూద్దాం.
“అభిరామ్ షోను దొంగిలించాడు”. “అహింస ప్రేక్షకుల ముందుకు రాకముందే బాక్సులో పడింది”. “పరిస్థితులు అతడ్ని అన్యాయమైన ప్రదేశంలో ఉంచాయి”. “అక్కడ అతను తన సూత్రాల నుంచి బయటకు రావాలి”. “వీక్షకుడు అతడి అంతర్గత యుద్ధం, పెరుగుదల, మార్పుకు సాక్ష్యంగా ఉంటాడు”.
చూడ్డానికి, చదవడానికి ఇది తెలుగే. కానీ దీని అర్థం ఏంటని ప్రశ్నించుకుంటే మాత్రం కళ్లు తేలేయాల్సి వస్తుంది. పొద్దున్నుంచి అహింస సినిమాపై ఇలాంటి పోస్టులు లెక్కలేనన్ని పడుతున్నాయి. ఇవి చూసి నెటిజన్లు కూడా అన్ స్టాపబుల్ గా నవ్వుకుంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలెట్ ఏంటంటే, చాలా ఎకౌంట్లకు డీపీలో కిరణ్ అబ్బవరం ఫొటోలు కనిపించాయి.
సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటించిన అహింస సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించాడు.