Advertisement

Advertisement


Home > Movies - Reviews

రివ్యూ: పటేల్‌ సర్‌

రివ్యూ: పటేల్‌ సర్‌

రివ్యూ: పటేల్‌ సర్‌
రేటింగ్‌: 2/5
బ్యానర్‌:
వారాహి చలనచిత్రం
తారాగణం: జగపతిబాబు, పద్మప్రియ, తాన్య హోప్‌, కబీర్‌ సింగ్‌, సుబ్బరాజు, పోసాని, శుభలేఖ సుధాకర్‌ తదితరులు
మాటలు: ప్రకాష్‌
కూర్పు: గౌతంరాజు
సంగీతం: డి.జె. వసరత్‌
ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె. నాయుడు
నిర్మాత: రజని కొర్రపాటి
కథనం, దర్శకత్వం: వాసు పరిమి
విడుదల తేదీ: జులై 14, 2017

ట్రెయిలర్‌లో జగపతిబాబు గెటప్‌ చూసి, 'కాల్‌ మీ సర్‌' అని కమాండ్‌ చేసే అథారిటీ చూసి 'పటేల్‌ సర్‌'పై హోప్స్‌ ఏర్పడ్డాయి. దురదృష్టవశాత్తూ ఆ ట్రెయిలర్‌ని దాటి ఇందులో చెప్పుకోతగ్గ మరో అంశమంటూ లేదు. ట్రెయిలర్‌ని అంత బాగా కట్‌ చేయించుకున్న దర్శకుడు వాసు పరిమి తన సినిమాని ఎందుంత పకడ్బందీగా రూపొందించలేకపోయాడో మరి? ఎప్పుడో పాతికేళ్ల నాటి 'బి' సినిమా చూస్తున్నట్టుగా ఎవరు చూసినా అరుస్తూ, అతి చేస్తూ 'చివరి వరకు ఎలా కూర్చుంటారో చూద్దాం' అని సవాల్‌ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. 

తెలుగు సినిమాకి అత్యంత ప్రీతిపాత్రమైన 'ప్రతీకారం' పాయింట్‌పై అల్లుకున్న ఈ కథలో జగపతిబాబుని ట్రెండీ అండ్‌ యాంగ్రీ ఓల్డ్‌మ్యాన్‌గా చూపించడమే ప్రత్యేకంగా నిలబెట్టే అంశం. తన కొడుకు కుటుంబాన్ని అంతమొందించిన వారిపై అతను ఎలా పగ తీర్చుకున్నాడు అనేది పటేల్‌ కథాంశం.

అతను హత్యాకాండ సాగిస్తూ వుంటే, వెనక ఇన్వెస్టిగేషన్‌కి వచ్చిన లేడీ పోలీస్‌ అఫీసర్‌ తాన్యా హోప్‌ చేసే ఓవరాక్షన్‌ చూస్తే... పటేల్‌ సార్‌ విలన్ల మీద పగ తీర్చుకుంటూ వుంటే, ఈమె మన మీద ప్రతీకారం తీర్చుకుంటోందా అనిపిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌ మొత్తం గజిబిజి గందరగోళంగా సాగుతూ, ఓవర్‌ ది టాప్‌ యాక్షన్‌తో, సైడ్‌ యాక్టర్ల ఓవరాక్షన్‌తో టార్చర్‌కి డెఫినిషన్‌ సెవెంటీ ఎంఎంలో చూపిస్తుంది. 

ఫస్ట్‌ హాఫ్‌లా గందరగోళంగా కాకుండా కుదురుగా మొదలైన ద్వితీయార్థం కొంత సేపు ఫర్వాలేదనిపిస్తుంది. మనవళ్లకి దగ్గరయ్యే పటేల్‌ తాతలోని మరో కోణాన్ని బాగా ఆవిష్కరించగా, విలన్స్‌ ఎంట్రీతో సెకండ్‌ హాఫ్‌ మరోసారి ఫస్ట్‌ హాఫ్‌ లక్షణాలని ప్రదర్శిస్తూ లౌడ్‌ క్లయిమాక్స్‌ దిశగా సాగిపోతుంది.

