డీమానిటైజేషన్.. అదేనండీ పెద్ద పాత నోట్ల రద్దుతో దేశానికి కలిగిన ఉపయోగమేంటో తెలుసా.? ఓ ఇంజనీర్, డ్రగ్స్ డీలర్‌గా మారాడు.! నమ్మలేకపోతున్నారా.? అయితే, తెలంగాణ పోలీసుల్ని అడిగి చూడండి.! నిజ్జంగా నిజమిది. తెలంగాణలో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది ప్రభుత్వం. పలువురు సినీ ప్రముఖులకు ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి నోటీసులు అందాయి. మొత్తం 13 మంది (ఇందులో సినీ ప్రముఖులెవరూ లేరు) ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యారు.
తాజాగా, ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీయూష్ అనే ఈ వ్యక్తి గతంలో ఇంజనీర్‌గా పనిచేశాడు. అదీ డిమానిటైజేషన్‌కి ముందు. డీమానిటైజేషన్ దెబ్బకి ఇంజనీర్ పీయూష్ కాస్తా, నిరుద్యోగి పీయూష్‌గా మారాడు. అక్కడినుంచి, పీయూష్ డ్రగ్స్ వ్యాపారం వైపు తన ఆలోచనల్ని మళ్ళించాడు. డ్రగ్స్‌ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం, ఇంటర్నెట్ పరిజ్ఞానంతో ఇంట్లోనే డ్రగ్స్ తయారు చేయడం నేర్చుకున్నాడు. ఇంకేముంది, డ్రగ్స్ వ్యాపారిగా అవతారమెత్తేశాడు పీయూష్.
ఆసక్తికరమైన ఇంకో కోణమేంటంటే, పీయూష్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తూ, సినీ ప్రముఖులకు దగ్గరయ్యాడట. టాలీవుడ్ నటుడు నవదీప్, పీయూష్ కారణంగా ఇప్పుడీ డ్రగ్స్ వివాదంలో ఇరుక్కున్నాడు. ఓ ఈవెంట్ సందర్బంగా కొంతమందిని తాను కలిసిన మాట వాస్తవమనీ, వారిలో డ్రగ్స్ డీలర్స్ వున్నారని తనకు అప్పట్లో తెలియదని నవదీప్ వివరణ ఇచ్చాడనుకోండి.. అది వేరే విషయం.
ఓ వ్యక్తి నేరస్తుడిగా మారడానికి అనేక కారణాలుంటాయి. చిత్రంగా, డీమానిటైజేషన్ ఓ వ్యక్తిని ఈ రోజు నేరస్తుడిగా మార్చేసింది. ఓ ఇంజనీర్‌ని డ్రగ్స్ వ్యాపారిగా, డ్రగ్స్ తయారీదారుగా మార్చేసింది. గతంలో పీయూష్‌కి నేర చరిత్ర వున్నట్లు తమకేమీ సమాచారం లేదని ఆయన్ని అరెస్ట్ చేసిన పోలీసులే చెబుతుండడం గమనార్హం.
నమో.. నరేంద్రమోడీజీ.. మీ డీమానిటైజేషన్ దెబ్బకి, దేశం బాగుపడ్డం సంగతి దేవుడెరుగు.. ఉడ్తా భారత్ అయిపోతోందనుకోవాలా.?