కొంతమంది దర్శకుల జాతకం చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్క హిట్టూ కొట్టకపోయినా, ఏదో ఓ సినిమా చేతిలో ఉంచుకొని బండిలాగించేస్తుంటారు. ఇంకొందరు.. చేతిలో విజయాలున్నా సినిమాలుండవు. శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి ఇలాగే ఉంది. కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో సృజనాత్మక దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నాడు శ్రీకాంత్.
‘సీతమ్మ….‘ లాంటి భారీ విజయం తరవాత కూడా ఇంతకాలం ఖాళీగా ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. కథలు రాసుకోవడంలో, రాసుకొన్న కథని ఒప్పించడంలో కాస్త పద్ధతులు పాటించే శ్రీకాంత్.. జోరుగా సినిమాలు చేయలేకపోతున్నాడు. గొల్లభామ కథ సిద్ధం చేసుకొన్నా.. ఇప్పటి వరకూ ఈ స్క్రిప్టులో హీరో ఎవరు అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌తో అనుకొన్నారు గానీ, అది సాధ్యం కాలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడీ దర్శకుడు.
నిజానికి సీతమ్మ వాకిట్లో కథ ముందు విన్నది పవనే. చేస్తా అని మాటిచ్చి, చివరి నిమిషంలో విత్ డ్రా అయ్యాడు. ఈసారి మాత్రం శ్రీకాంత్ సినిమా చేయడం గ్యారెంటీ అని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. పీవీపీ సినిమాస్ సంస్థలో పవన్ ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు. ఈ సినిమా శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తాడని సమాచారవ్ు. మరి ఈసారైనా పవన్‌కి కథ చెప్పి ఒప్పిస్తాడో లేడో చూడాలి.