పోటుగాడు: అదుపు తప్పిన ‘పోటుగాడు’!

సినిమా రివ్యూ: పోటుగాడు రివ్యూ: పోటుగాడు రేటింగ్: 2.5/5 బ్యానర్: రామలక్ష్మి సినీ క్రియేషన్స్ తారాగణం: మంచు మనోజ్, సాక్షి చౌదరి, సిమ్రన్ కౌర్, అనుప్రియ, రేచల్, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, చంద్రమోహన్ తదితరులు…

సినిమా రివ్యూ: పోటుగాడు
రివ్యూ: పోటుగాడు
రేటింగ్: 2.5/5

బ్యానర్: రామలక్ష్మి సినీ క్రియేషన్స్
తారాగణం: మంచు మనోజ్, సాక్షి చౌదరి, సిమ్రన్ కౌర్, అనుప్రియ, రేచల్, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, చంద్రమోహన్ తదితరులు
మాటలు: శ్రీధర్ సీపాన
కూర్పు: ఎం.ఆర్. వర్మ
సంగీతం: అచ్చు 
ఛాయాగ్రహణం: శ్రీకాంత్
నిర్మాత: శిరీష శ్రీధర్
కథ, కథనం, దర్శకత్వం: పవన్ వడేయార్
విడుదల తేదీ: సెప్టెంబర్ 14, 2013

మోహన్‌బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ హీరోగా పరిచయమై చాలా కాలమవుతోంది. అయితే అతనికి హీరోగా గుర్తింపైతే వచ్చింది కానీ స్టార్ స్టేటస్ మాత్రం రావడం లేదు. సెక్సస్‌ఫుల్ సినిమాల కంటే ఫెయిల్యూర్సే ఎక్కువ ఉన్న మనోజ్ కన్నడలో విజయవంతమైన ‘గోవిందాయనమః’ చిత్రాన్ని తెలుగులో ‘పోటుగాడు’ పేరుతో రీమేక్ చేశాడు. కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించిన పవన్ తెలుగు రీమేక్‌ని కూడా డైరెక్ట్ చేశాడు. 

కథేంటి?
గోవిందు (మనోజ్) ఆత్మహత్య చేసుకోవడానికని ఒక సూసైడ్ స్పాట్‌కి వస్తాడు. అక్కడికి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (పోసాని) గోవిందుతో తన ఫెయిల్యూర్ లవ్‌స్టోరీ గురించి చెపకుంటాడు. ఆ తర్వాత తానెందుకు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చాననేది గోవిందు తన కథలో చెప్తాడు. 

కళాకారుల పనితీరు!
మంచు మనోజ్ నటుడిగా పరిచయమైన కొత్తల్లో మంచి ఈజ్‌తో నటించేవాడు. అయితే రాను రాను ఆ ఈజ్ కాస్తా శృతి మించి అతిగా రూపాంతరం చెందింది. అతని గత రెండు చిత్రాలు ‘మిస్టర్ నూకయ్య’, ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’లో అయితే ఈ ఓవరాక్షన్ మరీ అవధులు దాటిపోయింది. డైరెక్టర్స్ కంట్రోల్ చేయకపోవడం వల్ల అలా అదుపు తప్పాడేమో అనుకుని ఉంటే పొరబడ్డట్టే. ఎందుకంటే తన మీద తనేక కంట్రోల్ లేదని ఈ చిత్రంలో ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ప్రతి సీన్‌లోను మనోజ్ శృతి మించి నటించాడు. కామెడీ ప్రధాన పాత్ర కావడంతో అస్సలిక వెనకా ముందు చూడకుండా ఓవరాక్షన్ చేసేశాడు. ఎంత ఓపిగ్గా చూసినా కానీ ఏదో ఒక చోట ఫ్రస్ట్రేట్ అయిపోయే లెవల్లో ఇరిటేట్ చేశాడు. తన స్టంట్స్ తనే కంపోజ్ చేసుకోవడం, రియలిస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఆకట్టుకోవాలని చూడడం వంటి పాజిటివ్ పాయింట్స్ ఉన్న మనోజ్ నిజానికి బ్యాడ్ యాక్టరేం కాదు. కాకపోతే ఎంత చేస్తే సరిపోతుందో, ఎక్కడితో ఆపేస్తే బాగుంటుందో అనేది అతనికి అర్థమవుతున్నట్టు లేదు. దానికి తోడు అవసరం ఉన్నా, లేకపోయినా కానీ తన తండ్రి మాడ్యులేషన్‌ని ఇమిటేట్ చేయడం మరో మైనస్. మనోజ్‌లోని ఈ ‘అతి’ని ఇష్టపడే వాళ్లు ఎవరైనా ఉన్నారేమో తెలీదు కానీ… దీనిని ఇష్టపడని వాళ్లే ఎక్కువ ఉంటారనేది మాత్రం నిజం. కాబట్టి ఎవరిని ఆకట్టుకోవాలనేది తనే ఆలోచించుకోవాలి.

నలుగురు హీరోయిన్లున్న ఈ చిత్రంలో ఎవరికీ చెపకోతగ్గ పాత్ర లేదు. వారిలో ఒక్కరు కూడా అసలు హీరోయిన్‌లా కనిపించలేదు. వారి నటన గురించి మాటల్లేవు, మాట్లాడుకోవడాల్లేవు! పోసాని లవ్‌స్టోరీ, అతనిపై తీసిన పేరడీ సాంగ్స్ మాస్ ప్రేక్షకులని ఆకట్టుకోవచ్చు. 