ఈ చిత్రాన్ని ఇంత లౌడ్‌గా కాకుండా సటిల్‌గా తీసినట్టయితే ఖచ్చితంగా బెటర్‌ ఇంపాక్ట్‌ వుండేది. టార్గెట్‌ ఆడియన్స్‌ సి సెంటర్‌ ప్రేక్షకులే అన్నట్టుగా తొంభైల నాటి మలయాళ అనువాద చిత్రాల మాదిరిగా లౌడ్‌గా తయారు చేయడంతో జగపతిబాబుకి అంత చక్కగా కుదిరిన స్టయిలింగ్‌ దండగ అయిపోయింది.

జగపతిబాబు కాకుండా కుదురుగా నటించిన వారిలో పద్మప్రియ వుంటుంది. మిగతా వారంతా 'లౌడ్‌ యాక్టింగ్‌'లో పీహెచ్‌డీ పొందిన వారిలా రెచ్చిపోయారు. కానీ ఎవరు ఎంత చేసినా కానీ తాన్యా హోప్‌కే ఈ విషయంలో అగ్ర తాంబూలం దక్కుతుంది. పృధ్వీ, ప్రభాకర్‌, కబీర్‌ల విలనీ తొంభైల కాలంలోకి తీసుకుపోతుంది.

సుబ్బరాజుకి ఒక అనవసరమైన పాట పెట్టి ఏం సాధించాలనుకున్నారనేది దర్శకుడికే తెలియాలి. ఈ పాట మొదలు కాగానే మీ పక్క సీట్లోని వారికేసి చూసి 'సింపతీ' కోరుకోకుండా వుంటే మీరు గ్రేటేనండీ. మనవళ్లతో కలిసి పటేల్‌ పాడుకునే పాట మినహా మిగతా పాటలన్నీ సహనాన్ని పరీక్షిస్తాయి. సాంకేతికంగా చెప్పుకోవాల్సిన గొప్ప సంగతులు ఏమీ లేవు.

దర్శకుడు వాసు కేవలం జగపతిబాబుని న్యూ లుక్‌తో చూపించడం వరకు సక్సెస్‌ అయ్యాడు కానీ మిగిలిన అన్ని విభాగాల్లోను ఫెయిలయ్యాడు. ఎలాగైనా ప్రేక్షకుల్లో చలనం తెప్పించాలని, స్ఫూర్తి రగిలించాలని అతను పడ్డ పాట్లు ఫలితం ఇవ్వకపోగా నవ్వుల పాలయ్యాయి. ఎక్కడికో సీరియస్‌ పని మీద వెళుతోన్న పటేల్‌కి జాతీయ జెండాని ఆవిష్కరిస్తోన్న దృశ్యం కనిపించి బైక్‌ దిగి వచ్చి సెల్యూట్‌ చేస్తాడు.

ఆ వెనకే వచ్చిన తాన్యా హోప్‌ రోడ్డుకి అవతలి వైపు కార్‌ ఆపి, రోడ్డు దాటి వచ్చి మరీ సెల్యూట్‌ కొడుతుంది. దేశభక్తిని రగిలిస్తుందనేది దర్శకుడి ఎక్స్‌పెక్టేషన్‌ కానీ అది అన్‌ఇంటెన్షనల్‌ కామెడీ సీన్‌గా షేప్‌ తీసుకుంది. చివర్లో మరోసారి ప్రేక్షకుల్లో దేశభక్తిని రగిలించే ప్రయత్నం గాట్టిగా జరిగింది. చిన్న పాపతో జాతీయ గీతం పాడించి దేశభక్తిని తట్టి లేపాలని చూసారు. కూలబడిపోయిన వాళ్లంతా శక్తులన్నీ కూడదీసుకుని కుర్చీల్లోంచి లేవడానికి, తద్వారా ద్వారము వైపు సాగడానికి అది అక్కరకొచ్చింది.

పోలీస్‌ క్యారెక్టర్‌ చేసిన తాన్యా హోప్‌ బికినీలో దర్శనమిచ్చి మసాలా దట్టించడానికి చూసింది. ఎన్ని రకాలుగా ట్రై చేసినా కానీ పాతకాలం ప్రతీకార చిత్రాన్ని చూస్తోన్న ఫీలింగ్‌ని పోగొట్టడంలో కానీ, నిట్టూర్పులు విడవకుండా, నిరసనలు వ్యక్తం చేయకుండా కూర్చోబెట్టడంలో కానీ ఇది దారుణంగా ఫెయిలైంది. 

బాటమ్‌ లైన్‌: ఫెడేల్‌!

గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?