సాంకేతిక వర్గం పనితీరు:
కన్నడ వెర్షన్‌లోని రెండు హిట్ సాంగ్స్ ఇందులో యథాతథంగా వాడుకున్నారు. అచ్చు సంగీతం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. టాలెంట్ బ్రహ్మాండంగా ఉన్నా అచ్చుకి ఇంకా బ్రేక్ రావడం లేదెందుకో మరి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌కి వంక పెట్టడానికేం లేదు. తక్కువ బడ్జెట్‌లో తీసిన సినిమా అయినా ఫ్రేమ్స్ రిచ్‌గా ఉన్నాయి. ఎంచుకున్న లొకేషన్స్ కూడా బాగున్నాయి. డైలాగ్ రైర్ ప్రాస కోసం తెగ పాకులాడాడు. ఫస్టాఫ్ అంతా డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో నింపేశాడు. 

దర్శకుడు సింపుల్ స్టోరీని తీసుకుని స్పీడ్‌గా నెరేట్ చేశాడు. అక్కడక్కడా కామెడీ కూడా బాగానే అనిపిస్తుంది కానీ గుర్తుంచుకునే సీన్స్ ఏమీ లేవు. జస్ట్ ఒక టైమ్‌పాస్ చిత్రంగా పనికొస్తుంది. కాకపోతే లీడ్ యాక్టర్‌ని అదుపులో ఉంచుకుని, అతడి నుంచి కావాల్సింది రాబట్టుకోవడం కూడా దర్శకుడి పనే. ఆ విషయంలో పవన్ ఫెయిలయ్యాడు. 

హైలైట్స్:

  • పాటలు (అన్నీ బాగున్నాయి)
  • నిడివి (సరిగ్గా రెండు గంటలు)

డ్రాబ్యాక్స్:

  • మంచు మనోజ్ ఓవరాక్షన్
  • సిల్లీ క్లయిమాక్స్ సీన్

విశ్లేషణ:

కామెడీ పండించడానికి చేసిన ప్రయత్నం కాబట్టి లాజిక్కుల గురించి అంతగా ఆలోచించకూడదు. హీరోకి నాలుగు లవ్‌స్టోరీలు… ప్రతి హీరోయిన్‌తో ఒక పాట… ఆ పాట అయిన వెంటనే బ్రేక్ అప్! సింపుల్‌గా ఇదే ‘పోటుగాడు’ కథ. ఈ కథని ఇంట్రెస్టింగ్‌గా ఓపెన్ చేసిన దర్శకుడు అదే ఇంట్రెస్ట్ కలిగించే పిట్ట ప్రేమకథలు రాసుకోలేకపోయాడు. 

కామెడీ కోసం ట్రై చేశారు కానీ హాయిగా నవ్వించే సీన్స్ ఏమీ లేవు. నీట్ కామెడీ పండించలేక ద్వందార్థాలపై ఆధారపడ్డారు. అలాంటి కామెడీ ఇష్టపడే వారిని ఆ బూతు జోకులు అలరించవచ్చు. క్లయమాక్స్‌కి ముందు వచ్చే ట్విస్ట్ బాగుంది. సినిమా మొత్తంలో మనోజ్ కంట్రోల్డ్‌గా చేసిన సీన్ కూడా అదే. అయితే మరోసారి కామెడీ పేరుతో క్లయిమాక్స్‌ని కంగాళీ చేశారు. అంతవరకు ప్రేమ విలువ తెలియని వాడు నిజంగా ప్రేమంటే ఏంటో తెలుసుకున్నాడని, తన తప తెలుసుకుని మారాడని చెప్పడం వరకు బాగుంది. కానీ అంతకుముందు అతను చేసింది కూడా మంచి కోసమే అన్నట్టు కవర్ చేయాలని చూడడం బలవంతపు మంచితనం ఆపాదించినట్టు అనిపిస్తుంది.

సన్నివేశాల్లో ఆకట్టుకునేవి తక్కువే అయినా కానీ సినిమా చాలా వేగంగా సాగిపోతుంది. రెండు గంటల్లో శుభం కార్డు పడిపోతుంది. ఈ సినిమాకి సంబంధించి ఇదో పెద్ద ప్లస్ పాయింట్ అనుకోవాలి. లేదంటే ఆ అతిని ఎక్కువ సేపు భరించాల్సి వస్తే.. పాజిటివ్ పాయింట్స్‌ని కూడా కేర్ చేయకుండా పూర్తిగా ఫ్రస్ట్రేట్ అయ్యే ప్రమాదముంది. ‘లౌడ్ కామెడీ’ అయినా ఎంజాయ్ చేస్తామనుకునే వాళ్లు, మంచు మనోజ్ ఎంత శృతి మించినా తట్టుకుంటామనే వాళ్లు ఈ ‘పోటుగాడు’ని ఒకసారి చూడొచ్చు. తక్కువ బడ్జెట్‌లో తీశారు కాబట్టి, ద్వందార్థ సంభాషణలతో హాస్యం పుట్టించడానికి ప్రయత్నించారు కాబట్టి… అన్నిటికీ మించి మంచి పాటలున్నాయి కాబట్టి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సేఫ్ మూవీ కావచ్చు. బట్ కంటెంట్ పరంగా జస్ట్ ఓకే మూవీ. మస్ట్ వాచ్ అయితే డెఫినెట్‌గా కాదు!

బోటమ్ లైన్: అదుపు తప్పిన ‘పోటుగాడు’!

 విహారి